అరేయ్ ఎలా ఉన్నారు రా..!

by Disha Web Desk 20 |
అరేయ్ ఎలా ఉన్నారు రా..!
X

దిశ ప్రతినిధి నిర్మల్ : అరే వేణు ఎలా ఉన్నావురా సన్నగా ఉండేవాడివి ఎంత లావు అయ్యావు రా... ఈ సూరిగాడు... పొట్టోడు ఇంకా అట్లనే ఉన్నడు అవే మాటలు... అవే జోకులు..! ఏందిరా బై మన ప్రధానాచారి సూర్యనారాయణ సార్ అట్లనే ఉన్నడు... మనం ముసలోల్లమవుతున్నం... సార్ మాత్రం అట్లనే ఉన్నడు గట్టిగ కదరా బై..! సాయి గాడు అదృష్టవంతుడు... పెండ్లాం మొగుడు ఇద్దరు ఎంప్లాయిస్. వాణి హైదరాబాద్ లో కమిషనర్ అయింది గ్రేట్ కదరా..! మనం ఉన్నంతల అందరం మంచిగనే ఉన్నం.

పాపం రవిగాడు ( పేరు మార్చాం) ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నడు... వాడికి ఏమైనా చేయాలిరా...! ఈ ఆత్మీయ ముచ్చట్లకు నిర్మల్ జిల్లా కేంద్రంలోని మారుతి ఇన్ హోటల్ వేదికైంది సరిగ్గా మూడు దశాబ్దాల క్రితం అంటే 1992- 93 సంవత్సరంలో పదోతరగతి పూర్తి చేసిన శ్రీ సరస్వతి శిశు మందిర్ పూర్వవిద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. అన్ని మరిచిపోయి తమ కష్టసుఖాలు పంచుకున్నారు. ఆనాటి గురువులను స్మరించుకొని కార్యక్రమానికి హాజరైన వారిని సత్కరించారు.

సుమారు 120 మంది మిత్రులు కార్యక్రమానికి హాజరై రోజంతా ఉల్లాసంగా గడిపారు కొందరు విదేశాల నుంచి కూడా తమ మిత్రులను కలిసేందుకు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భవిష్యత్తులో తాము చదువుకున్న పాఠశాలను బాగుపరిచేందుకు విరాళాలు ఇవ్వాలని నిర్ణయించారు. అదే పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులను తమతో పాటు చదువుకున్న మిత్రుల పేద కుటుంబాలను ఆదుకోవాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమం ఆద్యంతం ఆసక్తిగా ఉల్లాసబరితంగా జరగడంతో బరువెక్కిన హృదయాలు తమ మిత్రుల పలకరింపుతో తేలికై నింపాదిగా వెనుదిరిగారు.

Next Story