రైతులను ‘సన్నా’ల వైపు మళ్లించండి : మంత్రి నిరంజన్ రెడ్డి

by  |

దిశ, న్యూస్‌ బ్యూరో: సీఎం కేసీఆర్ సూచనల మేరకు రాష్ట్రంలో రైతులను దొడ్డు బియ్యం సాగు నుంచి సన్నాల రకాల సాగు వైపు మళ్లించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి ఎస్.నిరంజన్ రెడ్డి అధికారులను కోరారు. వానాకాలం సాగుకు జిల్లాల వారిగా సన్నరకం వరి వంగడాలు అందుబాటులో ఉంచాలనీ, రాష్ట్రంలో ఏ మేరకు సన్న వంగడాలు అందుబాటులో ఉన్నాయో వెంటనే నివేదిక ఇవ్వాలని ఆయన ఆదేశించారు.

హైదరాబాద్‌లోని హాకా‌భవన్‌లో వానాకాలం సాగుపై శనివారం జరిగిన సన్నాహక సమావేశంలో మంత్రి మాట్లాడారు. గత వానాకాలంలో రాష్ట్రంలో 40 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, అందులో 23 లక్షల ఎకరాల్లో సన్నాలు సాగయ్యయని తెలిపారు. ఈసారి 30 నుంచి 35 లక్షల ఎకరాల్లో సన్నరకాలు సాగయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సాగుచేసేందుకు ముందుకొచ్చే రైతులందరికీ సన్న వంగడాలు అందించాలని ఆదేశించారు. అవసరమైతే ఈ విషయంలో రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి సాంకేతిక సహకారం అందించాలని చెప్పారు. ఈ సన్నాహక సమావేశంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రవీణ్‌రావు, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఎండీ కేశవులు పాల్గొన్నారు.



Next Story