దిశ చట్టం పేరుతో ఎన్నాళ్లు మోసం చేస్తారు: గౌతు శిరీష

by  |
దిశ చట్టం పేరుతో ఎన్నాళ్లు మోసం చేస్తారు: గౌతు శిరీష
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ప్రభుత్వంపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష ఆగ్రహం వ్యక్తం చేశారు. దిశ చట్టం పేరుతో ప్రజలను ఎన్నాళ్లు మోసం చేస్తారంటూ ప్రశ్నించారు. రాఖీపౌర్ణమి సందర్భంగా ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడుతూ దిశ చట్టంపై బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని.. 60 ఏళ్ల వృద్ధురాలు నుంచి ఆరేళ్ల పసిపాపల వరకు ఎవరికీ రక్షణ లేదని శిరీష ఆరోపించారు. రాష్ట్రంలో రాఖీ శుభాకాంక్షలు తెలిపే పరిస్థితులు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. ఆడబిడ్డలంటే సీఎంకు ఎందుకంత అలుసో అర్థం కావడం లేదని శిరీష ఆవేదన వ్యక్తం చేశారు. మృగాళ్ల బారినపడిన బాధిత కుటుంబాలను పరామర్శించే తీరిక కూడా ఈ ముఖ్యమంత్రికి దొరకడం లేదని విమర్శించారు. బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబ సభ్యులను ప్రలోభపెట్టినంత మాత్రాన వారికి న్యాయం చేసినట్లు కాదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 500 మందికిపైగా ఆడవారిపై దాడులు జరిగాయని.. ఇప్పటి వరకు ఒక్క బాధితురాలికి న్యాయం జరగలేదని గౌతు శిరీష మండిపడ్డారు.

Next Story