నిరసన రైతుల ప్రాథమిక హక్కు

by  |
నిరసన రైతుల ప్రాథమిక హక్కు
X

న్యూఢిల్లీ: శాంతియుత నిరసన రైతుల ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం, రైతుల మధ్య చర్చల్లో ప్రతిష్టంభన తొలగించడం కోసం స్వతంత్ర కమిటీ ఏర్పాటు ప్రతిపాదనను ముందుకు తీసుకువస్తూ నూతన వ్యవసాయ చట్టాల అమలును తాత్కాలికంగా పక్కన పెట్టాలను నరేంద్ర మోడీ సర్కార్‌కు సూచించింది. ఒకవేళ చట్టాల అమలును నిలిపివేస్తే రైతు సంఘాలు చర్చలకు రావని కేంద్ర ప్రభుత్వం బదులిచ్చింది. ఈ కేసును వెకేషన్ బెంచ్‌కు సిఫారసు చేస్తున్నట్లు దేశ అత్యున్నత న్యాయస్థానం తెలిపింది.

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో 23 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్న విషయం విదితమే. ఈ ఆందోళనలకు వ్యతిరేకంగా, అనుకూలంగా దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బొబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం రెండో రోజు విచారణ చేపట్టింది. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతు సంఘాలకు నోటీసులు జారీ చేస్తూ వెకేషన్ బెంచ్‌కు వెళ్లేందుకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది.

‘ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లనంత కాంత నిరసన రాజ్యంగబద్ధమే. కేంద్ర ప్రభుత్వం, రైతులు చర్చలు జరపాల్సి ఉంది. ఇరువైపు వాదనలు వినడం కోసం నిష్పాక్షిక, స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయడంపై ఆలోచిస్తున్నాం’ అని సీజేఐ జస్టిస్ ఎస్‌ఏ బొబ్డే తెలిపారు. ఈరోజు కొత్త వ్యవసా చట్టాల రాజ్యాంగబద్ధతను మేం నిర్ణయించడం లేదు. నిరసన తెలుపడం- స్వేచ్ఛగా వెళ్లడం అనే విషయమై విచారణ చేపడుతున్నామని తెలిపింది.

జాతీయ రహదారులను ఆందోళనకారులు దిగ్బంధించారని, సరిహద్దులు మూతపడ్డాయని పిటిషనర్ పేర్కొన్నాడు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కొవిడ్-19 రోగులతోపాటు అత్యవసర వైద్య సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ తరహా దేశ రాజధానిని దిగ్బంధించడం సరికాదని, రైతులు హింసను ప్రేరేపించాల వ్యవహరించకూడదని త్రిసభ్య ధర్మాసనంలోని జస్టిస్ ఏఎస్ బొపన్న, జస్టిస్ వీ రామసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.

నిరసన తెలుపడానికి రైతులకు హక్కు ఉంది. ఆ విషయంలో మేం జోక్యం చేసుకోదలుచుకోలేదు. కానీ, నిరసన తీరును పరిశీలిస్తాం. పౌరుల రాకపోకలను ప్రభావితం చేయని విధంగా దానిని కొద్దిగా మార్చడానికి మేం నిరసన విధానం ఏమిటి అని కేంద్రాన్ని అడుగుతాం’ అని బెంచ్ తెలిపింది.

కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ ఆందోళన చేస్తున్న రైతుల్లో ఒక్కరు కూడా మాస్క్ ధరించలేదని, వేల సంఖ్యలో ఒకే దగ్గర పోగయ్యారని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. మహమ్మారి దృష్ట్యా ఆందోళనకారులు గ్రామాలకు వెళ్లినప్పుడు కరోనా వ్యాపించే అవకాశం ఉందన్నారు.

ఇతరుల ప్రాథమిక హక్కులను రైతులు భంగం కలిగించలేరని తెలిపారు. ఈ విషయమై ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ ‘ఢిల్లీ సరిహద్దులను దిగ్బంధించడం వల్ల నగర ప్రజలు ఆకలితో అలమటించవచ్చు. మీ ఉద్దేశం రైతులతో మాట్లాడటం ద్వారా నెరవేరుతుంది. ప్రభుత్వం, రైతుల మధ్య చర్చలను సులభతరం చేయాలని మాత్రమే కోర్టు కోరుకుంటుంది’ అని తెలిపారు.

Next Story

Most Viewed