- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
'ధరణి' పోర్టల్‌పై అసెంబ్లీలో కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం
దిశ, తెలంగాణ బ్యూరో: 'ధరణి' పోర్టల్‌పై అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం చోటుచేసుకున్నది. ఈ విధానంలో అక్రమాలు జరుగుతున్నాయని, నిషేధిత, అసైన్డ్ భూముల విషయంలోనూ అనూహ్యమైన మార్పులు జరుగుతున్నాయని కాంగ్రెస్ సభ్యుడు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ప్రస్తావించారు. దీనికి మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. 'ధరణి'లో లోపాలు ఉన్నది నిజమేనని, కానీ అవి చిన్నచిన్న పొరపాట్లేనని, వాటిని చక్కదిద్దే పనులు జరుగుతూ ఉన్నాయని, ఇప్పటికే మాడ్యూల్స్ మార్పు జరిగిందని వ్యాఖ్యానించారు. అవి రెవెన్యూ వ్యవస్థకు సంబంధించినవి కావని, సాఫ్ట్ వేర్‌తో వచ్చిన చిక్కులని, ఇప్పటికే దాదాపు 95% మేర దిద్దుబాటు ప్రక్రియ పూర్తయిందన్నారు. మరికొన్ని రోజుల్లో మొత్తం సర్దుకుంటుందని, అద్భుతమైన విధానంగా అవతరిస్తుందన్నారు.
ధరణి అద్భుతమైన విధానమంటూ ప్రభుత్వం చెప్పుకుంటున్నా అసెంబ్లీ వేదికగా జరిగిన చర్చలో మాత్రం కొన్ని లోపాలున్నది నిజమేనని, కానీ వాటిని భూతద్దంలో పెట్టి చూడాలనుకోవడం మంచి పద్ధతి కాదని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. సవ్యంగా ఉన్న అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా చిన్న లోపాలను మాత్రమే పట్టుకుని వేలాడడం సహేతుకం కాదన్నారు. ఒకటీ రెండు లోపాలను చూపించి మొత్తం విధానమే మంచిది కాదని, రాష్ట్రమంతా ఇలాగే జరుగుతున్నదంటూ గందరగోళం సృష్టించడం తగదన్నారు. నిజంగా ధరణిని రద్దు చేయాలన్నదే కాంగ్రెస్ విధానమైనట్లయితే దాన్నే పార్టీ లైన్‌గా చెప్పాలని డిమాండ్ చేశారు. ధరణితో రైతులకు ఏ మాత్రం లాభం లేదని పార్టీ విధానంగానే చెప్పగలరా అని ఆ పార్టీ ఎమ్మెల్యేలను నిలదీశారు.
ధరణి పోర్టల్‌తో తలెత్తుతున్న సమస్యలు, రెవెన్యూ అధికారులు చక్కదిద్దలేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు తిప్పలు పడుతున్నారు. అన్ని పత్రాలూ ఉన్నప్పటికీ ఆ భూమి ఎవరి పేరుమీదకు ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదనే గందరగోళం నెలకొన్నది. గతంలో ఈ సమస్యలు ప్రభుత్వం దృష్టి రావడంతో మంత్రులతో సబ్ కమిటీ సైతం ఏర్పడింది. రెవెన్యూ అధికారులతో ఈ కమిటీ రివ్యూ చేసింది. ఆ తర్వాత ముఖ్యమంత్రికి సమర్పించింది. అందులో భాగంగా కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. రెవెన్యూ శాఖకు మంత్రి లేకపోవడంతో ముఖ్యమంత్రే చూస్తున్నారు. రెవెన్యూ శాఖకు కార్యదర్శి సైతం లేకపోవడంతో ప్రధాన కార్యదర్శిగా ఉన్న సోమేశ్ కుమారే చూశారు. ఇటీవల మార్పుల్లో భాగంగా నవీన్ మిట్టల్‌ను సీఎస్ శాంతి కుమారి రెవెన్యూ కార్యదర్శిగా నియమించారు.
