సిద్దిపేట రైతు పంట పండించిన తమన్నా, కాజల్

433

దిశ, వెబ్‌డెస్క్ : పల్లెల్లో మూఢ నమ్మకాలకు పెద్దపీఠ వేస్తారనడంలో సందేహం లేదు. కొత్త ఇల్లు కట్టినా, షాపు ఓపెన్ చేసినా నరదిష్టి తగులుతుందని గుమ్మడికాయ కట్టడంతోపాటు దిష్టి బొమ్మలను గుమ్మం ముందట తగిలిస్తూ ఉంటారు. మరికొందరు దిష్టి యంత్రాలను సైతం కడుతుంటారు. వీటన్నీటికి భిన్నంగా ఓ రైతు వినూత్నంగా ఆలోచించాడు. తన పంటకు దిష్టి తగులుతుందని, ప్రతి ఏటా ఏదో ఓ రూపంలో నష్టపోతున్నానని, దాని నివారణకు తన ఆలోచనలకు పదునుపెట్టాడు. మదిలో ఓ ఐడియా మెరవడంతో ఆ ఆలోచనను ఆచరణలో పెట్టి.. ఈ యేడు అధిక దిగుబడులు సాధించి లాభాల బాట పట్టాడట. ఇంతకూ ఆ రైతు ఏం చేశాడో తెలుసా..?

 

రైతు చంద్రమౌళిది సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండ‌లం చందలపూర్ గ్రామం. గ్రామంలో అందరి రైతుల మాదిరిగానే ఆయన తనకున్న రెండు ఎకరాల్లో మిర్చి పంట సాగు చేస్తున్నాడు. ప్రతి ఏటా తోట ఏపుగా పెరిగి కాత కాస్తున్నప్పటికీ.. పంట చేతికి వచ్చే సమయంలో ఏదో ఒక తెగులు సోకి నష్టపోతున్నాడు. ఇలా రెండు, మూడేళ్లు నష్టపోయిన చంద్రమౌళి.. తోటకు నరదిష్టి తగిలే ఇలా జరుగుతుందని భావించాడు. బాగా ఆలోచించి మిర్చితోటలో దిష్టిబొమ్మలు పెట్టాలనుకున్నాడు. కానీ వాటి వల్ల ప్రయోజనం ఉండదని వినూత్నంగా ఆలోచించి, బాటసారుల చూపును తన తోటవైపు తిప్పుకున్నాడు.

 

2020 ఖరీఫ్ సీజన్‌లో చంద్రమౌళి ఎప్పటి మాదిరిగానే తనకున్న రెండెకరాల్లో మిర్చిపంట సాగు చేశాడు. యథావిధిగా ఏపుగా పెరిగిన తోట కాతకు వచ్చింది. వెంటనే రైతు చంద్రమౌళి తన ప్లాన్‌ను అమలు చేశాడు. మిరప చేనులో దిష్టిబొమ్మలకు బదులు టాలీవుడ్ హీరోయిన్స్ తమన్నా, కాజల్ నిలువెత్తు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాడు. హీరోయిన్స్ ఫొటోలు అందంగా, ఆకర్శణీయంగా ఉండడంతో బాటసారుల చూపంతా వాటిపైనే పడింది. తోటను, కాతను ఎవరు పట్టించుకోకపోవడంతో దిగుబడి అనుకున్న దానికంటే అధికంగా రావడంతో చంద్రమౌళి ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. తమన్నా, కాజల్ వల్ల తనకు నష్టాలు తప్పాయని మురిసిపోతున్నాడు. ఈ యేడు కూడా వారి ఫొటోలనే ఏర్పాటు చేసి నరదిష్టికి చెక్ పెడతానని పేర్కొంటున్నాడు. మూఢనమ్మకం ఎలా ఉన్నా ఆ రైతు నమ్మకం మాత్రం పంట పండించింది. ఆ రైతు ఆలోచనకు ప్రజలు ఫిదా అవుతున్నారు.