కొత్త చిక్కుల్లో తెలంగాణ టీడీపీ నేతలు

by  |
కొత్త చిక్కుల్లో తెలంగాణ టీడీపీ నేతలు
X

దిశ, వెబ్‌‌డెస్క్: ఉమ్మడి రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం తెలంగాణలో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందా? కనీసం పార్టీ ఆఫీస్‌లో మెయింటనెన్స్‌కు సైతం నిధులు లేని పరిస్థితులు వచ్చాయా! అంటే అవుననే అంటున్నాయి తెలంగాణ తెలుగుదేశం పార్టీ శ్రేణులు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో అంతగా పార్టీని పట్టించుకోకపోవడం, ఇక్కడున్న కీలక నేతలు సైతం టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలోకి జంప్ కావడంతో గడ్డు పరిస్థితులు ఏర్పడి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చాయన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. అయితే రాష్ట్రంలో పార్టీతో పాటు కార్యాలయం సైతం పైసల పరంగా దివాళా తీయడానికి కారణమేంటి? దీని వెనుక ఏ కారణాలున్నాయి? వాచ్ దిస్ స్టోరీ.

2014, జూన్ 2న తెలంగాణ, ఏపీ ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి. తెలంగాణకు కేసీఆర్, ఏపీకి చంద్రబాబు ముఖ్యమంత్రులు అయ్యారు. పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పటికీ దాదాపు ఏడాదికి పైగా చంద్రబాబు హైదరాబాద్ నుంచే కీలక కార్యకలాపాలు కొనసాగించారు. ఇదేక్రమంలో తెలంగాణ టీడీపీ నేతలు చేజారిపోవడం, ఓటుకు నోటు కేసులో ఆయన పేరు రావడంతో ఆ పార్టీ తీవ్ర ఇబ్బందుల్లోకి వెళ్లిపోయింది. దీంతో చంద్రబాబు పూర్తిగా విజయవాడ కరకట్ట నివాసం నుంచే రాష్ట్రానికి సంబంధించిన అధికారిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇదే క్రమంలో తెలంగాణలో పార్టీని అంతగా పట్టించుకోవట్లేదని సొంతపార్టీ నేతలతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరగడంతో రేవంత్‌, ఎర్రబెల్లి లాంటి కీలక నేతలు రాజకీయ భవిష్యత్‌ ఆలోచించి వేరే పార్టీల కండువా కప్పుకున్నారు.

రాష్ట్రంలో పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతూ నేతలంతా వెళ్లిపోయినా సీనియర్ నేత ఎల్.రమణ పార్టీనే నమ్ముకొని అంటిపెట్టుకొని ఉన్నారు. సౌమ్యుడిగా పేరున్న ఆయనకు పగ్గాలు అప్పజెప్పినా, రాష్ట్రంలో పార్టీని తన సొంత పైసలతో నెట్టుకొచ్చే పరిస్థితులు లేవన్నది అందరికి తెలిసిన విషయమే. అటో ఇటో 2014లో ఏపీలో టీడీపీ అధికారంలో ఉండగా అప్పుడప్పుడు చంద్రబాబు, లోకేశ్ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌ వచ్చినప్పుడు హడావుడి నడిచేది. పార్టీ కార్యాలయానికి నెలవారి ఖర్చులను ఖచ్చితంగా కేటాయించే వారు. కానీ 2019లో ఏపీలో టీడీపీ చరిత్రలో లేని విధంగా ఘోర పరాజయం చవి చూడటంతో.. అక్కడ టీడీపీ పరిస్థితులే అంతంత మాత్రంగా మారాయి. కొన్నాళ్లకు చంద్రబాబు మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ చేసే క్రమంలోనే కరోనా లాక్‌డౌన్ రావడంతో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది.

గతంలో జిల్లాల నుంచి నేతలు.. అనుచరులు, కార్యకర్తలతో కలిసి హైదరాబాద్ పార్టీ ఆఫీస్‌ వస్తే.. ఇంటికి వెళ్లేటప్పుడు కిరాయిలు, భోజనాలకు డబ్బులు ఇచ్చి పంపించే వారు. కానీ రాష్ట్రవ్యాప్తంగా నేతలందరూ వేరే పార్టీల్లోకి వెళ్లడం… ఇప్పుడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్న ఒకరిద్దరు నేతలు ఖర్చులకు భయపడి అసలే పార్టీ ఆఫీస్‌కు రాకుండా దూరంగా ఉంటున్నారు. అంతేగాక ప్రస్తుతం రాష్ట్రంలో పరిణామాల దృష్ట్యా టీడీపీ పట్టుకోల్పోవడంతో చంద్రబాబు, లోకేశ్ సైతం తెలంగాణ పార్టీ ఆఫీస్‌కు నిధుల విషయంలో అంతగా ఇంట్రెస్ట్ చూపడం లేదన్న ప్రచారం జరుగుతోంది.

2019లో జగన్ ఆంధ్రప్రదేశ్‌పైనే ఎక్కువ ఫోకస్ చేసి తెలంగాణను వదులుకున్న స్ట్రాటజీని… ఇప్పుడు చంద్రబాబు సైతం ఫాలో అవుతున్నారని, అందుకే ఉన్న నిధులను అక్కడే ఖర్చు చేసి టీడీపీ కార్యకర్తలు వైసీపీలోకి జారిపోకుండా.. చంద్రబాబు, లోకేశ్ జాగ్రత్త పడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. అందుకే తెలంగాణలో పార్టీని అంతగా పట్టించుకోవడం లేదని, అందులో భాగంగానే తెలంగాణ పార్టీకి నిధులు ఇవ్వక పోవడంతో తెలంగాణ టీడీపీ ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిందన్న చర్చ పొలిటికల్ సర్కిళ్లలో జరుగుతోంది.



Next Story

Most Viewed