43 ఏళ్ళ ఇంద్రవెల్లి పోరాటం.. మావోయిస్టుల కీలక పిలుపు

by Disha Web Desk 4 |
43 ఏళ్ళ ఇంద్రవెల్లి పోరాటం.. మావోయిస్టుల కీలక పిలుపు
X

దిశ, బెల్లంపల్లి: 43 ఏళ్ల మహత్తర ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తినీ సమరో త్సవంతో జరుపుకుందాం అని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన మంగళవారం లేఖ విడుదల చేశారు. గ్రామాలలో, గూడాలలో, బస్తీలలో, పట్టణాలలో, పని స్థలాల్లో సభలు, సమావేశాలు, సెమినార్లు నిర్వహించి ఇంద్రవెల్లి అమరుల స్ఫూర్తిని ఎత్తిపట్టాలని పిలుపునిచ్చారు.

పీపుల్స్ వార్ పార్టీ నాయకత్వంలో 1981 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో గిరిజన రైతుకూలీ సంఘం మహాసభను జరుపుకొని సభలో అటవీ భూములు పట్టాల కోసం ఆదివాసీ సమస్యలపై చర్చించుకోవాలని నిర్ణయించుకొని ప్రభుత్వాన్ని మహాసభ కొరకు అనుమతిని కోరారని పేర్కొన్నారు. ప్రభుత్వం అనుమతి నిరాకరించడమే గాకా 144 సెక్షన్ విధించిందన్నారు. ఈ విషయం తెలియని గోండు గిరిజనులు ఇంద్రవెల్లికి లోతట్టు గూడాల నుండి గుంపులు గుంపులుగా మహిళలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు, మహాసభ కోసం వేలాదిగా ఇంద్రవెల్లికి చేరుకున్నారని తెలిపారు.

మహాసభకు చేరుకున్న గిరిజన గోండు ప్రజలపై ఎలాంటి హెచ్చరికలు చేయకుండా పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు చేసి వందలాది మందిని గాయపర్చి పదుల సంఖ్యలో హత్యలు చేశారని మండిపడ్డారు. దోపిడీ పాలక వర్గాలు గోండులపై జరిపిన పాశవిక నరమేధాన్ని మేధావులు, పౌరహక్కుల సంఘాలు, విద్యార్థులు, వివిధ సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు, వామపక్షపార్టీలతో సహా ప్రజలు ముక్తకంఠంతో ఖండించారని తెలిపారు. 1982లో గోండులు అమరత్వం చెందిన స్థలంలో పీపుల్స్ వార్ పార్టీ నాయకత్వంలో గిరిజన రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో 120 అడుగుల స్థూపాన్ని నిర్మించిందని తెలిపారు. ఈ స్థూపాన్ని ప్రభుత్వం 1986లో పోలీసులతో కూల్చివేసి ఇంద్రవెల్లి పోరాట జ్వాలను ఆర్పివేయాలని చూసిందని పేర్కొన్నారు.

ఆదివాసుల నుండి వెల్లువెత్తిన నిరసనలతో ఎన్టీఆర్ ప్రభుత్వం మళ్లీ స్థూపాన్ని నిర్మించి సైనిక బలగాలు, పోలీసులతో ఆ ప్రాంతాన్ని దిగ్బందించి 144 సెక్షన్ విధించి స్థూపం వద్దకు ఎవరిని రానియకుండా నిషేదాజ్ఞలు విధించిందని విమర్శించారు. అయినప్పటికీ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 20న ఆదివాసులు నిషేదాజ్ఞలను ధిక్కరిస్తూ పోలీసుల దిగ్భందాన్ని చేదించుకొని స్థూపం వద్దకు చేరుకొని జెండాలు ఎగుర వేసి ఇంద్రవెల్లి అమరులను స్మరించుకుంటున్నారని తెలిపారు. ఇంద్రవెల్లి అమరుల సాక్షిగా పోరాట వారసత్వాన్ని ఇప్పటికి కొనసాగిస్తూ, వారి ఆశయాలను తుదకంటా కొనసాగిస్తామని శపథం చేస్తూ వారి హక్కుల సాధనకై పోరాడుతున్నారని వివరించారు.

