‘దేశంలో ఎక్కడ పేలుళ్లు జరిగినా హైదరాబాద్‌కు లింక్’

by Disha Web Desk 4 |
‘దేశంలో ఎక్కడ పేలుళ్లు జరిగినా హైదరాబాద్‌కు లింక్’
X

దిశ, తెలంగాణ బ్యూరో : కర్ణాటక ఎన్నికల్లో తాము ఎగ్జిట్స్ పోల్స్‌ను నమ్మడంలేదని, పీపుల్స్ పల్స్‌ను మాత్రమే నమ్ముతున్నామని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్ణాటకలో అధికారం బీజేపీదేనని సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా పడకేసిందని, సీఎం ఫక్తు రాజకీయాలపై దృష్టిసారించారన్నారు. అకాల వర్షాలతో రైతులు నష్టపోతే పట్టించుకునే నాథుడే లేకుండా పోయారని ఆయన విమర్శలు చేశారు. పంచాయతీ సెక్రటరీలను బెదిరించి సమ్మె విరమించాలని ఒత్తిడి తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

రాజకీయాలకతీతంగా ఉగ్రవాద కార్యకలాపాలను ఉక్కుపాదంతో అణచివేయాలని ఆయన అన్నారు. దేశంలో ఎక్కడ బాంబు పేలుళ్లు జరిగినా దాని మూలాలు హైదరాబాద్‌లో తేలుతున్నాయని, ఇది కొత్తేం కాదని, కాంగ్రెస్ హయాంలోనూ ఇది కొనసాగిందన్నారు. కారు స్టీరింగ్ తన చేతిలోనే ఉందని ఓవైసీ గతంలోనే చెప్పారని, ఓవైసీ మెప్పు కోసమే కేసీఆర్ వీటిని ఉపేక్షిస్తున్నారా అని లక్ష్మణ్ ప్రశ్నించారు. పాతబస్తీలో ఇటీవల అరెస్టయిన వ్యక్తి మజ్లిస్ పార్టీకి చెందిన నాయకుడి కాలేజీలో హెచ్‌వోడీగా పని చేస్తున్నారన్నారు. రాష్ట్ర పోలీసు నిఘా వ్యవస్థ కేవలం ప్రతిపక్ష పార్టీల నేతల కదలికలు, అధికార పార్టీ నేతలు ఎవరితో టచ్‌లో ఉన్నారన్న దానిపై మాత్రమే పనిచేస్తున్నారన్నారు.

యూపీ, గుజరాత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు ఎందుకు ఉండటంలేదనేది అందరూ ఆలోచించాలని లక్ష్మణ్ కోరారు. పోలీసులకు స్వేచ్ఛ ఇవ్వాలని ఆయన సూచించారు. హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున రోహింగ్యాలు మకాం వేశారని, వీరికి కొంత మంది మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారన్నారు. ఇది దేశ భద్రతకు ముప్పు అని ఆయన మండిపడ్డారు. ఇదిలా ఉండగా గతంలో వీఆర్‌వోలు సమ్మెకు దిగితే వాళ్ళ వ్యవస్థనే రద్దు చేసి వారిని కేసిఆర్ బెదిరించారని లక్ష్మణ్ గుర్తుచేశారు. 317 జీవో ద్వారా టీచర్లను అనేక ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. రైతుల బీమా కోసం రూ.300 కోట్లు చెల్లించే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించి వారిని ఆదుకోవాలని, అలాగే జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్యను పరిష్కరించాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story