దేశంలోనే తెలంగాణ పోలీసింగ్ బెస్ట్ : డీఐజీ ఏవీ రంగనాథ్

by  |
DIG Ranganath
X

దిశ, నల్లగొండ: దేశవ్యాప్తంగా తెలంగాణ పోలీసులకు మంచిపేరు ఉన్నదని, దానిని మరింత పెంచేవిధంగా పనిచేయాలని నల్లగొండ ఎస్పీ, డీఐజీ ఏవీ రంగనాథ్ సూచించారు. ఫ్లాగ్ డే వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం 12వ బెటాలియన్ పోలీసులతో కలిసి జిల్లా పోలీసు శాఖ నిర్వహించిన సైకిల్ ర్యాలీని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమరవీరుల త్యాగం గొప్పదని, ఫ్లాగ్ డే సందర్భంగా వారి త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదని సూచించారు. ప్రజా రక్షణలో, శాంతి భద్రతల పరిరక్షణలో నిబద్ధతతో విధి నిర్వాహణ చేస్తూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముందుకు సాగుతున్న పోలీసుల కృషి అభినందనీయమని చెప్పారు. దేశ వ్యాప్తంగా ప్రజాక్షేమం కోసం పనిచేస్తూ అమరులైన వారి త్యాగాలను స్మరించుకునేలా ప్రతీ ఏడాది పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహిస్తున్నామని చెప్పారు. అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రజలతో మరింత మమేకమవుతూ మన్ననలు పొందాలని ఆయన సూచించారు.

DIG Ranganath

అనంతరం ఆయన సైకిల్ రైడింగ్ చేసి అందరినీ ఉత్సాహ పరిచారు. అనంతరం 12వ బెటాలియన్ కమాండెంట్ సాంబయ్య మాట్లాడుతూ.. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించాలని అన్నారు. ప్రజలను రక్షించడం కోసం ఎలాంటి త్యాగాలకు వెనుకాడకుండా ముందుకు సాగాలని సూచించారు. ఈ సైకిల్ ర్యాలీలో అదనపు ఎస్పీ నర్మద, బెటాలియన్ డీఎస్పీ వెంకన్న, నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్ఐలు స్పర్జన్ రాజ్, నర్సింహా చారి, శ్రీనివాస్, కృష్ణారావు, నర్సింహా, నాగేశ్వర్ రావు, సీఐలు బాలగోపాల్, చంద్రశేఖర్ రెడ్డి, చీర్ల శ్రీనివాస్, ఎస్ఐలు నర్సింహ, నరేష్, రెడ్ క్రాస్ కార్యదర్శి గోలి అమరేందర్ రెడ్డి, వాకర్స్ సభ్యులు డాక్టర్ పుల్లారావు, పర్యావరణ ప్రేమికుడు మిట్టపల్లి సురేష్ గుప్త, తైక్వండో చిన్నారులు, పోలీస్ సిబ్బంది, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



Next Story