పీపుల్స్ వార్ పార్టీపై తీవ్రంగా కొనసాగుతున్న నిర్భంధాన్ని ఎదుర్కొంటూనే గిరిజనుల పోరాటాలకు నాయకత్వం వహించిందన్నారు. భూములపై హక్కు, కరువు సమస్యల పరిష్కారం, సమిష్టి వ్యవసాయం, సమిష్టి ఆర్ధిక గ్రూపులు, కూలీరేట్ల పెంపుదల, గిట్టుబాబు ధరల పోరాటం లాంటి పోరాటాలు చేపట్టి గిరిజన రైతుకూలీ సంఘాలు గ్రామాల్లో అధికారాన్ని నడిపాయి, పార్టీ భూమి, భుక్తి, విముక్తినినాదంతో (జల్-జంగల్-జమీన్-బుత్ అధికారం) ప్రజలను కదిలించిందని పేర్కొన్నారు.

ఆదివాసీ, ఆదివాసేతర రైతాంగ ఐఖ్యత కోసం కృషి చేసిందని, మరాఠా, లంబాడి, ముస్లీంలోని పేద ఆదివాసేతరులతో ఐక్యత నెలకొల్పిందన్నారు. ఆదివాసేతర భూస్వాములకు వ్యతిరేకంగా గిరిజనుల హక్కుల కోసం పోరాడిందన్నారు. గిరిజనుల మౌళిక హక్కుల కోసం పోరాడుతూనే వారిని నూతన ప్రజాస్వామిక విప్లవ మార్గంలో సమీకరించిందని పేర్కొన్నారు. గ్రామాల్లో ప్రజాధికార సంఘాలుగా గ్రామ రాజ్య కమిటీలను నిర్మించిందని గుర్తు చేశారు. ఈ రోజు దండకారణ్యంలో 'జనతనా సర్కార్లు' పని చేస్తున్నాయన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సామ్రాజ్యవాద, బహుళజాతి కంపెనీలకు, కార్పొరేట్ శక్తులకు, భూస్వామ్య నిరంకుశ దళారీ బూర్జువాలకు తలవొగ్గి దోపిడి పాలక వర్గాలు, ఉద్యమ ప్రాంతంలో అణచివేత దాడులు కొనసాగిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒకే దేశం-ఒకే మతం-ఒకే భాష విధానాలతో బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయని మండిపడ్డారు. ఏజెన్సీ ఏరియాల్లో రామ మందిరాల నిర్మాణాలను ప్రోత్సాహిస్తూ హిందూ రాష్ట్ర స్థాపనకై దూకుడుగా ఆదివాసుల పోరాటాల చరిత్రను వక్రీకరిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు.

గత 43 సంవత్సరాల చరిత్రను పరిశీలిస్తే ఆదిలాబాద్ జిల్లా ప్రజలు విప్లవోద్యమాలకి అంకితమై అనేక త్యాగాలు చేసారని కొనియాడారు. అంతేకాకుండా అనేక మంది విప్లవ కార్యకర్తలు పోలీసు ఎన్‌కౌంటర్లలో అమరులైనప్పటికీ జిల్లా ప్రజలు పోరాట రంగాన ఉజ్వలమైన చరిత్ర నిర్మించుకుంటున్నారని తెలిపారు. ఇంద్రవెల్లి గాయాలు మానినా గుర్తులు మాసిపోలే, ఇంద్రవెల్లి పోరాట మహోజ్వాల నేటికి నివురుగప్పిన నిప్పులా రగులుతూనే ఉందని పేర్కొన్నారు. ఆదివాసుల హక్కు జల్‌-జంగల్-జమీన్-ఇజ్జత్ అధికారం దక్కేంత వరకు ఉద్యమజ్వాల నిరంతరం దేదీప్యమానంగా జ్వలిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. ఇంద్రవెల్లి అమరుల పోరాట స్ఫూర్తితో ఆదివాసులు, ఆదివాసేతరులు, కవులు, కళాకారులు, మేధావులు, ప్రజాసంఘాలు ఐక్యమవుతూ కింది డిమాండ్ల అమలుకై పోరాడండని జగన్ పిలుపునిచ్చారు.

అడవి నుండి ఆదివాసుల గెంటివేతకు వ్యతిరేకంగా, పోడు భూముల పట్టాలకై పోరాడాలన్నారు. 1/70 చట్టం, పెసా చట్టం, 5వ షెడ్యూల్, జీవో నెం.3 ని అమలు చేయాలనీ, 2006 అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలని! ఆదివాసీ గూడాలలో ఎత్తివేసిన పాఠశాలలను పునరుద్ధరించాలన్నారు. గిరిజన యూనివర్సిటీలను నిర్మాణం చేయాలని ఆదివాసులనే ఉ పాధ్యాయులుగా నియమించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక డిఎస్సీతో ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసీ యువతి యువకులకు ఉద్యోగాలు కల్పించేందుకు పోరాడాలన్నారు.

29 శాఖల్లో వున్న జీవోలను చట్టం చేసి ఆ శాఖల్లో వున్న ఉద్యోగాలను ఆదివాసీలను నియమించాలని, అదివాసీ గ్రామాలలో తాగునీటి సమస్యను వెంటనే పరిష్కారించాలని డిమాండ్ చేశారు. జిల్లా, మండల కేంద్రాల్లో ఆదివాసీలకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని, అడవిని ధ్వంసం చేస్తూ పర్యావరణాన్ని నాశనం చేస్తున్న ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులను, ఇనుప గనులను పెద్ద ప్రాజెక్టులను రద్దు చేయాలన్నారు.

కవ్వాల టైగర్ జోన్ ఎత్తివేయాలి. ఓపెన్ కాస్టులతో గ్రామాలు కోల్పోయిన ఆదివాసులకు పునరావాసం కల్పించాలన్నారు. పోలీసు, ఫారెస్టు అధికారుల దాడులను ఆపివేయాలని, అడవి ప్రాంతంలో వున్న నాన్ ఏజెన్సీ గ్రామాలను ఏజెన్సీ గ్రామాలుగా గుర్తించాలన్నారు. ఆదివాసీ సమస్యల పరిష్కారానికై పోరాడుతున్న ఆదివాసీ హక్కుల కార్యకర్తలపై, ప్రజాస్వామిక వాదులపై, మేధావులపై నమోదైన ఉపా కేసులను ఎత్తివేసేందుకు ఉద్యమించాలన్నారు.

ఆదివాసుల సంస్కృతి, సాంప్రదాయాలను దెబ్బతీస్తూ ఆదివాసీ గ్రామాలలో హిందుత్వ శక్తులు నిర్మిస్తున్న రామమందిరాలను వెంటనే నిలిపివేయాలని, ఆదివాసీ సంస్కృతి కాపాడాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడండని కోరారు. బ్రాహ్మణీయ హిందుత్వ మతోన్మాద ఫాసిస్టు బీజేపీ మోదీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ కుట్రలను ఎండగట్టండన్నారు. జల్, జంగల్, జమీన్ బూత్ అధికారం దక్కే వరకు ఇంద్రవెల్లి అమరుల స్ఫూర్తితో పోరాడుతూ దోపిడీ పాలక వర్గాల ప్రభుత్వాలను కూల్చివేసి నూతన సమాజాన్ని నిర్మిద్దామని ఆ ప్రకటనలో జగన్ పేర్కొన్నారు.


Next Story

Most Viewed