వారికి పరిహారం ఇవ్వాల్సిందే.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం

by  |
Supreme Court Fires On AP
X

న్యూఢిల్లీ: దేశ సర్వోన్నత న్యాయస్థానం కరోనాతో మృతి చెందినవారి కుటుంబాలకు బాసటగా నిలిచే ఆదేశాన్నిచ్చింది. ఆ కుటుంబాలకు పరిహారం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. ఎంత మొత్తం ఇవ్వాలని న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించలేదని వివరించింది. అది ప్రభుత్వ పరిధిలోని నిర్ణయమని పేర్కొంది. కానీ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్టు కింద పరిహారం తప్పనిసరి అని స్పష్టం చేసింది. అంతేకాదు, మరణ ధ్రువీకరణ పత్రాల జారీపైనా నెలకొన్న గందరగోళానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని ఆదేశించింది. ప్రత్యేకంగా కరోనాతో మరణించినట్టుగా ధ్రువీకరించేలా సర్టిఫికేట్‌లు జారీ చేయాలని, అందుకోసం ప్రత్యేకంగా మార్గదర్శకాలు రూపొందించాలని నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ(ఎన్‌డీఎంఏ)ను ఆదేశించింది.

ఇది వరకు స్పష్టత లేకుండా జారీచేసిన సర్టిఫికేట్లనూ సరిచేయడానికి సూచనలు అందులో పొందుపరచాలని తెలిపింది. ఈ మార్గదర్శకాలను ఆరు వారాల్లో రూపొందించాలని జస్టిస్ అశోక్ భూషణ్ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. పేద కుటుంబాలను కరోనా కుదిపేసిందని, కాబట్టి, కరోనాతో మరణించినవారి కుటుంబాలకు రూ. 4 లక్షల నష్టపరిహారాన్ని అందజేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. మరణ ధ్రువీకరణ పత్రాల్లో కరోనా వైరస్‌ను ప్రత్యేకంగా పేర్కొనే విధానం లేకపోవడంతో వివిధ రాష్టా్లు అందించే పరిహారానికీ బాధితులు నోచుకోవడం లేదని పిటిషన్ పేర్కొంది. కాబట్టి, డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడంలోనూ మార్పులను పిటిషన్ అభ్యర్థించింది.

కరోనా మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారాన్ని ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం గత విచారణలో సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ప్రకృతి వైపరిత్యాలకు మాత్రమే ఈ చట్టం కింద పరిహారం ఇవ్వడానికి వీలవుతుందని వివరించింది. ఒకవేళ కరోనా మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారం చొప్పున ఇస్తే డిజాస్టర్ ఫండ్‌ నిధులన్నీ కేవలం ఈ ఒక్క అంశానికే కేటాయించాల్సి వస్తుందని పేర్కొంది. మొత్తం పరిహారాన్ని లెక్కిస్తే అంతకన్నా ఎక్కువగా అయ్యే అవకాశముందని తెలిపింది. పరిహారాన్ని నిధులను ఖర్చు చేస్టే మహమ్మారిని ఎదుర్కొనే చర్యలు తీసుకోలేమని స్పష్టం చేసింది. అయితే, ఇప్పటికే కరోనా ప్రభావాన్ని పూడ్చడానికి పలు పథకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తు్న్నాయని వివరించింది. దేశంలో కరోనా మరణాలు మొత్తం 3.98 లక్షలకు అంటే నాలుగు లక్షలకు చేరువవ్వడం గమనార్హం.

పరిహారం ప్రభుత్వ బాధ్యత..

డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్‌లో పరిహారం తప్పనిసరి అని పేర్కొని ఉన్నదని, కానీ, స్వల్పమొత్తంలోనైనా పరిహారాన్ని ప్రకటించకపోవడం నేషనల్ అథారిటీ వైఫల్యాన్ని చూపిస్తున్నదని సుప్రీంకోర్టు సీరియస్ అయింది. అయితే, పిటిషన్ ప్రకారం, బాధిత కుటుంబాలకు రూ. 4 లక్షలు చెల్లించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించలేదని వివరించింది. ప్రభుత్వమే దాని ప్రాధమ్యాలను నిర్ణయించుకోవాలని తెలిపింది. ఎందుకంటే వైద్యారోగ్యం, ఆహారం, ఆవాసాలతోపాటు ఆర్థిక స్థితినీ గాడిలో ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని వివరించింది. పరిహారం ఆర్థిక చిక్కులతో కూడి ఉండవచ్చునని, కానీ, ఏ దేశానికి, రాష్ట్రాలనికి అనంతమైన ఆర్థిక వనరులు ఉండవని పేర్కొంది. కాబట్టి, పరిహారం ఎంత చెల్లించాలనేది ప్రభుత్వమే నిర్ణయించుకోవాలని వివరించింది.



Next Story

Most Viewed