రూ. 8,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న టాటా స్టీల్.. ఎందుకంటే ?

by  |
రూ. 8,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న టాటా స్టీల్.. ఎందుకంటే ?
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఉక్కు దిగ్గజ సంస్థ టాటా స్టీల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 8,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు వెల్లడించింది. భారత కార్యకలాపాల కోసం ఈ మొత్తాన్ని మూలధన వ్యయంగా వినియోగించనున్నట్టు కంపెనీ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ టీవీ నరేంద్రన్ చెప్పారు. ప్లాంట్, మైనింగ్ కార్యకలాపాల విస్తరణ, రీసైక్లింగ్ వ్యాపారాల కోసం ఈ నిధులను ఖర్చు చేయనున్నట్టు ఆయన తెలిపారు.

దేశీయ వ్యాపారాన్ని స్థిరంగా కొనసాగిస్తూ, ఉత్పత్తిని మెరుగుపరిచేందుకు కంపెనీ తన యూరప్ కార్యకలాపాల కోసం నిర్ణయించిన రూ. 3 వేల కోట్లకు ఈ తాజా పెట్టుబడులు అదనంగా ఉండనున్నట్టు నరేంద్రన్ పేర్కొన్నారు. అలాగే, టాటా స్టీల్ ఒడిశాలోని తన ప్లాంట్ సామర్థ్యాన్ని ఏడాదికి యాభై లక్షల టన్నుల నుంచి ఎనభై లక్షల టన్నులకు విస్తరించనున్నట్టు కంపెనీ స్పష్టం చేసింది. రూ. 8,000 కోట్ల పెట్టుబడుల్లోంచి టాటా స్టీల్ రీసైక్లింగ్ ప్లాంట్ ఏర్పాటును కూడా నిర్వహించనున్నట్టు, ఈ విభాగంలో కొత్త వ్యాపార ప్రణాళికను అనుసరించనున్నట్టు కంపెనీ వివరించింది. ఎక్కువ స్క్రాప్ అందుబాటులో ఉన్న చోట రీసైక్లింగ్ సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు సంస్థ బృందం పనిచేస్తోందని టీవీ నరేంద్రన్ చెప్పారు.

Next Story