పాలమూరు జలగోస.. పాలకులకేదీ ధ్యాస?

by  |
పాలమూరు జలగోస.. పాలకులకేదీ ధ్యాస?
X

దిశ, మహబూబ్‌నగర్: మాటలు పూదోటలయ్యాయి.. వాటి పరిమళం మాత్రం అంతగా లేదు. తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు పడిన వలసల జిల్లా అనే పేరును రూపుమాపుతామని, అందుకోసం వ్యవసాయాధారిత జిల్లా అయిన పాలమూరులో రైతులకు సాగునీటి కష్టాలు లేకుండా చేస్తామని పాలకులు తరచూ చెబుతూనే ఉన్నారు. కాని పలు ప్రాజెక్టుల ఆధునీకరణ పనులు నేటికీ పూర్తికాలేదు.

జిల్లావాసుల చిరకాల కోరిక అయిన కల్వకుర్తి, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంతోపాటు భీమా, సంగంబండ రిజర్వాయర్, కోయిల్‌సాగర్, ఆర్డీఎస్, జూరాల ఆధునీకరణ పనులు నేటికీ పూర్తి కాలేదు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలోని సుమారు సుమారు 12.3 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్‌కు తాగునీరు అందించే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సైతం ముందుకు సాగడం లేదు. పాలమూరు ఎత్తిపోతల పథకం రూ.30 వేల కోట్ల అంచనాలతో ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు అంచనాలు ప్రస్తుతం రూ.52 వేల కోట్లకు చేరుకుంది. గతంలో ప్రారంభించిన ప్రాజెక్టులకు కావాల్సిన నిధుల కేటాయింపులు లేకపోవడంతో ఇంకా భూసేకరణ పనులు కూడా పూర్తి కాలేదు. గత ఏడు బడ్జెట్లలోనూ నిధులను అరకొరగా కేటాయించడం, కేటాయించిన నిధులను కూడా ఖర్చు చేయలేకపోవడం వల్ల ఈ ప్రాజెక్టుల పనులపై నీలినీడలు కమ్ముకున్నాయి.

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కింద పనులు చేసిన గుత్తేదారులకు ప్రభుత్వం రూ.1,857 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి వుంది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం ప్రభుత్వం కేవలం రూ.368.58 కోట్లను కేటాయించడం వల్ల పనులు జరగడం అనుమానంగానే కనిపిస్తోంది.
శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి మనకు 40 టీఎంసీల నీరు వినియోగించుకునే వాటా వున్నప్పటికీ నేటికీ ఆ లక్ష్యాన్ని మాత్రం అందుకోలేకపోతున్నాం. జిల్లాలో సుమారు 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు జూరాల సామర్థ్యం పెంచాలనే లక్ష్యంతో ముందుకు సాగింది. రాష్ట్ర విభజన తరువాత ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం సాగునీటి లక్ష్యాన్ని 10 లక్షల ఎకరాలకు పెంచింది. అవసరమైతే తానే స్వయంగా కుర్చీ వేసుకుని కూర్చోని పనులు చేయిస్తానని మాట ఇచ్చారు. కానీ పనులు నేటికీ పూర్తి కాలేదు.

కల్వకుర్తి దుస్థితి..

కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించి 15 ఏండ్లు గడుస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు పనులను అత్యంత వేగంగా కొనసాగిస్తున్న ప్రభుత్వం చివరి దశలో వున్న కల్వకుర్తి పనులను మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం చేయడంపై స్థానికులు పెదవి విరుస్తున్నారు. పథకం కింద మొత్తం 20.24టీఎంసీల నీటిని నిల్వసామర్థ్యంతో మొత్తం 48 రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం రూపకల్పన చేసింది. దాని కోసం మొత్తం 10,182 ఎకరాల భూమి అవసరం అవుతుందని, ఈ నేపథ్యంలో భూసేకరణలో భాగంగా పరిహారం కింద కాలువల నిర్మాణం కోసం మొత్తం రూ.4,179కోట్ల మేరకు ఖర్చు అవుతుందని అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి అధికారులు నివేదించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కింద రిజర్వాయర్ల నిర్మాణం, షటర్ల పనులు, స్టక్చర్, అక్విడక్ట్ పనులు కొనసాగుతున్నాయి. అదే సమయంలో ఈ ప్రాజెక్టు కింద భూసేకరణకు సంబంధించి రూ.24.18 కోట్ల బిల్లులు, ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించి రూ.79.32 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.

భీమా, నెట్టంపాడు సైతం..

భీమా, నెట్టంపాడు ప్రాజెక్టుల పనులు సైతం మిగితా వాటి మాదిరిగానే ఉన్నాయి. వాటి బిల్లలు చెల్లించడకపోవడంతో చాలా చోట్ల గుత్తేదారులు పనులను పూర్తిగా నిలిపివేశారు. ఈ రెండు ప్రాజెక్టులలో సంగంబండకు రూ.36 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉండగా దీనికి రూ.3.69 కోట్లు, నెట్టెంపాడు కింద రూ.22.28 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉండగా రూ.16.70 కోట్ల నిధులను మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారు.

జూరాల మరీ దారుణం..

పాలమూరు జిల్లా వరప్రదాయనిగా పేరొందిన జూరాల ప్రాజెక్టు పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే పలు క్రస్ట్ గేట్లు దెబ్బతినడంతో నీరు లీకేజీ అవుతుంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 11 టీఎంసీలు వుండగా ప్రస్తుతం కేవలం 6 టీఎంసీల నీటీని మాత్రమే నిల్వ వుంచే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వరదల కారణంగా ప్రాజెక్టులో పేరుకుపోయిన సిల్ట్ వల్ల ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ ఉంచలేని పరిస్థితి.

ప్రశ్నార్థకంలో ఎస్ఎల్‌బీసీ

మహబూబ్ నగర్ జిల్లాలోని అచ్చంపేట ప్రాంతంతో పాటు నల్లగొండ జిల్లాలో పలు ప్రాంతాలకు సాగునీటిని అందించి నల్లగొండలో వున్న ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు తాగునీటి వసతి కల్పించాలన్న ఉద్దేశంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీ పథకాన్ని ప్రారంభించింది. శ్రీశైలం నుంచి అచ్చంపేట వరకు సుమారు 43 కిలో మీటర్ల మేర సొరంగం మార్గాన నీటి తరలింపును అప్పటి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చందంపేట- అచ్చంపేట మధ్యలో 7.35 టీఎంసీల నీటి సామర్థ్యంతో నక్కలబండ రిజర్వాయర్‌ను కూడా నిర్మించేందుకు రూ.430 కోట్లతో పనులను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ నక్కలబండ రిజర్వాయర్ పనులు పూర్తి కావడానికి ఇంకా రూ.126 కోట్లు అవసరం ఉంది. కానీ, ప్రస్తుత ప్రభుత్వం కేవలం రూ.3.16 కోట్లనే కేటాయించింది. ఎస్ఎల్‌బీసీ పనులు ఇంకా 10 కిలోమీటర్ల మేర చేయాల్సి ఉంది.

Tags : palamuru lift irrigation project, Palamur Project, telangana news


Next Story

Most Viewed