అంబేడ్కర్ విగ్రహావిష్కరణలో సీఎం.. తుపాకీతో వ్యక్తి కలకలం

by Disha Web Desk 7 |
అంబేడ్కర్ విగ్రహావిష్కరణలో సీఎం.. తుపాకీతో వ్యక్తి కలకలం
X

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి పాల్గొన్న అంబేడ్కర్ విగ్రహావిష్కరణ పరిసర ప్రాంతాల్లో గన్‌తో ఒక వ్యక్తి సంచరించడం కలకలం సృష్టించింది. బందోబస్తు డ్యూటీలో ఉన్న పోలీసులను దిగ్భ్రాంతికి గురిచేసింది. లాంగ్ రైఫిల్‌తో వచ్చిన వ్యక్తిని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన డ్రైవర్ వద్దినేడి శివప్రకాష్‌ (28)గా పోలీసులు గుర్తించారు. రైఫిల్‌‌తో పాటు లైవ్ తూటాలు కూడా అతని దగ్గరి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ముందుగానే పోలీసులు గుర్తించడంతో అవాంఛనీయ సంఘటన జరగకుండా నివారించినట్లయింది. హై లెవల్ సెక్యూరిటీతో ఉండే ముఖ్యమంత్రి పాల్గొనే సభలో తుపాకీతో సహా శివప్రకాశ్ అక్కడికి చేరుకున్న సంఘటనపై పోలీసులు ఆలస్యంగా మీడియాకు వెల్లడించారు. అక్కడికక్కడే శివప్రకాశ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన తర్వాత వెలుగులోకి వచ్చిన వివరాలను పోలీసులు బహిర్గతం చేశారు.

ఆర్మీలో పని చేసిన గురు సాహెబ్ సింగ్ 2021 ఆగస్టు 31న రిటైర్ అయ్యారని, ఆయన వ్యక్తిగత భద్రత కోసం జమ్ము కాశ్మీర్ (పూంఛ్ జిల్లా) రాష్ట్ర పోలీసు శాఖ నుంచి లాంగ్ రైఫిల్, పిస్టల్ కోసం లైసెన్సు పొందారని, సోమాజీగూడకు చెందిన యూ-ట్యూబర్ దొండ్ల మధు యాదవ్‌కు నెలకు రూ. 60 వేల వేతనానికి ఈ నెల 1వ తేదీ నుంచి ప్రైవేట్ గన్‌మాన్‌గా పనిచేస్తున్నారని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. మధు యాదవ్‌కు వ్యక్తిగత భద్రత కోసం గన్‌మాన్‌ను నియమించుకునేందుకు హైదరాబాద్ పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి/లైసెన్సు పొందలేదని వివరించారు. అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మధు యాదవ్‌ వెంట గన్‌మాన్‌గా గురు సాహిబ్ సింగ్ కూడా వచ్చారని, అయితే సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆ లాంగ్ రైఫిల్‌ను డ్రైవర్ శివప్రకాశ్‌కు ఇచ్చారని, ఇది నిబంధనలకు విరుద్ధమని పోలీసులు తెలిపారు.

ఈ ముగ్గురూ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సమయంలో ముఖ్యమంత్రి అక్కడ ఉండగానే లోపలికి ప్రవేశించడానికి వెళ్తున్నప్పుడు బందోబస్తు డ్యూటీలో ఉన్న పోలీసులు గుర్తించి వారిని నిలువరించారని హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ ఆ ప్రకటనలో తెలిపారు. హై లెవల్ సెక్యూరిటీ ఉన్న ముఖ్యమంత్రి పాల్గొనే ప్రోగ్రామ్‌లో నిబంధనలకు విరుద్దంగా గన్‌తో పాటు వీరు ప్రవేశించడాన్ని తప్పుపట్టిన పోలీసులు ఆ ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. ఆయుధ చట్టంలోని సెక్షన్ 25-1-బీ-ఏ, 30 కింద కేసు (క్రైమ్ నెం. 157/2023) నమోదు చేసినట్లు డీసీపీ వివరించారు. నిబంధనలకు విరుద్దంగా లాంగ్ రైఫిల్‌ను పట్టుకున్న డ్రైవర్ శివప్రకాశ్‌ను ఏ-1గా, గన్ లైసెన్సు ఉన్న గురు సాహిబ్ సింగ్‌ను ఏ-2గా, యూట్యూబర్ మధు యాదవ్‌ను ఏ-3గా సైఫాబాద్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వీరిని శనివారం సాయంత్రం కోర్టులో హాజరుపరిచారు.

Next Story

Most Viewed