‘వైసీపీలో చేరేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు రెడీ’

by  |
‘వైసీపీలో చేరేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు రెడీ’
X

దిశ ఏపీ బ్యూరో: పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై టీడీపీ శాసనసభ్యుడు కరణం బలరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధినేత చంద్రబాబుతో ఎంతకాలం నుంచి ఉన్నామో అందరికీ తెలుసన్న ఆయన, బాబుతో ఎంత ఇబ్బంది పడ్డామో కూడా తెలుసని అన్నారు. సమయం వచ్చినప్పుడు ఆ వివరాలు వెల్లడిస్తానని ఆయన తెలిపారు. చంద్రబాబు వైఖరికి, జగన్ వ్యవహారశైలికి ఎంతో తేడా ఉందన్న ఆయన, జగన్ ను నమ్మినవాళ్లకు తప్పకుండా న్యాయం జరుగుతుందని అన్నారు.

అందుకే వైఎస్సార్సీపీలో చేరేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఎంతమంది వైఎస్సార్సీపీలో చేరుతారన్నది ఇప్పుడే చెప్పలేనన్న ఆయన, 10 మందో, 12 మందో పార్టీ మారే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసమే పార్టీ మారాలని నిర్ణయించుకున్నారని ఆయన అన్నారు. వారంతా సీఎం జగన్ తోనూ, వైఎస్సార్సీపీ సీనియర్ నేతలు, ముఖ్యనేతలతో సంప్రదింపులు జరుపుతున్నారని వెల్లడించారు.

ఇందుకు ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు కూడా మినహాయింపు కాదని ఆయన ముక్తాయించారు. దీనిపై ఇంకొన్నాళ్ల తరువాత క్లారిటీ వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తమకు కేవలం జగన్‌తో మాత్రమే కాదని, జగన్ తండ్రి వైఎస్ తోనూ సన్నిహిత సంబంధాలుండేవని కరణం గుర్తుచేసుకున్నారు. వెలుగొండ విషయంలో చంద్రబాబు నిర్లక్ష్యం కారణంగానే ప్రాజెక్టు అసంపూర్తిగా ఉందని, అది తమ వైఫల్యం కాదని అన్నారు. వెలుగొండ విషయంలో ఎంతో ఒత్తిడి తెచ్చినా అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రజల కోసం చంద్రబాబు చిత్తశుద్ధితో పని చేయలేదని ఆయన విమర్శించారు. జగన్ ఏడాది పాలనలోనే ప్రజల్లో నమ్మకం కల్గించగలిగారని ఆయన ప్రశంసించారు. ఏడాది పాలన పూర్తి చేసుకున్నందుకు జగన్‌కు ఆయన అభినందనలు తెలిపారు.

Next Story

Most Viewed