అనాథకు కడలి నేర్పిన జీవితపాఠం..

by  |
Tamil-Short-Film-Kadal
X

దిశ, సినిమా: ప్రపంచంలో మూడు రకాల మనుషులుంటారు. విజేతలు, ఓడిపోయినవారు, చోద్యం చూసేవారు. ఈ కేటగిరీల్లో కేవలం ఓడిపోయినవారికి మాత్రమే సమస్యలుంటాయా? జీవితాన్ని అక్కడే ముగించాలా? తామున్న పరిస్థితులకు కారణం ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్, మనీ లేకపోవడం, ఎడ్యుకేషన్ క్వాలిటీ, బ్యాడ్‌లక్ అని బ్లేమ్ చేస్తే సరిపోతుందా? లేక నమ్మకంతో ముందుకు సాగాలా? ఇలాంటి గందరగోళంలో ‘ఒక అడుగు వెనక్కి వేసినా ఎదురయ్యే మరో ప్రమాదాన్ని ఫేస్ చేసేందుకు సిద్ధంగా ఉండాలే తప్ప.. జీవితానికి ఫుల్‌స్టాప్ పెట్టాల్సిన అవసరం లేదు’ అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన తమిళ్ షార్ట్ ఫిల్మ్ ‘కడల్’ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది.

ఒక అనాథ యువకుడు బాగా చదువుకుని జీవితంలో గొప్పస్థాయికి ఎదగాలి అనుకుంటాడు. కానీ తనను చిన్ననాటి నుంచి చూస్తున్న సమాజం ఎప్పుడూ సూటిపోటిమాటలతో మరింత దిగజార్చేందుకు ప్రయత్నిస్తుందే తప్ప కనీస ప్రోత్సాహాన్ని అందించదు. బంధువులు అనుకున్నవారు.. స్నేహితులుగా భావించినవారు.. ప్రేమించిన అమ్మాయి.. ఇలా ప్రతీ ఒక్కరు తనను తక్కువ చేస్తూనే మాట్లాడుతారు. ఈ సమయంలో డిప్రెషన్‌కు గురైన వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించగా.. కడలి(సముద్రం) తనకు ఎలాంటి పాఠం నేర్పింది? తనను విజేతగా ఎలా నిలబెట్టింది? అనేది కథ

సముద్రం అడుగు వెనక్కి వేసి ప్రపంచాన్ని రక్షిస్తుంది. అదే అడుగు ముందుకు వేస్తే ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. రెండూ కూడా తన చర్యలే. అలాగే మనిషి కూడా మంచి కోసం అవసరమైతే ఒక అడుగు వెనక్కి లేదా ముందుకు వేసి లైఫ్‌ను సక్సెస్‌ఫుల్‌గా నిలబెట్టుకోవాలి. దేవుడు మనకు నచ్చిన ప్రతీ ఒక్కటి తీసుకుపోయినా.. అంతకుమించి ఏదో విలువైన వస్తువును మనదగ్గరే ఉంచుతాడు. అదేంటో కనిపెట్టి ముందుకు సాగడమే జీవితం. ‘అనాథగా పుట్టడం తప్పుకాదు.. అనాథగా చనిపోవడం మాత్రం తప్పే’ అనే లైన్‌తో తెరకెక్కిన షార్ట్ ఫిల్మ్ ‘కడల్’.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఓ అనాథ యువకుడు మోటివేషనల్ స్పీకర్‌గా ఎలా మారాడనే సక్సెస్ స్టోరీని ప్రజెంట్ చేసింది.

Next Story

Most Viewed