ఆ పరిశ్రమలకు గుడ్‌న్యూస్.. తక్కువ వడ్డీకి ప్రభుత్వ రుణాలు

by  |
ఆ పరిశ్రమలకు గుడ్‌న్యూస్.. తక్కువ వడ్డీకి ప్రభుత్వ రుణాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా నష్టాల్లో కూరుకుపోయిన, మూతపడిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊతమిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే తెలంగాణ ఇండస్ట్రియల్‌ హెల్త్‌ క్లినిక్‌ లిమిటెడ్‌ (టీఐహెచ్‌సీఎల్‌) ను ఏర్పాటు చేసింది. ఎంఎస్ఎంఈలు మూతపడకుండా తక్కువ వడ్డీకి ప్రభుత్వమే రుణాలు ఇచ్చి పునరుద్ధరణకు చర్యలు చేపట్టింది. దీంతో రాష్ట్రంలోని 135 పరిశ్రమలు తిరిగి ఉత్పత్తిని ప్రారంభించడంతో 2 వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడకుండా ఆదుకున్నట్లయింది.

కరోనాతో పాటు బ్యాంకుల నుంచి సకాలంలో రుణాల అందకపోవడం, ముడి సరుకుల లభ్యతలో ఇబ్బందులు, యంత్రాలు సరిగ్గా పనిచేయకపోవడం, విద్యుత్ సరఫరాలో సమస్యలు, సరుకు తీసుకున్నవారి నుంచి చెల్లింపులు జరుపకపోవడం తదితర కారణాలతో అనేక సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. కొన్నింటిని నడపలేని స్థితిలో యజమానులు మూసివేశారు. మరికొన్ని పరిశ్రమలు సైతం మూతపడే పరిస్థితి చేరుకున్నాయి. వీటికి తోడు రుణ వాయిదాలను సకాలంలో చెల్లించకపోతుండటంతో ఇండస్ట్రీలను బ్యాంకులు సీజ్ చేసి వాటి ఆస్తులను వేలం వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 250 ఎంఎస్ఎంఈలు టీఐహెచ్‌సీఎల్‌ను సంప్రదించగా, నష్టాలకు గల కారణాలను సమగ్రంగా అధ్యయనం చేసిన అధికారులు 135 ఎంఎస్ఎంఈలు తిరిగి కోలుకునేలా సహకారం అందజేశారు.

రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు, వాటి ప్రోత్సాహానికి టీఎస్ఐపాస్ ను ప్రవేశపెట్టింది. ఈ తరుణంలో నష్టాల్లో కూరుకుపోయిన, మూతపడిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టి పరిశ్రమల స్థాయిని బట్టి రుణాలు అందజేసింది. దీంతో రూ.100 కోట్ల ఆస్తులను బ్యాంకులు వేలం వేయకుండా కాపాడినట్లయింది. అంతేకాదు సుమారు 2 వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోకుండా వారికి ఉపాధి కల్పించినట్లు అయింది. దీనికి తోడు ముడిసరుకు లభ్యతలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా ఇండస్ట్రీయల్ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. దీంతో ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పరిశ్రమల యజమానులకు భరోసా కల్పించినట్లయింది.

బ్యాంకులు ముందుకు రావాలి

దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం టీఐహెచ్‌సీఎల్‌‌ను ప్రవేశపెట్టింది. ఆర్థికంగా నష్టపోయిన, మూత పడిన ఇండస్ట్రీస్‌ను ఆదుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయం. తక్కువ వడ్డీతో రుణాలు ఇస్తూ ప్రోత్సహిస్తుంది. అయితే ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు కూడా ముందుకు రావాలి. ఆ బ్యాంకులు రుణాలు ఇచ్చినప్పుడే పరిశ్రమలు మనుగడ సాగించడంతో ఇటు పారిశ్రామిక వేత్తలు, అటు బ్యాంకులకు లాభదాయకంగా ఉంటుంది. నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుంది. -కొండేటి సుధీర్ రెడ్డి, ప్రెసిడెంట్, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రీయల్ ఫెడరేషన్



Next Story