ఐఫోన్‌లో జెమినీ ఏఐ ఫీచర్ల కోసం గూగుల్‌తో యాపిల్ చర్చలు

by Dishanational1 |
ఐఫోన్‌లో జెమినీ ఏఐ ఫీచర్ల కోసం గూగుల్‌తో యాపిల్ చర్చలు
X

దిశ, టెక్నాలజీ: ప్రీమియం స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐఫోన్‌లో గూగుల్‌కు చెందిన జెమినీ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) ఫీచర్లను అందించేందుకు యాపిల్ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్ సోమవారం తన నివేదికలో తెలిపింది. యాపిల్ ఇటీవల మైక్రోసాఫ్ట్ మద్దతున్న ఓపెన్ ఏఐతో కూడా చర్చలు జరిపినట్టు సమాచారం. యాపిల్ తన సొంత ఏఐ మోడల్‌ను రాబోయే ఐఫోన్ ఐఓఎస్ 18లో అందించేలా ప్రణాళికలు కలిగి ఉంది. అయితే, ఫోటోలను రూపొందించడం, సాధారణ ప్రాంప్ట్‌ల ఆధారంగా వ్యాసాలు రాయడం వంటి ఫీచర్లతో సహా జనరేటివ్ ఏఐ ఫీచర్ల కోసం ఆయా కంపెనీలతో భాగస్వామ్యం కోసం ప్రయత్నిస్తోంది. ప్రస్తుతానికి ఇరు కంపెనీలు ఏఐ ఒప్పందం గానీ, బ్రాండింగ్ గానీ, అమలు విషయంపై ఇంకా ఎలాంటి అంశాలను ఖరారు చేయలేదు. ఈ ఏడాది జూన్‌లో యాపిల్ తన వార్షిక వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ వరకు ఈ ఒప్పందంపై ప్రకటన ఉండకపోవచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. జనరేటివ్ ఏఐని తీసుకురావడంలో యాపిల్ సంస్థ గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీల కంటే వెనుకబడి ఉంది. గత నెలలో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ మాట్లాడుతూ, జనరేటివ్ ఏఐని ఉపయోగించడానికి సంబంధించి ఈ ఏడాది ఆఖరులో వెల్లడిస్తాం. ఈ విభాగంలో కంపెనీ భారీగా పెట్టుబడులు పెడుతుందని పేర్కొన్నారు. మరోవైపు, స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ ఈ ఏడాది జనవరిలో తన గెలాక్సీ ఎస్24 సిరీస్ ఫోన్‌లలో జనరేటివ్ ఏఐ టెక్నాలజీని అందించేందుకు గూగుల్‌తో భాగస్వామ్యం చేసుకుంది.



Next Story

Most Viewed