ఇండియా vs ఇంగ్లాండ్‌ సెకండ్‌ టెస్ట్ అప్‌డేట్స్

by  |
Cricket
X

దిశ, స్పోర్ట్స్ : తొలి రోజే నయం అనిపించింది. భారత బ్యాట్స్‌మాన్ కనీసం పరుగులైనా సాధించారు. రెండో రోజు బంతి అనూహ్యంగా తిరుగుతూ బ్యాట్స్‌మెన్‌ను చాలా ఇబ్బంది పెట్టింది. సుడులు తిరుగుతున్న బంతులను ఎదుర్కోలేక ఇంగ్లాండ్ జట్టు 134కే చాపచుట్టేసింది. లోకల్ బాయ్ అశ్విన్ రికార్డు స్థాయిలో 29వ సారి ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. అతడికి ఇషాంత్, అక్షర్, సిరాజ్ తోడవటంతో ఇంగ్లాండ్ తక్కువ స్కోరుకే ఆలౌట్ అయ్యింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ ఇండియా ఒక వికెట్ కోల్పోయింది. స్పిన్నర్లు వేసే బంతులు ఎటు వైపు తిరుగుతున్నాయో తెలియని స్థితిలో సెంచరీ వీరుడు రోహిత్ శర్మ కూడా ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పటికే ఇంగ్లాండ్ జట్టుపై టీమ్ ఇండియా పూర్తి ఆధిపత్యం సాధించి 249 పరుగుల ఆధిక్యంలో ఉన్నది. మూడో రోజు మరో 150 పరుగులు జోడిస్తే ఇంగ్లాండ్ ఆ టార్గెట్ ఛేదించడానికి ఆపసోపాలు పడాల్సిందే.

పేటీఎం టెస్ట్ సిరీస్‌లో భాగంగా చెన్నైలోని చేపాక్ స్టేడింయలో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆసక్తికరంగా సాగింది. 300/6 ఓవర్ నైట్ స్కోర్‌తో బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియా మరో 29 పరుగులు మాత్రమే జోడించి ఆలౌట్ అయ్యింది. రెండో రోజు ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన మొయిన్ అలీ అద్భుతమైన బంతులతో ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ను పెవీలియన్ పంపించాడు. మొయిన్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్ (5) బెన్ ఫోక్స్‌ చేసిన స్టంపింగ్‌కు అవుటయ్యాడు. మరో రెండు బంతుల తర్వాత ఇషాంత్ శర్మ (0) రోరి బర్న్స్ ‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. వికెట్లు పడుతుండటంతో మరో ఎండ్‌లో రిషబ్ పంత్ చెలరేగిపోయాడు. సిక్సులు, బౌండరీలు బాదుతూ పరుగుల వేగం పెంచాడు. కానీ టెయిలెండర్లలో అతడికి సరైన సహకారం లభించలేదు. 65 బంతుల్లో అర్ద శతకం పూర్తి చేసుకున్న రిషబ్ పంత్ అదే దూకుడు కొనసాగించాడు. అయితే స్టోన్ వేసిన ఓవర్లో కుల్దీప్ యాదవ్ (0) ఫోక్స్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన సిరాజ్ (4) తొలి బంతిని బౌండరీకి తరలించి మంచి టచ్‌లో ఉన్నట్లు కనపడ్డాడు. కాని తర్వాత బంతికే ఫోక్స్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. రిషబ్ పంత్ (58 నాటౌట్)కు సరైన జోడి లేక టీమ్ ఇండియా 329 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

ఆ వెంటనే బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్‌కు శుభారంభం దక్కలేదు. తొలి ఓవర్‌లోనే ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో ఓపెనర్ బర్న్స్ (0) ఎల్బీడబ్ల్యూగా పెవీలియన్ చేరాడు. మరో ఓపెనర్ డామ్ సిబ్లీ కాస్త నిలదొక్కుకున్నట్లు కనిపించాడు. కానీ అశ్విన్ బౌలింగ్‌లో సిబ్లి (16) విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే ప్రమాదకరమైన కెప్టెన్ జో రూట్ (6)ను అక్షర్ అవుట్ చేశాడు. అక్షర్ వేసిన బంతిని స్వీప్ షాట్ ఆడాలని ప్రయత్నించిన జో రూట్.. అశ్విన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అక్షర్ పటేల్‌కు ఇది తొలి టెస్ట్ వికెట్ కావడం గమనార్హం. ఇక తొలి సెషన్ చివరి బంతికి ఇంగ్లాండ్ మరో వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్‌లో డాన్ లారెన్స్ (9) శుభమన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. లంచ్ సమయానికి ఇంగ్లాండ్ 4 వికెట్ల నష్టానికి 39 పరుగులు చేసింది.

