జొమాటోను తట్టుకునేందుకు స్విగ్గీ మాస్టర్ ప్లాన్..

by  |
swiggi
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ఆహార సరఫరా సేవల సంస్థ స్విగ్గీ, మరో స్టార్టప్ కంపెనీ డన్జోను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. సుమారు రూ. 40 వేల కోట్ల నుంచి రూ. 80 వేల కోట్ల వరకు కంపెనీ విలువ రెట్టింపు మొత్తంతో కొనాలని స్విగ్గీ భావిస్తోంది. దీనికోసం పెట్టుబడిదారులతో ప్రత్యేక చర్చలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఇటీవల ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ విభాగంలో గణనీయమైన వృద్ధి నేపథ్యంలో ప్రత్యర్థి సంస్థ జొమాటోతో పోటీని ఎదుర్కొనేందుకు స్విగ్గీ తన కార్యకలాపాలను విస్తరించాలని నిర్ణయించింది. ఇటీవల ఈ సంస్థ 13 బిలియన్ డాలర్ల ఘనతను సాధించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో డెలివరీ సేవల స్టార్టప్‌ డన్జోను దక్కించుకునేందుకు ప్రాథమిక చర్చలు ప్రారంభించినట్టు, దీనికి సంబంధించి ఖచ్చితమైన ఒప్పందం ఇంకా జరగలేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇదే సమయంలో దీనిపై స్విగ్గీ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే, డన్జో వ్యవస్థాపకుడు కబీర్ బిశ్వాస్ ఈ అంశంపై మాట్లాడుతూ.. దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని, డన్జో వేగంగా వృద్ధి సాధిస్తోందని చెప్పారు. కాగా, ఇటీవల స్విగ్గీ వివిధ పెట్టుబడిదారుల నుంచి రూ. 9 వేల కోట్లకు పైగా నిధులను సేకరించింది. ఫుడ్ డెలివరీతో పాటు తక్షణ కిరాణా సరుకుల డెలివరీ సేవలను కూడా ప్రారంభించింది.

Next Story

Most Viewed