రైతుల్ని అయోమయానికి గురి చేయొద్దు : కోదండరామ్

by  |
రైతుల్ని అయోమయానికి గురి చేయొద్దు : కోదండరామ్
X

దిశ, నల్లగొండ: ప్రభుత్వం చెప్పిన పంట వేస్తేనే రైతుబంధు ఇస్తామని రైతులను అయోమయానికి గురిచేయడం సరికాదని తెలంగాణ జనసమితి అధ్యక్షలు కోదండ రామ్ అన్నారు. గురువారం నల్లగొండలో పర్యటించిన ఆయన, బత్తాయి సాగుదారులకు సంఘీభావంగా క్లాక్ టవర్ వద్ద బత్తాయిలను అమ్మారు. బత్తాయి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బత్తాయి రైతుల కష్టాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. చికెన్ తినాలని చెప్పిన మంత్రులు బత్తాయిలు తినాలని ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. నియంత్రిత వ్యవసాయ విధానం ఆచరణ సాధ్యం కాదని, రైతులతో చర్చించకుండా ఏది చేసినా అది వ్యర్థంగానే మిగిలిపోతుందని అన్నారు. రైతుబంధు తీసివేస్తామని బెదిరించడం సరికాదని హితవు పలికారు. పోతిరెడ్డిపాడుపై తెలంగాణ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ లిఫ్ట్ పథకాలతో తెలంగాణకు నీళ్లు రావని తెలిపారు. కృష్ణా జలాల వినియోగంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కోదండరాం విమర్శించారు. నిర్దిష్ట పద్ధతులతో సమగ్ర వ్యవసాయ విధానం అమలు చేయాలని, పత్తి వేసుకోవాలని రైతులను బలవంత పెట్టడం సరికాదని అన్నారు. బత్తాయికి సంబంధించి ప్రభుత్వ పెద్దలు విరివిగా ప్రచారం చేయాలన్నారు.

Next Story