ప్యాసింజర్ కార్ల ధరలు పెంచనున్న టాటా.. ఎప్పటి నుంచి అంటే ?

by  |
ప్యాసింజర్ కార్ల ధరలు పెంచనున్న టాటా.. ఎప్పటి నుంచి అంటే ?
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ ఇప్పటికే పలుమార్లు వాహనాల ధరలు పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి కంపెనీ అన్ని ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచాలని భావిస్తోంది. వచ్చే వారంలో ఈ పెంపు ఉండొచ్చని కంపెనీ వర్గాలు స్పష్టం చేశాయి. ఉక్కుతో పాటు వాహనాల తయారీలో వాడే విలువైన లోహాల వంటి నిత్యావసర పరికరాలకు అధిక వ్యయం అవుతున్న కారణంగానే ఈ పెంపు ఉండనున్నట్టు టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల విభాగం అధ్యక్షుడు శైలేష్ చంద్ర చెప్పారు. ఈ ఏడాదిలోనే ఉక్కు ధరలు 50 శాతం వరకు పెరిగాయి. దీనివల్లే ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత స్కూటర్ల నుంచి భారీ వాహనాల వరకు అన్నిటిపై తయారీ కంపెనీలు రెండుసార్లు ధరల పెంపును ప్రకటించాయి.

జూన్ నాటికి ముడి సరుకుల ధరలు తగ్గుతాయని ఊహించినప్పటికీ జరగకపోవడంతో, మళ్లీ ధరలు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. టాటా కంపెనీ ప్రస్తుతం టియాగో, నెక్సాన్, హారియర్, సఫారీ లాంటి ప్యాసింజర్ వాహనాలను దేశీయ మార్కెట్లో విక్రయిస్తోంది. ‘ఇప్పటివరకు ఇన్‌పుట్ ఖర్చులు పెరిగినా వినియోగదారులపై భారం పడకుండా కంపెనీ జాగ్రత్తలు తీసుకుంది. వివిధ వ్యయ తగ్గింపు నిర్ణయాలు అమలు చేస్తున్నప్పటికీ ఇన్‌పుట్ ఖర్చుల ప్రభావం అధికమవుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న వ్యయాన్ని తగ్గించేందుకే తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చే వారం నుంచి ధరల పెంపు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని’ శైలేష్ చంద్ర వివరించారు. ఏ ఏ మోడళ్లపై ఎంతమేరకు ధర పెంచనున్నది త్వరలో కంపెనీ వెల్లడించనుంది.

Next Story

Most Viewed