ప్రారంభమైన పాఠశాలలు.. మొదలుకాని తరగతులు

by  |
Started schools
X

దిశ, తెలంగాణ బ్యూరో: పాఠశాలు ప్రారంభమైనప్పటికీ తొలిరోజు ఆన్‌లైన్ తరగతులకు విద్యార్థులు హాజరుకాలేక పోయారు. ఆన్‌లైన్ తరగతులకు సంబంధించిన షెడ్యూల్‌ను ముందస్తు‌గా విద్యార్థులకు తెలుపకపోవడంతో హాజరుకాలేకపోయారు. తొలిరోజు దూరదర్శన్, టీ సాట్ చానెళ్ల ద్వారా బ్రిడ్జి కోర్స్ పాఠాలను భోధించారు. విద్యార్థులతో ఫోన్ ద్వారా ఇంటరాక్షన్ అయిన ఉపాధ్యాయులు విద్యార్థుల వివరాలను సేకరించి రికార్డులలో పేర్లు నమోదు చేశారు.

విద్యాసంస్థల ప్రారంభం విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న స్పష్టతలేని నిర్ణయాలు ఉపాధ్యాయులను, విద్యార్థులను, తల్లిదండ్రులకు అయోమయానికి గురిచేస్తున్నాయి. జులై 1 నుంచి ఆన్ లైన్ ద్వారా తరగతులను ప్రారంభిస్తామని చెప్పిన ప్రభుత్వం తరగతుల షెడ్యూల్‌ను మాత్రం ముందస్తుగా విడుదల చేసి విద్యార్థులకు అందించలేదు. ఏ సమయానికి ఏ తరగుతుల వారికి క్లాసులు నిర్వహిస్తారనే సమాచారాన్ని ప్రకటించలేదు. దీంతో ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించినప్పటికి విద్యార్థులు హాజరుకాలేకపోయారు.

తొలిరోజు బ్రిడ్జికోర్స్ తరగతులు

దూరదర్శన్, టీ సాట్ చానెళ్లు ద్వారా మొదటి రోజు బ్రిడ్జి కోర్సు పాఠాలను బోధించారు. విద్యార్థులు ఎలాంటి పరీక్షలు లేకుండా పై తరగతులకు ప్రమోట్ చేయడం, దాదాపుగా ఏడాదిన్నరగా పాఠ్యాంశాలపై నైపుణ్యాలను కోల్పోవడం ద్వారా గతేడాది తరగతుల సబ్జెక్ట్‌లను విద్యార్థులకు రివిజన్ చేసేందుకు బ్రిడ్జి కోర్సు తరగతులను నిర్వహించారు. 10 రోజుల పాటు బ్రిడ్జికోర్సులు నిర్వహించిన అనంతరం నూతన అకాడమిక్ ఇయర్ తరగతులను ప్రారంభించనున్నారు.

విద్యార్థుల వివరాలు సేకరణ

ఆన్‌లైన్ తరగతులను ప్రారంభించిన తొలిరోజు ఉపాధ్యాయులు విద్యార్థుల సంబంధించిన వివరాల నమోదు ప్రక్రియను చేపట్టారు. పై తరగతులకు చేరుకున్న విద్యార్థుల పేర్లను రిజిస్టర్‌లో నమోదు చేశారు. ఫోన్ ద్వారా విద్యార్థులను సంప్రదించి ఈ ప్రక్రియ చేపట్టారు. జూన్ 25 నుంచి పాఠశాలకు హాజరవుతున్న ఉపాధ్యాయులు ముందస్తుగానే విద్యార్థుల వివరాలు సేకరించాల్సింది. కానీ ఉన్నతాధికారుల నుంచి సరైన ఆదేశాలు రాకోపోవడంతో తరగతుల ప్రారంభం రోజు వివరాలు చేపట్టాల్సి వచ్చింది.



Next Story

Most Viewed