భయపడ్డారా… భయపెడుతున్నారా..?

by  |
భయపడ్డారా… భయపెడుతున్నారా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్​ ఎన్నికల్లో ఎన్నికల సంఘం వైఖరి తీవ్ర చర్చకు దారితీస్తోంది. నోటిఫికేషన్​ నుంచి ఓట్ల లెక్కింపు వరకు ఎస్​ఈసీ వివాదంలో చిక్కుకుంటోంది. ఎలాంటి ప్రణాళిక లేకుండా షెడ్యూల్​ జారీ చేశారని ముందు నుంచే ఆరోపణలు వస్తున్నాయి. దీనికి బలం చేకూర్చుతూ చాలా అంశాల్లో ఎస్​ఈసీ విఫలమవుతూ వస్తోంది. ఎన్నికల ఏర్పాట్లు, సిబ్బంది కేటాయింపులు, ప్రచారంలో రెచ్చగోట్లే అంశాలను అరికట్టడంతో పాటు ప్రలోభాలను నివారించడంలో ఘోరంగా విఫలమైంది. స్వయంప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘం ప్రభుత్వం చేతిలో ఉందని, అధికార పార్టీ చెప్పినట్టే పని చేస్తుందంటూ విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్​ కేంద్రాల్లో కనీస వసతులు ఏర్పాటు చేయలేదు. అంతేగాక సిబ్బంది విధుల్లో కూడా నిర్లక్ష్యం బయటకు వచ్చింది. చాలా మందిని చాలా కేంద్రాల్లో విధుల్లో వేసినట్టుగా ఆర్డర్లు జారీ చేసినా.. అక్కడ ఇప్పటికే చాలా మంది ఉన్నారంటూ లోనికి వెళ్లనీయలేదు. దీంతో వారంతా ఎస్​ఈసీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కేంద్రాల్లో లైట్లు కూడా లేవు. తాగునీరు కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితులు దాపురించాయి.

ఓట్ల లెక్కింపు మరి కొద్ది గంటల్లో మొదలవుతుందనగా… అర్థరాత్రి విడుదల చేసిన జీవో ఎన్నికల సంఘాన్ని మరింత విమర్శల్లోకి దింపాయి. కనీసం పెన్​తో టిక్​ పెట్టినా చెల్లిన ఓటుగానే భావించాలనే నిబంధనలు ఎస్​ఈసీని రోడ్డుకీడ్చాయి. కేవలం అధికార పార్టీ కనుసన్నల్లోనే ఎస్​ఈసీ పనిచేస్తుందని, పోలింగ్​ రోజున సాయంత్రం పూట జరిగిన రిగ్గింగ్​ను సరి చేసుకునేందుకే తప్పుడు ఉత్తర్వులు జారీ చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి.

ఎందుకు భయం
ఎన్నికల సంఘం పనితీరు ఇప్పుడు సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. గతంలో కూడా ఎస్​ఈసీ ఎంతో కొంత మేరకు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసినట్టే భావించినా… బహిరంగంగా కొన్ని చర్యలు బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఇటీవల వరుసగా పంచాయతీ, పరిషత్​, కార్పొరేషన్​, మున్సిపల్​ ఎన్నికలను నిర్వహించిన ఎన్నికల సంఘం ఈ గ్రేటర్​ ఎన్నికల్లో మాత్రం చాలా నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. ముందు షెడ్యూల్​ జారీ చేయడం నుంచే ఆరోపణలు ఎక్కువయ్యాయి. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు వచ్చిన నేపథ్యంలో వెంటనే గ్రేటర్​ నోటిఫికేషన్​ జారీ చేయడం, తక్కువ సమయంలోనే ఎన్నికలను నిర్వహించేందుకు పూనుకోవడం, క్షేత్రస్థాయిలో ఏర్పాట్లలో కనీస చర్యలు తీసుకోకపోవడం వంటి నిర్లక్ష్యాలను తేటతెల్లమయ్యాయి. ఎన్నికల సంఘంపై అధికార పార్టీ ఒత్తిడి ఉందనే విషయాన్ని ఎస్​ఈసీ బయటపడేసిందని, ప్రభుత్వం చెప్పినట్టుగానే చేస్తామనే అంశాన్ని చెప్పకనే చెప్పిందనే విమర్శలను మూటగట్టుకుంది.



Next Story

Most Viewed