కరోనా కొత్త వేరియంట్ల కలకలం.. తెలంగాణ వైద్యారోగ్యశాఖ అలర్ట్

by  |
కరోనా కొత్త వేరియంట్ల కలకలం.. తెలంగాణ వైద్యారోగ్యశాఖ అలర్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో : దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా, హాంగ్‌కాంగ్‌లలో కరోనా వైరస్ కొత్త వేరియంట్లు ఉనికిలోకి రావడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ ఇచ్చిన సలహాతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రెగ్యులర్‌గా కొనసాగుతున్న స్క్రీనింగ్ సెంటర్‌ను అప్రమత్తం చేసింది. ఈ మూడు దేశాల నుంచి డైరెక్టుగా లేదా ఇతర రూట్ల ద్వారా వచ్చే ప్రయాణికులకు పకడ్బంధీగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంపై దృష్టి పెట్టింది. కొంతకాలంగా అక్కడే ల్యాబ్‌ను ఏర్పాటు చేసి ఆర్‌టీ-పీసీఆర్ పద్ధతి ద్వారా శాంపిల్స్‌ను పరీక్షిస్తున్న వైద్య సిబ్బంది ఇప్పుడు గంటల వ్యవధిలోనే రిపోర్టులు ఇచ్చే ఏర్పాట్లు చేసింది.

ఈ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు రిపోర్టును అందుకుని పాజిటివ్ వచ్చినట్లయితే హోమ్ ఐసొలేషన్‌లోకి వెళ్ళేలా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నిబంధనలను పటిష్టంగా అమలుచేయనున్నది. ఒకవేళ హోమ్ ఐసొలేషన్ సౌకర్యం లేనట్లయితే హోటళ్లలోనే పెయిడ్ ఐసోలేషన్ ఏర్పాట్లు చేస్తున్నది. నెగెటివ్ వస్తే హోమ్ క్వారంటైన్ సూచనలు చేస్తున్నది. రాష్ట్రంలో ప్రస్తుతం వైరస్ వ్యాప్తి నియంత్రణలోనే ఉన్నప్పటికీ కొత్త వేరియంట్‌తో సరికొత్త సమస్యలను నెత్తిమీదకు తెచ్చుకోవద్దన్న ఉద్దేశంతో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వైద్యారోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నామని, పరిస్థితికి తగినట్లుగా ఈ మూడు దేశాలు కాకుండా ఇతర చోట్ల నుంచి వచ్చే ప్రయాణికులకు కూడా అవసరాన్ని బట్టి స్పెషల్ కేర్ తీసుకుంటామని తెలిపారు.

జూడాల సమ్మె విరమణ..

తెలంగాణ జూనియర్ డాక్టర్లు శుక్రవారం నుంచి తలపెట్టిన సమ్మె ఆలోచనను విరమించుకున్నారు. మంత్రి హరీశ్ రావుతో చర్చలు జరిపిన తర్వాత సమ్మె చేయాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నామని జూడాల సంఘం ఒక ప్రకటనలో పేర్కొన్నది. పీజీ కోర్సుల అడ్మిషన్లలో ఇన్-సర్వీస్ కోటాపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జూడాలకు అవకాశాలు సన్నగిల్లుతాయన్న డిమాండ్‌తో ప్రభుత్వాన్ని ఒప్పించడానికి సమ్మె చేయాలనుకున్నామని, కానీ మంత్రి ఇచ్చిన హామీతో ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధ్యక్షుడు డాక్టర్ సాగర్ తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్లు పీజీ కోర్సుల్లో చేరేందుకు ఇన్ సర్వీస్ సీట్ల కోటా శాతం, రెగ్యులర్ రిక్రూట్‌మెంట్ సీట్ల శాతం సమానంగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.



Next Story

Most Viewed