రెండో సెషన్‌లో కూడా టీమ్ ఇండియా బౌలర్లు విజృంభించారు. స్పిన్నర్ల బంతులను ఎదుర్కోలేక ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ ముప్పతిప్పలు పడ్డారు. క్రీజులో నిలదొక్కుకున్నట్లు కనిపించిన బెన్ స్టోక్స్ (18) అశ్విన్ వేసిన ఒక అద్భుతమైన బంతికి బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత ఓలీ పోప్, బెన్ ఫోక్స్ కలసి కాసేపు స్కోరును పెంచే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ కలసి ఆరో వికెట్‌కు 35 పరుగులు జోడించారు. వీళ్లు నిలదొక్కుకున్నారని అనుకుంటుండగానే విరాట్ కోహ్లీ బౌలింగ్‌లో మార్పు చేశాడు. మహ్మద్ సిరాజ్‌కు బంతిని అందించాడు. ఇండియాలో తొలి సారి బౌలింగ్ చేస్తున్న సిరాజ్.. వేసిన తొలి బంతికే వికెట్ తీశాడు. సిరాజ్ బౌలింగ్‌లో ఓలీ పోప్ (22) లెగ్ సైడ్ ఇచ్చిన క్యాచ్‌ను కీపర్ రిషబ్ పంత్ అద్భుతంగా డైవ్ చేసి క్యాచ్ అందుకున్నాడు. తొలి సారిగా ఇండియాలో టెస్టు మ్యాచ్ ఆడుతున్న బెన్ ఫోక్స్ క్రీజులో పాతుకొని పోయాడు. అతడిని అవుట్ చేయడం కోసం టీమ్ ఇండియా బౌలర్లు చాలా శ్రమించారు. దీంతో మరో ఎండ్‌లో వికెట్లు తీయడం ప్రారంభించారు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో మొయిన్ అలీ (6) రహానేకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మరి కొద్ది సేపటికే ఓల్లీ స్టోన్ (1) అశ్విన్ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. దీంతో అంపైర్లు టీ బ్రేక్ ప్రకటించారు. అప్పటికి ఇంగ్లాండ్ స్కోర్ 106/8.

మూడో సెషన్‌లో మిగిలిన రెండు వికెట్లు వెంటనే పడిపోతాయి అని భావించినా.. బెన్ ఫోక్స్ అడ్డుగా నిలిచాడు. చక్కని షాట్లు ఆడుతూ పరుగులు రాబట్టాడు. అయితే 59వ ఓవర్‌లో ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో జాక్ లీచ్ (5) రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. ఆ తర్వాతి ఓవర్‌లో అశ్విన్ వేసిన బంతికి స్టువర్ట్ బ్రాడ్ (0) క్లీన్ బౌల్డ్ కావడంతో ఇంగ్లాండ్ జట్టు 134 పరుగులకు ఆలౌట్ అయ్యింది. బెన్ ఫోక్స్ (42) ఒక్కడే ఒంటరి పోరాటం చేసి ఇంగ్లాండ్ జట్టుకు ఫాలో ఆన్ తప్పించాడు. రవిచంద్రన్ అశ్విన్ 5, ఇషాంత్ శర్మ, అక్షర్ పటేల్ చెరి 2 వికెట్లు తీయగా, మహ్మద్ సిరాజ్ ఒక వికెట్ తీశాడు. టీమ్ ఇండియాకు 195 పరుగుల ఆధిక్యం లభించింది.

ఇక రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ ఇండియాకు మరోసారి ఓపెనర్ శుభమన్ గిల్ త్వరగా అవుటై నిరాశ పరిచాడు. కాగా, మొదటి నుంచి రోహిత్ శర్మ, గిల్ ధాటిగా ఆడారు. వీరిద్దరూ బౌండరీలతో విరుచుకపడ్డారు. 42 పరుగుల వద్ద గిల్ (14) లీచ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చన పుజార (7), రోహిత్ శర్మ (25) ఆచితూచి ఆడారు. ఇంగ్లాండ్ స్పిన్నర్లు పిచ్ స్వభావాన్ని ఉపయోగించుకొని కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. పలుమార్లు రోహిత్, పుజార అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. దీంతో టీమ్ ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో 1 వికెట్ కోల్పోయి 54 పరుగులు చేసింది. లీచ్‌కు ఒక వికెట్ లభించింది. టీమ్ ఇండియా ప్రస్తుతం 249 పరుగుల ఆధిక్యంలో ఉన్నది.

