కొత్త విద్యుత్ చట్టానికి తెలంగాణ సై

by  |
కొత్త విద్యుత్ చట్టానికి తెలంగాణ సై
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న కొత్త విద్యుత్ చట్టాన్ని ఇంతకాలం తీవ్రంగా వ్యతిరేకించిన తెలంగాణ సర్కారు చివరకు జై కొట్టింది. కొత్త వ్యవసాయ చట్టాల విషయంలో ‘యూ టర్న్’ తీసుకున్నట్లుగానే విద్యుత్ బిల్లు విషయంలోనూ అదే వైఖరి తీసుకుంది. సంస్కరణల పేరుతో పాత విద్యుత్ చట్టానికి సవరణలు చేసి కొత్త చట్టం తీసుకురావడానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను స్వాగతించింది. ఫిబ్రవరిలో జరిగిన సమావేశం సందర్భంగా కేంద్రానికి మద్దతు తెలియజేసింది. కొన్ని సవరణలపై మాత్రం పట్టుబట్టింది.

విద్యుత్ ఉద్యోగుల సంక్షేమం, మిగులు సిబ్బంది, పదవీ విరమణ తదితర అంశాలపై స్పష్టమైన అభిప్రాయాలను సూటిగానే చెప్పింది. సంప్రదాయేతర ఇంధన వనరుల సమీకరణ విషయంలో ప్రతిపాదిత బిల్లులోని క్లాజ్‌లపై భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేసి మార్పులు చేయాల్సిందిగా సూచించింది. జరిమానా విషయంలోనూ మార్పులు అవసరమని స్పష్టం చేసింది. ప్రతిపాదిత విద్యుత్ బిల్లులోని సవరణలు, సంస్కరణలను అన్ని రాష్ట్రాలతో చర్చించడానికి ఫిబ్రవరి 17వ తేదీన కేంద్ర విద్యుత్ మంత్రి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఆ సందర్భంగా రాష్ట్రాలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను ‘మినిట్స్’లో పొందుపరిచారు. ఆ వివరాలు శుక్రవారం మీడియాకు చిక్కాయి. అందులో తెలంగాణ వెలిబుచ్చిన అభిప్రాయాలు ‘యూ టర్న్’ తీసుకుందనే చర్చకు దారితీశాయి.

ఈ సమావేశంలో కొత్త విద్యుత్ బిల్లులో పేర్కొన్న పలు సంస్కరణల్లో ప్రధానమైనవాటిని కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి ఘన్‌శ్యామ్ ప్రసాద్ అన్ని రాష్ట్రాల నుంచి హాజరైన ప్రతినిధులకు వివరించారు. కేంద్ర ప్రభుత్వం 2021-22 వార్షిక బడ్జెట్‌లో ప్రస్తావించినట్లుగా విద్యుత్ వినియోగదారులకు నిర్దిష్ట డిస్కంను ఎంచుకునే స్వేచ్ఛ ఉండాలని; సుప్రీంకోర్టు 2018లో వెలువరించిన తీర్పు ప్రకారం రాష్ట్రాల విద్యుత్ క్రమబద్ధీకరణ అథారిటీలో న్యాయ సంబంధ (లా డిగ్రీ) అంశాలపై అవగాహన ఉన్నవారిని నియమించాలని; దీర్ఘకాలంగా అనేక పిటిషన్లు విద్యుత్ అప్పీలేట్ ట్రిబ్యునల్‌లో పెండింగ్‌లో ఉన్నందున సత్వర పరిష్కారం కోసం సభ్యుల సంఖ్యను పెంచాలని, తీర్పు వెల్లడిలో జరిగే జాప్యాన్ని నివారించాలని; సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించడానికి అంతర్జాతీయ సమాజ ఒప్పందంలో భారత్ వైఖరికి అనుగుణంగా రెన్యూవబుల్ పర్చేస్ ఆబ్లిగేషన్ ప్రతిపాదనను అమలుచేయాలని.. ఇలా పలు సంస్కరణలు, సవరణలపై రాష్ట్రాలతో జరిగే సమావేశంలో ఎజెండాలో చేర్చి చర్చించిన అనంతరం వాటివాటి అభిప్రాయాలను క్రోడీకరించారు.

ఈ సమావేశంలో ఒక్కో రాష్ట్రం అక్కడి పరిస్థితులకు అనుగుణంగా కొత్త ప్రతిపాదిత బిల్లుపై అభిప్రాయాలను వెల్లడించింది. దాదాపుగా అన్ని రాష్ట్రాలూ కొత్త చట్టానికి జై కొట్టాయి. తెలంగాణ సైతం ఈ బిల్లును స్వాగతించింది. కొత్త విద్యుత్ చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి ఆ బిల్లును ఉపసంహరించుకోవాల్సిందిగా కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. పలు వేదికలమీద ఈ బిల్లును వ్యతిరేకించింది. ఈ బిల్లు అమలులోకి వస్తే రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, రాష్ట్రాల హక్కుల విఘాతం కలుగుతుందని, ఆరు నూరైనా వ్యవసాయ మోటారు పంపుసెట్లకు మీటర్లు బిగించే ప్రసక్తే లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా కూడా ఇదే విషయాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా ఎంచుకున్న మంత్రి హరీశ్‌రావు ‘మోటార్లకు మీటర్లు పెడతదంట.. ‘ అంటూ బీజేపీని తీవ్ర స్థాయిలో విమర్శించారు. కానీ ఫిబ్రవరిలో జరిగిన సమావేశంలో మాత్రం ఒకటి రెండు ఇతర అంశాలపై మార్పులు కోరిన తెలంగాణ ట్రాన్స్‌కో-జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు చివరకు ప్రతిపాదిత బిల్లుకు, అందులోని అంశాలకు మద్దతు తెలిపి కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను స్వాగతించారు.

‘మినిట్స్’లో తప్పుగా వచ్చాయి : సీఎండీ
కేంద్ర ఇంధన శాఖ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సు ‘మినిట్స్’ బహిర్గతం కావడంతో తెలంగాణ అభిప్రాయం బట్టబయలైంది. కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న కొత్త విద్యుత్ చట్టానికి మద్దతు పలుకుతూ అప్పటివరకూ ఉన్న అభిప్రాయానికి భిన్నంగా ‘యూ టర్న్’ తీసుకుంది. ఇదే విషయాన్ని మీడియా ప్రతినిధులు సీఎండీ ప్రభాకర్ రావు దగ్గర ప్రస్తావించగా, సమావేశంలో తెలంగాణ తరపున వ్యక్తం చేసిన అభిప్రాయాలు ‘మినిట్స్’లో తప్పుగా వచ్చాయని, తెలంగాణ అభ్యంతరాలు అందులో ప్రతిబింబించలేదని వ్యాఖ్యానించారు.

Next Story

Most Viewed