పాయింట్ నెమో.. జీవరాశి లేని ఈ ప్రదేశం గురించి ఆసక్తికర విశేషాలివే..!

by Disha Web Desk 20 |
పాయింట్ నెమో.. జీవరాశి లేని ఈ ప్రదేశం గురించి ఆసక్తికర విశేషాలివే..!
X

దిశ, ఫీచర్స్ : ఒక్కోసారి ఆధునిక జీవితంలోని హడావిడి నుండి కొంత కాలం దూరంగా ఉండాలని అనిపిస్తుంది. ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్లి కొంతకాలం గడపాలని అనిపిస్తుంది. భూమిపై మనుషులు ఎవరూ రాని ప్రదేశంలో ప్రశాంతంగా గడపాలనిపిస్తుంది. అయితే ఇలాంటి ప్రదేశాల గురించి చాలా మందికి తెలిసి ఉండదు. ఇలాంటి ప్రదేశాలకు వెళ్లడం కాస్త కష్టం. మరి అలాంటి ప్రదేశమేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుతం మనం చెప్పుకోబోయే ప్రదేశం భూమి కాదు. మరి ఎక్కడ అనుకుంటున్నారా అది పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న పాయింట్ నెమో ప్రాంతం. ఇక్కడ చూద్దామంటే మట్టి అస్సలు కనిపించదు. ఈ ప్రాంతాన్ని నిశ్శబ్ద ప్రదేశం లేదా, భూమి పై ఉన్న రిమోట్ ప్లేస్ అని చెబుతారు.

దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఈ ప్రాంతాన్ని చేరుకోవడం అంత ఈజీ కాదు. భూ భాగం నుంచి ఈ ప్రదేశానికి వెళ్లాలంటే దక్షిణ అమెరికా, అంటార్కిటికా, న్యూజిలాండ్ కు మధ్య దిశగా సముద్రంలో 2600 కిలోమీటర్లు దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. అందుకే ఈ ప్రాంతాన్ని ‘ఓషియానిక్ పోల్ ఆఫ్ ఇన్‌యాక్సెసిబులిటీ’ అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతం భూమి మీద నివసించేవారి కన్నా భూమికి 258 మైళ్ల ఎత్తులో ఉన్న అంతరిక్ష కేంద్రానికి దగ్గరగా ఉంటుంది. ఈ పాయింట్‌ లో నివాసప్రాంతాలేమి ఉండకపోవడంతో సైంటిస్టులు ఈ ఏరియాని నెమో పాయింట్ అని పిలుస్తారు. నెమో అంటే లాటిన్ భాషలో ‘ఎవరూ లేని’ అని అర్థం వస్తుంది.

ఈ ప్రాంతంలో అలలు విపరీతంగా వస్తుంటాయి. ఇక్కడ రొటేటింగ్ కరంట్ ఉండడంతో పోషకాలు ఉండే నీరు ప్రవహించకుండా నిరోధిస్తుంది. ఈ ప్రాంతం ఉపరితలంలో ఎలాంటి జీవరాశి కనిపించదు. ఈ ప్రాంతానికి సమీపంలో చిన్న చిన్న పీతలను, ఎన్నో రకాల బ్యాక్టీరియాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారట. 1992లో కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా ఈ పాయింట్ ని క్రొయేషియాకు చెందిన సర్వే ఇంజినీర్ హ్రోవ్జేలుకాటెలా కనుగొన్నారు. ఆ తర్వాత 1997లో ఈ పాయింట్ లో సముద్రపు అడుగులో భీకర శబ్దాలను కనుగొని శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. ఈ మిస్టరీ శబ్దానికి "ది బ్లూప్" అని అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్‌ అండ్ అమెరికా నేషనల్ ఓషియానిక్ కు చెందిన శాస్త్రవేత్తలు నామకరణ చేశారు. ఈ శబ్దాన్ని మూడు వేల మైళ్ల కంటే ఎక్కువ దూరం నుంచి మైక్రోఫోన్‌ల ద్వారా గుర్తించారు.

భూమికి దూరంగా, మహాసముద్రం మధ్యలో ఉన్న ఈ ‘పాయింట్ నెమో’ మానవాళికి ఎంతగానో ఉపయోగపడుతోంది. కాలం తీరిన, పనిచేయని ఉపగ్రహాలను, అంతరిక్ష వ్యర్థాలను ఈ ప్రాంతంలోనే కూల్చి వేస్తున్నారు. అందుకే పాయింట్ నెమోని అంతరిక్ష నౌకల స్మశానవాటిక అని కూడా పిలుస్తారు. ఊహించలేని విధంగా అంతరిక్ష కేంద్రాలను, అంతరిక్ష నౌకలు ఈ ప్రాంతంలోనే డిస్మాండిల్ చేస్తారు. కొన్ని నివేదికల ప్రకారం 1971 నుంచి 2016 మధ్య పాయింట్ నెమో ప్రాంతంలో 260 కి పైగా అంతరిక్ష నౌకలను కూల్చివేశారు. ఈ జాబితాలో రష్యాకు చెందిన సోయూజ్ స్పేస్ క్రాఫ్ట్‌, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ స్పేస్ షిప్‌, సోవియట్ యూనియన్‌ సమయంలోని మిర్ స్పేస్ స్టేషన్‌ను కూడా ఈ పాయింట్ నెమో వద్దే కూల్చేశారు.

Next Story

Most Viewed