వేతన సంఘానికి రూ.15 కోట్లు ఖర్చు

by  |
వేతన సంఘానికి రూ.15 కోట్లు ఖర్చు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏర్పాటైన వేతన సంఘం (పీఆర్సీ) 31 నెలల సమయం తీసుకుంది. కేవలం మూడు నెలల కాలానికి నియమించిన ఈ కమిషన్ సుదీర్ఘ సమయం వెచ్చించింది. మూడుసార్లు గడువు పొడిగించారు. వేతనాలు, ఇతరత్రా ఖర్చులు మొత్తం రూ.15 కోట్లు వ్యయమైంది. ఈ నెల 31న వేతన సంఘం గడువు తీరనున్న నేపథ్యంలో పీఆర్సీ నివేదికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో మొదటి పీఆర్సీ 2018 మే 18న ఏర్పాటైంది. ఈ పీఆర్సీకి సారథిగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి సీఆర్‌ బిస్వాల్‌, మరో ఇద్దరు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులు సి.ఉమామహేశ్వరరావు, మహ్మద్‌ అలీ రఫత్‌లను సభ్యులుగా నియమించారు. ఈ కమిషన్‌ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మూడు నెలల్లోగా తన నివేదికను సమర్పించాలని అప్పటి ఉత్తర్వులో పేర్కొన్నారు. అయితే ముగ్గురు సభ్యులతో కూడిన పీఆర్సీ ఏర్పాటు కావడం అదే ప్రథమం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి పీఆర్సీలన్నింటినీ ఒకే ఒక్క రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి సారథ్యంలో ఏర్పాటు చేయడం ఆనవాయితీగా కొనసాగింది. కానీ వేతన సవరణతో పాటు పలు అంశాలను త్వరగా తేల్చాలంటూ సీఎం కేసీఆర్ అప్పుడు ముగ్గురితో కమిషన్ వేశారు. ఈసారి పీఆర్సీ సభ్యులు అవసరమైతే రాష్ట్రంలోనూ, ఇతర రాష్ట్రాల్లోనూ పర్యటించేందుకు వెసులుబాటు కల్పించారు.

పీఆర్సీ తన నివేదికను రూపొందించే క్రమంలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను, వనరులను, రాష్ట్ర ఖజానాపై ఎప్పటికప్పుడు ప్రభావం చూపే స్వల్పకాలిక, దీర్ఘకాలిక పరిణామాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని స్పష్టంగా సూచించారు. కేంద్రంలోనూ, ఇతర రాష్ట్రాల్లోనూ ఉన్న వేతన స్థితిగతులను పరిశీలించాలని ఆనాడే సూచించారు. ఒక్కొక్కరికి రూ.2 నుంచి 3 లక్షల వేతనంతో పాటు ఆఫీసు సబార్డినేట్లు, కార్యాలయ సిబ్బంది, వ్యక్తిగత సిబ్బంది, వాహన సౌకర్యాలతో పాటు కార్యాలయ నిర్వహణ తదితర సౌకర్యాలిచ్చారు. ఆయా రాష్ట్రాల్లో కమిషన్ ​పర్యటన చేసింది. ఈ లెక్కన ఒక్కో నెల సుమారు రూ.40 నుంచి రూ.50 లక్షల మేర పీఆర్సీ కమిషన్​కోసం వెచ్చించారు. ముందుగా కేవలం మూడు నెలల కాలంలోనే నివేదిక ఇవ్వాలని ఆదేశించినా.. కమిషన్ సమయం తీసుకోవడంతో గడువు పెంచుతూ వచ్చారు. ఇప్పటి వరకు మూడు సార్లు కమిషన్ గడువు పెంచారు. వేతన సవరణ అంశాలతో పాటు గతేడాది పీఆర్సీకి ఉద్యోగుల విభజన వంటి అంశాల పరిశీలన కూడా అప్పగించారు.

జాబితాలో పదకొండు.. రాష్ట్రంలో తొలి పీఆర్సీ..

ఉమ్మడి రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన పదో పీఆర్‌సీయే ఇప్పటికీ అమల్లో ఉంది. ఈ వరుసలో తాజా పీఆర్‌సీ పదకొండోది. అయితే తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలి పీఆర్‌సీ ఇదేనని ప్రభుత్వం అప్పుడే ప్రకటించింది. ఆనవాయితీ ప్రకారం 2018, జులై 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల వేతనాలను సవరించాల్సి ఉందని ప్రస్తావించింది. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, స్థానిక సంస్థలు, ఎయిడెడ్‌ సంస్థలు, జేఎన్‌టీయూ, జయశంకర్‌ వ్యవసాయ విద్యాలయం సహా వర్సిటీల బోధనేతర సిబ్బంది, ఫుల్‌ టైమ్‌ కాంటింజెంట్‌ ఉద్యోగులు, వర్క్‌‌ చార్జ్‌డ్‌ ఉద్యోగులకు సంబంధించిన పే స్కేళ్లను రూపొందించి, విభాగాల వారీగా సర్వీసు నిబంధనలను కమిషన్‌ అధ్యయనం చేయాలని పేర్కొన్నారు. అప్పటి వరకు ఉన్న డీఏ (కరువు భత్యం) ను ఎంతమేరకు వేతనంలో విలీనం చేయాలి, విలీనమైన డీఏ ప్రకారం సవరించిన వేతనాలను ఎలా స్థిరీకరించాలో కూడా పరిశీలించాలని సూచించారు.

ఎట్టకేలకు నివేదిక..

కమిషన్​ వేతన సవరణతో పాటు సంబంధం లేని కొన్ని అంశాలను కూడా పరిశీలించింది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు పీఆర్సీ నివేదికను సిద్ధం చేసిందని తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే సీఎం నుంచి తుది అభిప్రాయాలను కూడా తీసుకున్నట్లు సమాచారం. ఈ నెలాఖరుతో మొత్తం 31 నెలలు పని చేసిన బిస్వాల్​కమిషన్ పలు కీలకమైన ప్రతిపాదనలతో నివేదికను సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రభుత్వ సూచన, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఫిట్‌మెంట్ అంశాలను కూడా పొందుపర్చారు. 31 నెలలు, రూ.15 కోట్ల వరకు ఖర్చు పెట్టి తయారు చేసిన పీఆర్సీ నివేదికను రేపో, ఎల్లుండో ప్రభుత్వానికి అధికారికంగా అందించనున్నారు.



Next Story

Most Viewed