రాష్ట్ర రాజకీయాల్లో త్వరలోనే పెను మార్పులు : కేటీఆర్

by Disha Web Desk 23 |
రాష్ట్ర రాజకీయాల్లో త్వరలోనే పెను మార్పులు :  కేటీఆర్
X

దిశ,ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో త్వరలోనే పెను మార్పులు రానున్నాయని, స్వయంగా ముఖ్యమంత్రే బీజేపీ పార్టీలో చేరే అవకాశం ఉందని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అర చేతిలో వైకుంఠం చూపి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని మాత్రం విస్మరిస్తోందని ఆక్షేపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ తరపున పని చేస్తున్నారో... లేక ప్రధాని మోడీ తరపున పని చేస్తున్నారో స్పష్టం చేయవలసిన అవసరముందని అన్నారు.

ఆదిలాబాద్ పట్టణంలోని గాయత్రి గార్డెన్స్ లో మంగళవారం నిర్వహించిన పార్లమెంట్ నియోజకవర్గ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తల జయజయ ధ్వానాల నడుమ సమావేశానికి హాజరైన కేటీఆర్ కు మాజీ మంత్రి, బీ.ఆర్.ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న, ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు తదితరులు సాదరంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా బూత్ స్థాయి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసిన నేతలు... పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త నడుం బిగించాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల ముందుంచి... గత బీ.ఆర్.ఎస్ ప్రభుత్వ హయంలో చేసిన అభివృద్ధిని వివరించాలని సూచించారు.

కేటీఆర్ మాట్లాడుతూ... రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకోవడం ఖాయమని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా బీజేపీ పార్టీలో చేరతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో పదవులు అనుభవించిన వారు పార్టీని వీడిన... ఎటువంటి ప్రమాదం లేదని, పార్టీకి కార్యకర్తలే బలమని అన్నారు. ఉద్యమ సమయంలోనూ కార్యకర్తలే పార్టీ వెన్నంటి నడిచిన విషయాన్ని గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల వేళ అనేక హామీలు ఇచ్చి వంద రోజుల్లోనే వాటిని నెరవేరుస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ... ప్రస్తుతం వాటి అమలులో నిర్లక్ష్య వైఖరి వహిస్తోందని మండిపడ్డారు. రెండు లక్షల రుణ మాఫీపై తాజాగా ముఖ్యమంత్రి కొత్త కథ చెప్తున్నారని ఆరోపించారు. విద్యుత్, సాగునీరు, రైతుబంధు సాయం,పంటల కొనుగోలు వంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని ఆక్షేపించారు.తండాలు, గూడల్లో జరిగిన విష ప్రచారాన్ని ప్రారంభించారు తిప్పికొట్టలేకపోయామని, ప్రస్తుతం ఆ పరిస్థితి పునరావృతం కావోద్దని హితభోద చేశారు. ప్రజలంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, గ్రామాల్లో ఈ విషయాలపై చర్చించాల్సిన బాధ్యత శ్రేనులపై ఉందని సూచించారు. గెలిచిన తొలి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం మాటపై నిలబడాలని అన్నారు.

గతంలో టేట్ పరీక్షకు నాలుగు వందల ఫీజు ఉంటె గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ నేతలు.. ప్రస్తుతం రెండు వేల ఫీజు ఎందుకు వసూలు చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఆదివాసీల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేలా బృహత్తర పథకాలు, కార్యక్రమాలను అమలు చేశామని వివరించారు. అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా ప్రజలకు చేసిందేమీ లేదని, ఆదిలాబాద్ లో ఎయిర్ పోర్ట్, సిసిఐ పునరుద్ధరణ వంటి అభివృద్ధి కార్యక్రమాలను నిలిపివేసిన పార్టీకి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని దుష్ప్రచారం చేసిన వారికి సరైన రీతిలో సమాధానం చెప్పాలని, బీజేపీలో బడా నేతలను ఓడించింది బీ.ఆర్.ఎస్ అభ్యర్తులేనని అన్నారు.కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రధానిపై విమర్శలు చేస్తుంటే.. రేవంత్ రెడ్డి మాత్రం ప్రధానిని బడే భాయ్ అంటూ పొగడ్తలతో ముంచేత్తుతున్నారని ఎద్దేవ చేశారు. రేవంత్ రెడ్డి ఎవరి కోసం పని చేస్తున్నారో స్పష్టం చేయవలసిన అవసరముందన్నారు. సమావేశంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఎమ్మెల్సీ దండె విట్టల్, నిర్మల్ జడ్పీ చైర్మన్ విజయలక్ష్మి, ఉమ్మడి జిల్లా పార్టీ సీనియర్ నాయకులు బాల్క సుమన్, రమాదేవి, విలాస్, కిరణ్, శ్యామ్ సుందర్, సుభాష్, కొమురం భీం మనవడు సోనే రావు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed