పెండింగ్ పనులు పూర్తి చేయండి.. తలసాని ఆదేశం

by  |
పెండింగ్ పనులు పూర్తి చేయండి.. తలసాని ఆదేశం
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: వేసవి ముగిసి వర్షాకాలం సీజన్ ప్రారంభం కానున్న నేపధ్యంలో పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తిచేసి ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా చూడాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మహానగర పాలక సంస్థ అధికారులను ఆదేశించారు. సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో సెంట్రల్ జోన్, నార్త్ జోన్ జోనల్ కమిషనర్ లు ప్రావిణ్య, శ్రీనివాస్ రెడ్డి, వాటర్ వర్క్స్ ఇతర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా మహామ్మారి, లాక్ డౌన్ కారణంగా పనులు మందగించాయని చెప్పారు. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొంటున్నందున ఆ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సనత్ నగర్ నియోజకవర్గంలో ఇంకా చేపట్టవలసిన అభివృద్ధి పనులను గుర్తించి సమగ్ర నివేదికను రూపొందించి అందజేయాలని అధికారులకు సూచించారు.

ఇప్పటికే నియోజకవర్గ పరిధిలో కోట్లాది రూపాయలను వ్యయం చేసి బల్కంపేట్ గ్రేవ్ యార్డ్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, వైట్ టాపింగ్ రోడ్ నిర్మాణం వంటి అనేక అభివృద్ధి పనులు పూర్తిచేసి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇంకా చేపట్టాల్సిన అభివృద్ధి, నిర్మాణ పనులను గుర్తించి ప్రతిపాదనలను తయారు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే నియోజకవర్గంకు మంజూరైన పనులలో కొన్ని పనులు చేపట్టడం జరిగిందని, మరికొన్ని పనులు పూర్తయ్యే దశలో ఉన్నాయని వివరించారు. పూర్తయిన అభివృద్ధి పనులను త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని అన్నారు. మంజూరై ఇంకా చేపట్టని అభివృద్ధి పనులు ఉంటే గుర్తించి ఆ పనులను కూడా వీలైనంత త్వరగా చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. బీకే గూడ పార్క్ సమీపంలో ఉన్న జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయం శిదిలావస్థలో ఉందని, ఆధునిక సౌకర్యాలతో నూతన భవనం నిర్మాణం కోసం రూ 4.50 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. ఇందుకు అనుగుణంగా భవనం డిజైన్ నమూనాను సిద్దం చేయాలని ఆదేశించారు. పార్క్ ల నిర్వహణ, స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందన్నారు. బన్సీలాల్ పేట డివిజన్ లోని గండమ్మ గుడి వద్ద డ్రైనేజి ఓవర్ ప్లో సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. త్వరలోనే నార్త్ జోన్, సెంట్రల్ జోన్ కార్యాలయాలలో ఆయా జోన్ ల పరిధిలో ఉన్న సమస్యలపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. సనత్ నగర్ లో నూతనంగా నిర్మించిన వాటర్ రిజర్వాయర్ కు పూర్తిస్థాయిలో నీటి సరఫరా జరగడం లేదని పిర్యాదులు వస్తున్నాయని, సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదికను తయారు చేసి అందజేయాలని వాటర్ వర్క్స్ జీఎం హరి శంకర్ ను , మేకలమండి లో నిరుపయోగంగా ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్ ను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలను చేపట్టాలని వాటర్ వర్క్స్ జీఎం రమణారెడ్డి నలను మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఆదేశించారు


Next Story

Most Viewed