ధరణిపై వేసిన ఉపసంఘం ఉత్తదేనా? తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ఫైర్

by  |
Realtors Association
X

దిశ, తెలంగాణ బ్యూరో: చిన్న పిల్లలకి దెబ్బతగిలినప్పుడు బాధను మరిచి నవ్వడానికి ‘తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం తుపుక్’ అన్నట్లుగా భూ సమస్యలను పరిష్కరించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని వేశారని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్​రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీణ్ కుమార్​మండిపడ్డారు. ధరణి పోర్టల్‌లోని సమస్యలు కనుగొనేందుకు నియమిస్తే ఏ ఊరికీ పోలేదని, ఏ బాధిత రైతులను కలవలేదన్నారు. ఈ మేరకు బుధవారం ఆయనకొక ప్రకటన విడుదల చేశారు.

ఈ మంత్రివర్గం నివేదికను మాత్రం సీఎం కేసీఆర్‌కు సమర్పించిందన్నారు. ఆ నివేదిక ఇప్పటి వరకు బయటపెట్టలేదన్నారు. శభాష్ ధరణి అని నివేదిక ఇచ్చిందా? తప్పుల తడక అని ఇచ్చిందా? దీన్ని తయారు చేసిన వారికి ఏమైనా అవార్డులు ప్రకటిస్తున్నారా? అని విమర్శించారు. ఏడాది కాలంగా రైతులు అనేక సమస్యలతో బాధ పడుతున్నారన్నారు. ఇప్పటికే కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారని, మరికొందరు ఆత్మహత్యాయత్నం చేశారన్నారు. అయినా ప్రభుత్వం ఏం పట్టనట్లు వ్యవహరిస్తుందన్నారు. కనీసం కేబినెట్ సబ్​కమిటీ సమస్యలను గుర్తించి పరిష్కారానికి కృషి చేస్తుందనుకుంటే వారిచ్చిన నివేదికలో ఏయే అంశాలు ఉన్నాయో ఎవరికీ తెలియడం లేదన్నారు. కొత్తగా ఏమేమి మాడ్యూల్స్ వస్తాయో చెప్పాలన్నారు. లేదంటే ధరణి పోర్టల్​ను రద్దు చేసి పాత పద్ధతిని అమలు చేయాలని డిమాండ్​చేశారు.

20 ఏండ్ల క్రితం లేఅవుట్లుగా మారిన భూమిని వ్యవసాయ భూమిగా మార్చి ధరణి పోర్టల్‌లో నమోదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. లక్షలాది మంది ఆ ప్లాట్లను కొనుగోలు చేసినట్లు సేల్​డీడ్స్ ఉన్నాయన్నారు. ఇప్పుడా లేఅవుట్లలోని ప్లాట్ల యజమానులు ఆగమాగం అవుతున్నారని చెప్పారు. ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గ రైతులతో సమావేశమై వారు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించాలన్నారు. లక్షలాది మంది రైతులు ధరణి లోపాలు, సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్లు, తహశీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరుగుతన్నారన్న విషయాన్ని గుర్తించాలని డిమాండ్​ చేశారు.



Next Story

Most Viewed