కొత్త వేరియంట్ ముప్పు తప్పదు.. డీహెచ్ శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు

by  |
dh-srinivasa-rao -1
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా నిబంధనలను సమర్ధవంతంగా పాటించకపోతే కొత్త వేరియంట్లు వచ్చే ప్రమాదం ఉన్నదని ఆరోగ్యశాఖ హెచ్చరిస్తున్నది. డెల్టా తగ్గినా, ప్రజల్లో పెరిగిన నిర్లక్ష్యం కారణంతో కొత్త వేరియంట్ వస్తే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని ఆఫీసర్లు వివరిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటివి జరిగితే తట్టుకోవడం కష్టమంటున్నారు.

దీంతో, ఇప్పటికే ఇంటర్నేషనల్ ప్రయాణాలపై కూడా దృష్టి సారించినట్లు స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఫోకస్ పెట్టినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. రష్యా, యూకేలో కేసులు పెరుగుతున్నందున కరోనా లక్షణాలున్న వాళ్లను వెంటనే క్వారంటైన్​అవ్వాలని సూచిస్తున్నామన్నారు. వైరస్ నుంచి రక్షణ పొందేందుకు మాస్కు, భౌతిక దూరం పాటించడంతో పాటు అర్హులైన ప్రతీ వ్యక్తి కూడా టీకాను పొందాలని ఆరోగ్యశాఖ కోరుతున్నది.

2 డోసులతోనే 100 శాతం రక్షణ..

టీకా రెండు డోసులు తీసుకుంటేనే 100 శాతం రక్షణ లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు అసలు టీకా తీసుకొని వారిలో 60 శాతం మంది వైరస్ బారినపడినట్టు వైద్యశాఖ గుర్తించింది. దీంతో పాటు సింగిల్ డోసు తీసుకున్న వాళ్లలో 30 శాతం మంది పాజిటివ్‌కు గురికాగా, రెండు డోసులు తీసుకున్న వాళ్లలో కేవలం 10 శాతం మందికి మాత్రమే వైరస్​సోకిందని తెలిపారు. అయితే, రెండు డోసులు పొందిన వారిలో ఎవరు కూడా హాస్పిటలైజేషన్, మృతిచెందలేదని అన్నారు.

తొలి డోసుతో భరోసా వద్దు..

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు వ్యాక్సిన్ అర్హుల్లో 75 శాతం మంది ఫస్డ్ డోసును పూర్తి చేసుకున్నారు. వీరిలో 39 శాతం మంది సెకండ్​డోసునూ పూర్తి చేసుకున్నారు. అయితే, చాలా మంది కరోనా తగ్గిందనే నిర్లక్ష్యంతో రెండో డోసుకు దూరంగా ఉంటున్నారు. మరి కొందరు ఒక డోసు సరిపోతుందిలే అనే భ్రమలో ఉంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదని ఆరోగ్యశాఖ సూచిస్తున్నది. ఒక్క డోసు తీసుకున్న వారిలో సరైన యంటీబాడీలు ఉత్పత్తి కావడం లేదని తమ పరిశీలనలో తేలినట్లు వివరించింది. అంతేగాక ఉన్న యాంటీబాడీలు ఎంత కాలం ఉంటాయో కూడా స్పష్టత లేకపోవడం గమనార్హం. ఈ క్రమంలో సదరు వ్యక్తులకు వైరస్ నుంచి రక్షణ కరువవుతున్నట్లు పేర్కొన్నది. దీంతో కచ్చితంగా రెండో డోసును తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

చిన్నారులకు వ్యాక్సినేషన్..