ధరణి లోపాలను, రైతుల ఇబ్బందులను కాంగ్రెస్ సభ్యులు అసెంబ్లీలో ప్రస్తావిస్తే ఆ శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి సభలో లేకపోవడంతో మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి స్పందించాల్సి వచ్చింది. నిన్నమొన్నటివరకూ రోడ్ల మీద ధరణి బాధితులుగా నిరసనలు చేస్తే ఇప్పుడు అసెంబ్లీ వేదికగానే చర్చ జరగడం గమనార్హం. లోపాలు ఉన్నట్లు విపక్ష సభ్యులు ప్రస్తావించడం మాత్రమే కాక మంత్రులే అవి నిజమేనని ఒప్పుకున్నారు. అయితే అవి చిన్న చిన్న లోపాలు మాత్రమేనంటూ సమర్ధించుకున్నారు. అమల్లోకి వచ్చి ఏడాది దాటినా ఇప్పటికీ సమస్యలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. శాఖాపరమైన తప్పిదాలు కావని, సాఫ్ట్ వేర్ తో వచ్చిన చిక్కులంటూ మంత్రులు ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది.
తప్పు ధరణిది కాదు.. సాఫ్ట్ వేర్ ది..
ధరణి పోర్టల్ నిజంగా ఫెయిల్ అయినట్లయితే రైతులు సంతోషంగా ఎందుకుంటారని ఎదురు ప్రశ్నించారు. ధరణి అమల్లోకి రాకపూర్వకం ఆరేళ్ళ వ్యవధిలో రాష్ట్రం మొత్తం మీద 30 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయని, కానీ ఈ విధానం వచ్చిన తర్వాత సంవత్సరం కాలంలోనే సుమారు 24 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయన్నారు. కాంగ్రెస్ హయాంలో లంచం లేకుండా రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరిగేవి కావన్నారు. రైతులను రాక్షసంగా ఇబ్బంది పెట్టిందని వ్యాఖ్యానించారు. ఇకపై కూడా అలాంటి ఇబ్బందులే ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నదా అని ప్రశ్నించారు. రైతులను పీడించడం, వారి పట్ల కర్కశకంగా వ్యవహరించడమే ఆ పార్టీ విధానమంటూ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు చెప్పదలుచుకున్నారా అని అన్నారు. లంచగొండితనాన్ని కొనసాగించాలని కాంగ్రెస్ కోరుకుంటూ ఉంట దాన్ని స్పష్ట, చేయాలని డిమాండ్ చేశారు.
ఒకవైపు ఆ పార్టీ స్టేట్ చీఫ్ రేవంత్‌రెడ్డి ధరణిని రద్దు చేస్తామంటూ చెప్తుంటే శ్రీధర్‌బాబు మాత్రం తమ పార్టీ అధ్యక్షుడు అలా అనలేదంటూ చెప్తున్నారని, ఆ పార్టీ నేతలకు స్పష్టత లేదన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీని, నాయకులను ప్రజలు పట్టించుకోవడం లేదని, డిపాజిట్లు కూడా రావడం లేదన్నారు. అధ్యక్షుడికి, నాయకులకు సమన్వయం లేదన్నారు. ధరణిని ఎత్తేయడమే కాంగ్రెస్ విధానమా? ప్రగతి భవన్‌ను బాంబులతో పేల్చేయాలనడం దాని సిద్ధాంతమా? ఇది ఆ పార్టీ వైఖరేనా?.. అంటూ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయిలో ఉన్నదని, ఇకనైనా ఆ పార్టీ విధానం ప్రకారం నేతల వైఖరి మారాలని హితవు పలికారు.
మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో భూ సమస్యల పరిష్కారం కోసం స్థానికంగా ఉండే కాంగ్రెస్ పార్టీ నేతలతో పైరవీలు చేయించుకోవాల్సి వచ్చేదని, లంచాలు ముట్టచెప్పాల్సి వచ్చేదన్నారు. రెవెన్యూ ఆఫీసుల చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సి వచ్చేదని, తెలంగాణలో అప్పటి పరిస్థితుల గురించి ఏ రైతును అడిగినా చెప్తారన్నారు. రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత పట్టాదారు పాస్‌బుక్‌ని జేబులో పెట్టుకుంటే అన్నీ ఆన్‌లైన్‌లోనే ప్రత్యక్షమవుతాయని, ఏ ఆఫీసు చుట్టూ తిరగాల్సిన అవసరమే లేదని ప్రశాంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఒక్క ఏడాదిలో దాదాపు 24 లక్షల రిజిస్ట్రేషన్లు జరగడం ఆ విధానంలోని ప్రత్యేకతకు నిదర్శనమని, భవిష్యత్తులో ఇది రైతులకు, ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.