ఆంధ్ర నుండి అక్రమంగా ధాన్యం రాకుండా పటిష్ఠ చర్యలు.. టి. వినయ్ కృష్ణా రెడ్డి

by  |
Vinay Krishna Reddy
X

దిశ, కోదాడ: ఆంధ్ర నుండి అక్రమంగా ధాన్యం రాకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కోదాడ రామాపురం క్రాస్ రోడ్ వద్ద ధాన్యం అక్రమ రవాణా నివారణకు రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ మరియు మార్కెటింగ్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్‌ను యస్.పి. రాజేంద్ర ప్రసాద్ తో కలసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రాంతం నుండి అక్రమంగా తెలంగాణలో‌కి ధాన్యం రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని చెక్ పోస్ట్ సిబ్బందిని ఆదేశించారు.

ముఖ్యంగా తెలంగాణలో ధాన్యానికి ప్రభుత్వ మద్దతు ధర ఎక్కువగా ఉన్నందున ఆంధ్ర రాష్ట్రం నుండి ధాన్యం సరఫరా నివారణకు గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం లోడ్ తో వస్తున్న ట్రాక్టర్‌ను పరిశీలించి వే బిల్లు ఇచ్చిన సిబ్బంది‌పై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆంధ్ర ప్రాంతం రైతులు గ్రామం పేరు మార్చి, తప్పుడు వే బిల్లు‌ను నమోదు చేసి తెలంగాణలో అమ్మే ప్రయత్నం చేయరాదని సూచించారు. అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్ నందు తనిఖీలు క్షుణ్ణంగా చేయాలని ఆంధ్ర నుండి ధాన్యం‌తో వస్తున్న వాహనాలను పరిశీలించి వెనక్కు పంపాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్.డి.ఓ కిషోర్ కుమార్, డి.యస్.పి. రఘు, తహశీల్ధార్ శ్రీనివాసశర్మ, సి.ఐ శివరామ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed