'కరోనా' కోసం రంగంలోకి ఏఎన్ఎమ్‌లు

by  |
కరోనా కోసం రంగంలోకి ఏఎన్ఎమ్‌లు
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా ప్రబలకుండా రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. ఇప్పటికే ఒక ఉన్నతస్థాయి కమిటీ ముమ్మరంగా పనిచేస్తోంది. టాస్క్‌ఫోర్స్ కొంతకాలంగా యాక్టివ్‌గా ఉంది. ఇప్పుడు పరిస్థితిని సమీక్షించిన ప్రభుత్వం స్పెషల్ కమిటీని కూడా నియమించింది. సీనియర్ ఐఏఎస్ అధికారి మాణిక్‌రాజ్, సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్‌లు బాధ్యులుగా వ్యవహరించే ఈ కమిటీలో వివిధ శాఖల ఉన్నతాధికారులు సభ్యులుగా ఉన్నారు. వివిధ దేశాలకు వెళ్ళి వచ్చేవారిని విధిగా 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉంచడంపై ఈ కమిటీ దృష్టి పెట్టింది. ఇప్పటికే సుమారు 200 మందిని క్వారంటైన్‌లో ఉంచారు. ఇందుకోసం వికారాబాద్‌లోని ఫారెస్టు అకాడమీతోపాటు పర్యాటక శాఖకు చెందిన హరిత ప్లాజా, గచ్చిబౌలి స్టేడియం తదితర ప్రాంతాలను క్వారంటైన్ కేంద్రాలుగా ప్రభుత్వం ఎంపిక చేసింది.

మరోవైపు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘థర్మల్ స్క్రీనింగ్’ మెకానిజం ప్రారంభంకాక ముందు డిసెంబరు నుంచి వివిధ దేశాలకు వెళ్ళివచ్చిన ప్రయాణికుల వివరాలను ఈ కమిటీ సేకరించాలనుకుంటోంది. ఇందుకోసం ప్రత్యేకంగా హైదరాబాద్ ఐఐటీ నిపుణులతో రాష్ట్ర ప్రభుత్వం ఒక మొబైల్ అప్లికేషన్(యాప్)ను తయారు చేసింది. సమగ్ర ఆరోగ్య పథకం కింద గతంలో ఏఎన్ఎమ్‌లకు ఇచ్చిన టాబ్‌లలో ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయించి అలాంటి ప్రయాణికుల వివరాలను, వారి ఇండ్లకు వెళ్ళి ప్రస్తుత ఆరోగ్యస్థితిని తెలుసుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. విమానాశ్రయం నుంచి ప్రయాణికుల వివరాలను ఈ కమిటీ సేకరిస్తోంది.

విమానాశ్రయంలో ‘థర్మల్ స్క్రీనింగ్’ ప్రారంభం కాకముందు సుమారు 750 మంది మన రాష్ట్రానికి చెందినవారు వివిధ దేశాలకు వెళ్ళి వచ్చినట్లు అంచనా. వీరి వివరాలను సేకరించి ఎక్కడున్నారో కనుక్కుని వారి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడంపై ఈ కమిటీ ప్రధాన దృష్టి సారించింది. ఏఎన్ఎమ్‌ల ద్వారా వారి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన తాజా వివరాల ఆధారంగా తదుపరి చర్యలపై ఈ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది.

Tags : Telangana, Corona, ANM, mobile App, Hyderabad IIT, Airport

Next Story

Most Viewed