రెండు, మూడు వారాల్లో చిన్నారులకు కూడా వాక్సినేషన్‌ను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు డీహెచ్ తెలిపారు. ఈ అంశంపై ఆయన ఆరోగ్యశాఖ కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం కేంద్రం నుంచి మార్గదర్శకాలు రావాల్సి ఉందన్నారు. అయితే 2 నుంచి 18 ఏండ్ల వారికి వేసే జైడస్ వ్యాక్సిన్‌కు కేంద్రం ఇప్పటికే అనుమతినిచ్చిందన్నారు. త్వరలో భారత్ బయోటెక్ కొవాగ్జిన్‌కు సైతం అనుమతులు వచ్చే అవకాశముందన్నారు. ఆ పర్మిషన్లు వస్తే రాష్ట్రంలో కోటి మంది పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుందని డీహెచ్ పేర్కొన్నారు.

బూస్టర్ డోస్‌కి సంబంధించి భారత్‌లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. భవిష్యత్‌లో బూస్టర్ డోస్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఇక తాను మాస్కు వేసుకోకుండా డ్యాన్స్ చేసిన ఘటనపై డీహెచ్ స్పందించారు. ప్రజల్లో చర్చ జరగాలనే తాను మాస్క్ పెట్టుకోలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒత్తిడిలో ఉన్న ఉద్యోగులకు రిలీఫ్​ఇవ్వాలనే ఉద్దేశంతోనే డ్యాన్స్ చేశానన్నారు. కొవిడ్ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న సమయంలో అందరూ మాస్క్‌ పెట్టుకున్నారని, అయితే ఇప్పుడు 20 శాతం మంది కూడా పెట్టుకోవడంలేదన్నారు.

మాస్క్ పెట్టుకోకపోతే కరోనాను కంట్రోల్ చేయడం కష్టమని ఆయన తెలిపారు. మాస్క్ మీద చర్చ జరగాలనే ఉద్దేశ్యపూర్వకంగానే రెండు సార్లు మాస్క్ పెట్టుకోలేదన్నారు. మాస్క్ వేసుకోకుంటే జరిగే ప్రమాదాన్ని ప్రజలకు తెలియజేసేందుకే ఇలా చేశానన్నారు. అప్పుడే ప్రజల్లో అవగాహన పెరిగి జాగ్రత్తలు పాటిస్తారని ఆయన చెప్పడం గమనార్హం.

డోసులు ఉన్నా.. ముందుకు రావడం లేదు.. డీహెచ్ శ్రీనివాసరావు

రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సిన్ డోసులు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. కోల్డ్ స్టోరేజ్‌లలో 50 లక్షల డోసులు స్టాక్​ఉన్నాయి. కానీ, టీకా పొందేందుకు ప్రజలు ముందుకు రాకపోవడం బాధకరం. ప్రతీ వ్యక్తి రెండు డోసులను తప్పనిసరిగా తీసుకోవాలి. లేదంటే ప్రమాదం వాటిల్లుతుంది. ఇప్పటికే 9 వేల వ్యాక్సినేటర్లతో ప్రతీ రోజు కేవలం 2.50 నుంచి 3 లక్షల మందికి మాత్రమే టీకాను ఇస్తున్నాం. దీన్ని పెంచేందుకు తాము సిద్ధంగా ఉన్నా, ప్రజల నుంచి స్పందన రావడం లేదు.

మరి కొందరు కరోనా వస్తే యాంటీబాడీస్​వస్తాయి కదా.? అనే విచిత్రమైన ఆలోచనలో ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. కరోనా నియంత్రణకు వ్యాక్సిన్లు శ్రేయస్కరం. మన రాష్ర్టాన్ని అవే కాపాడాయి. సెకండ్ డోసు గడువు ముగిసిన వాళ్లు వెంటనే డోసులు పొందాలి. స్పెషల్ వ్యాక్సినేషన్ ద్వారా అర్బన్, రూరల్‌లో ప్రతీ వార్డులోని ఇళ్లకు టీకా అందిస్తున్నాం. అయితే, ప్రభుత్వం తీసుకున్న చర్యలతో వైరస్​ ఔట్ బ్రేక్స్(సామూహిక వ్యాప్తి) జరగలేదు.



Next Story

Most Viewed