ఆటలో మరో మూడు రోజులు మిగిలి ఉండటంతో కచ్చితంగా ఫలితం తేలుతుంది. టీమ్ ఇండియా సోమవారం మరో 150 నుంచి 200 పరుగులు చేసినా ఇంగ్లాండ్ టార్గెట్ 400 దాటి పోతుంది. స్పిన్‌కు అనుకూలిస్తున్న ఈ పిచ్‌పై అంత స్కోర్ చేయడం అసాధ్యం. ఇప్పుడు ఇంగ్లాండ్ జట్టును ఓటమి నుంచి కాపాడాలంటే ఏదైనా అద్బుతం జరగాల్సిందే.

స్కోర్ బోర్డు

ఇండియా తొలి ఇన్నింగ్స్

రోహిత్ శర్మ (సి) మొయిన్ అలీ (బి) జాక్ లీచ్ 161, శుభమన్ గిల్ (ఎల్బీడబ్ల్యూ)(బి) ఒలీ స్టోన్ 0, చతేశ్వర్ పుజార (సి) బెన్ స్టోక్స్ (బి) జాక్ లీచ్ 21, విరాట్ కోహ్లీ (బి) మొయిన్ అలీ 0, అజింక్య రహానే (బి) మొయిన్ అలీ 67, రిషబ్ పంత్ 58 నాటౌట్, రవిచంద్రన్ అశ్విన్ (సి) ఓలీ పోప్ (బి) జో రూట్ 13, అక్షర్ పటేల్ (స్టంప్) బెన్ ఫోక్స్ (బి) మొయిన్ అలీ, ఇషాంత్ శర్మ (సి) రోరీ బర్న్స్ (బి) మొయిన్ అలీ 0, కుల్దీప్ యాదవ్ (సి) బెన్ ఫోక్స్ (బి) ఓల్లీ స్టోన్ 0, మహ్మద్ సిరాజ్ (సి) బెన్ ఫోక్స్ (బి) ఓల్లీ స్టోన్; మొత్తం (95.5 ఓవర్లు) 329 ఆలౌట్

వికెట్ల పతనం : 1-0, 2-85, 3-86, 4-248, 5-249, 6-284, 7-301, 8-301, 9-325, 10-329

బౌలింగ్ : స్టువర్ట్ బ్రాడ్ (11-2-37-0), ఒల్లీ స్టోన్ (15.5-5-47-3), జాక్ లీచ్ (27-3-78-2), బెన్ స్టోక్స్ (2-0-16-0), మొయిన్ అలీ (29-3-128-4), జో రూట్ (11-3-23-1)

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్

రోరీ బర్న్స్ (ఎల్బీడబ్ల్యూ)(బి) ఇషాంత్ శర్మ 0, డామ్ సిబ్లీ (సి) విరాట్ కోహ్లీ (బి) రవిచంద్రన్ అశ్విన్ 16, డాన్ లారెన్స్ (సి) శుభమన్ గిల్ (బి) రవిచంద్రన్ అశ్విన్ 9, జో రూట్ (సి) అశ్విన్ (బి) అక్షర్ పటేల్ 6, బెన్ స్టోక్స్ (బి) రవిచంద్రన్ అశ్విన్ 18, ఓలీ పోప్ (సి) రిషబ్ పంత్ (బి) మహ్మద్ సిరాజ్ 22, బెన్ ఫోక్స్ 42 నాటౌట్, మొయిన్ అలీ (సి) రహానే (బి) అక్షర్ పటేల్ 6, ఓల్లీ స్టోన్ (సి) రోహిత్ శర్మ (బి) రవిచంద్రన్ అశ్విన్ 1, జాక్ లీచ్ (సి) రిషబ్ పంత్ (బి) ఇషాంత్ శర్మ 5, స్టువర్ట్ బ్రాడ్ (బి) రవిచంద్రన్ అశ్విన్; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (59.5 ఓవర్లు) 134 ఆలౌట్

వికెట్ల పతనం : 1-0, 2-16, 3-23, 4-39, 5-52, 6-87, 7.105, 8-106, 9-131,10-134

బౌలింగ్ : ఇషాంత్ శర్మ (5-1-22-2), రవిచంద్రన్ అశ్విన్ (23.5-4-43-5), అక్షర్ పటేల్ (20-3-40-2), కుల్దీప్ యాదవ్ (6-1-16-0), మహ్మద్ సిరాజ్ (5-4-5-1)

టీమ్ ఇండియా రెండో ఇన్నింగ్స్

రోహిత్ శర్మ 25 బ్యాటింగ్, శుభమన్ గిల్ (ఎల్బీడబ్ల్యూ)(బి) జాక్ లీచ్ 14, చతేశ్వర్ పుజార 7 బ్యాటింగ్; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (18 ఓవర్లు) 54/1

బౌలింగ్ : ఓల్లీ స్టోన్ (2-0-8-0), జాక్ లీచ్ (9-2-19-1), మొయిన్ అలీ (7-2-19-0)

Next Story