చెట్లు నాటుడు ఓకే.. నరుకుడు సంగతేంది..?

by  |
చెట్లు నాటుడు ఓకే.. నరుకుడు సంగతేంది..?
X

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజును ఈ సంవత్సరం టీఆర్ఎస్ నాయకులు వినూత్నంగా జరుపుకుంటున్నారు. మొక్కలు నాటడంపై టీఆర్ఎస్ పార్టీ ఒక బృహత్తర క్యాంపెయిన్‌కు శ్రీకారం చుట్టింది. ప్రతీ ఒక్కరూ ఒకటి చొప్పున మొక్క నాటి సెల్ఫీ దిగి ఫలానా నెంబర్‌కు వాట్సాప్ చేయాల్సిందిగా సామాజిక మాధ్యమాల ద్వారా పార్టీ పిలుపు ఇచ్చింది. మంత్రులు సైతం అంతే ఉత్సాహంతో వ్యక్తిగతంగా పిలుపునిచ్చారు. కేసీఆర్ బర్త్‌డే వేడుకలు ఎలా ఉన్నా మొక్కలు నాటడం మాత్రం బాగానే జరుగుతోంది. ఇది ఆహ్వానించదగిన పరిణామం. తెలంగాణ రాష్ట్రం హరితవనం అయితే దాని ఫలాలు అందుకునేది కూడా తెలంగాణ ప్రజలే. కానీ ఏ స్థాయిలో మొక్కలు నాటుతున్నారో అంతే స్థాయిలో ఏపుగా పెరిగిన భారీ వృక్షాలు సైతం ధ్వంసమవుతున్నాయి. గడచిన మూడేళ్ళలో మొత్తం దేశమంతా నేలకూలిన మొక్కల్లో ఆరవ వంతు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయి. ఏకంగా 12 లక్షల చెట్లు ధ్వంసమయ్యాయి. మొక్కలు నాటడంలో తెలంగాణ అన్ని రాష్ట్రాలకు ఎలా ఆదర్శవంతంగా ఉందో చెట్లను నరకడంలోనూ అదే స్థాయిలో రికార్డు సృష్టించింది. నరుకుడులో అన్ని రాష్ట్రాల్లోకెల్లా ఫస్ట్ ప్లేస్‌లో ఉంది.

కేసీఆర్ దృష్టిలో పడడానికి మంత్రులు, టీఆర్ఎస్ నాయకులు పడరాని పాట్లు పడుతున్నారు. చివరకు ప్రధాన కార్యదర్శి సహా అధికారగణం కూడా అంతే స్థాయిలో ఉత్సాహంగా ఉన్నారు. నిన్న మొన్నటిదాకా టీఆర్ఎస్ నాయకుడైన ఎంపీ సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ పేరు మీద ఎక్కడలేని ఆసక్తి చూపారు. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి పుట్టిన రోజు యావత్తు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి పుట్టినరోజు తరహాలో పార్టీ నాయకులు, అధికారులు రాజభక్తిని ప్రదర్శించుకుంటున్నారు. హరితహారం పేరుతో దేశంలోనే ఎక్కడా లేనంతటి వినూత్న కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని వల్లెవేస్తున్నారు. ఐదేళ్ళలో 230 కోట్ల మొక్కలను నాటడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటికి ఐదేళ్ళపోయింది. 176 కోట్ల మొక్కలను నాటినట్లు ప్రభుత్వం చెప్పుకుంటోంది. ఇంకా 50 కోట్లకు పైగా మొక్కలు నాటాల్సి ఉంది. గడువు పూర్తయిందిగానీ లక్ష్యం మాత్ర పాక్షికమే.

హరితహారం పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఐదేళ్ళలో సుమారు రూ. 3765.30 కోట్లను ఖర్చు చేసింది. ఇందులో గ్రామీణాభివృద్ధి శాఖ నుంచే ఎక్కువగా (రూ. 2407 కోట్లు) ఖర్చు చేసింది. మిగిలిన ఖర్చును అటవీ శాఖ (రూ. 1134 కోట్లు), హెచ్ఎండీఏ (రూ. 164 కోట్లు), జీహెచ్ఎంసీ (రూ. 59 కోట్లు)లు సమకూర్చాయి. గ్రామీణాభివృద్ధి శాఖ చేసిన ఖర్చులో కేంద్రం నుంచి గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వచ్చిన నిధులు కూడా ఉన్నాయి.

చెట్ల నరికివేతలో నెంబర్ వన్ :

మొక్కలు నాటడంలో దేశంలో మరే రాష్ట్రంకంటే ఎక్కువగా మొక్కలు నాటిన చరిత్ర తెలంగాణ రాష్ట్రానిది. కేంద్ర ప్రభుత్వ ఇరవై అంశాల (ట్వంటీ పాయింట్ ప్రోగ్రామ్) కింద గడచిన మూడేళ్ళలో 27.74 కోట్ల మొక్కలను నాటినట్లు కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ తెలిపింది. దేశం మొత్తంమీద 121 కోట్ల మొక్కలు నాటితే అందులో ఎక్కువగా నాటింది తెలంగాణలోనే. ఆ తర్వాతి స్థానం ఒడిషా రాష్ట్రానిది. చెట్లను నరకడంలోనూ తెలంగాణదే తొలి స్థానం. గడచిన మూడేళ్ళకాలంలో దేశం మొత్తం మీద 76.72 లక్షల మొక్కలను నరికితే అత్యధికంగా తెలంగాణలో 12.12 లక్షలు ఉన్నాయి. ఇక్కడా తెలంగాణదే రికార్డు.

ఒకవైపు అడవులు నాశనం కావద్దని పిలుపునిస్తూనే, హరితహారం పథకాన్ని అమలుచేస్తూనే వివిధ రకాల అవసరాల కోసం 11,707 హెక్టార్ల అడవిని రాష్ట్ర ప్రభుత్వం ధ్వంసం చేసింది. దీనికి ప్రత్యామ్నాయంగా 18,431 హెక్టార్లలో మొక్కలను పెంచుతామని (కాంపెన్సేటరీ ఎఫోరెస్టేషన్) కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖకు తెలియజేసింది. కానీ ఈ మూడేళ్ళ కాలంలో ఇప్పటివరకు కేవలం 4951 హెక్టార్లలో మాత్రమే మొక్కలు నాటింది (రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం).

Next Story

Most Viewed