విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న ‘శ్రీచైతన్య’.. మరీ ఇంత దారుణమా..!

by  |
విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న ‘శ్రీచైతన్య’.. మరీ ఇంత దారుణమా..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : మీ పిల్లలకు అత్యుత్తమ ర్యాంకులు వచ్చేలా ఉత్తమ విద్య అందిస్తామని ఊదరగొట్టే శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థల్లో విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట పది మందికి వచ్చిన ర్యాంకులనే పదేపదే ప్రచారం చేస్తూ రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ కనీస నిబంధనలు పాటించడం లేదు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లలో ఎక్కడా నిబంధనలు అమలు చేయకుండా యథేచ్చగా నడిపిస్తుండటం విశేషం.

రాష్ట్ర రాజధానితో సహా అన్ని జిల్లాల్లో ఉన్న శ్రీచైతన్యకు స్కూల్స్, కాలేజీలు, హాస్టళ్లు ఉన్నాయి. అయితే ఒక ప్రైవేట్ కాలేజీకి ఉండాల్సిన కనీస అర్హతలేవీ లేకున్నా ప్రభుత్వం అలాంటి కళాశాలలకు అనుమతినిస్తుండటం గమనార్హం. శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో వెలుతురు సరిగా లేని గదుల్లో విద్యార్థులను కుక్కుతూ ప్రమాదాల మధ్య వారి జీవితాలను పణంగా పెడుతున్నాయి. అధిక ఫీజులను వసూలు చేస్తూ కనీస సౌకర్యాలు కల్పించకుండా ‘శ్రీచైతన్య’ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందని తల్లిదండ్రులు, విద్యార్థుల సంఘాలు విమర్శిస్తున్నాయి.

వెలుతురు లేని గదులు… ఆటస్థలం అసలే లేదు

సాధారణ ప్రభుత్వ స్కూళ్లలో కనిపించే ఆటస్థలం కూడా శ్రీచైతన్య స్కూళ్లలో, కాలేజీల్లో కనిపించదు. పిల్లలకు పాఠాలతో పాటు క్రీడలు, మానసికోల్లాసం కోసం సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయాలని పలు నివేదికలు చెబుతున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదు. నిబంధనల ప్రకారం ఒక కాలేజీకి ఎకరం స్థలం తగ్గకుండా ఉండాలి. అందులో పాఠశాల/ కాలేజీ భవనం నిర్మించాలి. భవనానికి అనుబంధంగా ఆట స్థలం ఉండాలి. నగరంలో శ్రీచైతన్యకు 73 స్కూల్ బ్రాంచిలుండగా.. రాష్ట్రంలో 79 బ్రాంచిలున్నాయి. సుమారు వంద వరకూ జూనియర్ కాలేజీలు నగరంలో ఉన్నాయి. వీటిల్లో ఒక్కచోట కూడా కాలేజీకి ఎకరం స్థలం విస్తీర్ణం లేదు. ప్రైవేట్, రెసిడెన్సియల్ భవనాలను అద్దెకు తీసుకుని స్కూళ్లు, కాలేజీలు నిర్వహిస్తున్నారు.

వీటికి అదనంగా ఆటస్థలాలు లేవు. నాలుగైదు అంతస్తుల్లో ఉండే స్కూళ్లు, కాలేజీలకు విధిగా లిఫ్ట్ సౌకర్యం ఉండాలి. కానీ సిటీలోని ఏ బ్రాంచిలోనూ ఈ సౌకర్యం ఉండదు. ఐదంతస్తులు పూర్తిగా మెట్లు ఎక్కుతూ, దిగుతూ విద్యార్థులు పాఠాలు నేర్చుకోవాల్సిందే.. రామంతాపూర్, హిమాయత్ నగర్ కూకట్‌పల్లి శాఖల్లోని స్కూల్స్, కాలేజీ భవనాల్లో కనీసం సరైన గాలి, వెలుతురు ప్రవేశించేలా ఉండదు. చీకటి గదుల్లో ఫోకస్ లైట్ల మధ్య గంటల కొద్దీ విద్యార్థుల చదువుతుండడంతో కంటిచూపుపై ప్రభావం పడుతోంది. ట్యూబ్‌లైట్ల వెలుగు కారణంగా కంటి నరాలు దెబ్బతిని సమయానికి నిద్రపట్టకపోవడం, నార్మల్ వ్యూమన్ బయాలజికల్ క్లాక్ వ్యవస్థ విద్యార్థుల్లో పూర్తిగా పనిచేయకుండాపోతుంది. కాలేజీలు, హాస్టల్ గదుల్లోనూ అదే పరిస్థితి.

నారాయణగూడ ఫ్లైఓవర్ పరిసరాల్లో ఉన్న శ్రీ చైతన్య కాలేజీ ప్రధాన రోడ్డు పక్కన ఓ బిల్డింగ్ లో కాలేజీ, హాస్టల్ ఉంది. రహదారిపై 24 గంటలు వాహనాలు తిరుగుతుంటాయి. దీంతో దుమ్ము, దూళి హాస్టల్ గదుల్లో చేరితోంది. భవనంలో కిటీకీలు, తలుపులు ఎప్పుడూ మూసే ఉండటం వల్ల సూర్యరశ్మి, వెలుతురు, స్వచ్ఛమైన గాలి విద్యార్థులకు అందకుండాపోతోంది. దీంతో గదుల్లో వాతావరణం వేడెక్కి విద్యార్థులకు అనేక రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇక అగ్ని ప్రమాద నివారణ చర్యలు నిబంధనల ప్రకారం గదుల్లో ప్రత్యేకంగా ఫైర్‌ సేఫ్టీ యూనిట్లు ఉండాలి.

భవనం చుట్టూ ఖాళీ స్థలం వదలాలి. వికలాంగ విద్యార్థులకు అన్ని అంతస్తుల్లోకి చేరేవిధంగా ర్యాంప్‌లు, ప్రమాదాలు జరిగినపుడు తప్పించుకునేందుకు ఫైర్ ఎగ్జిస్ట్ రూట్ సపరేట్‌గా ఉండాలి. అగ్నిప్రమాద నివారణ కోసం అన్ని అంతస్తులకు సరిపోయేంత వాటర్ పైప్‌లైన్ కూడా ఏర్పాటు చేయాలి. ఈ కాలేజీల్లో ఇవి ఎక్కడా కనిపించవు. ఎల్బీ నగర్, చైతన్యపురి బ్రాంచిలు ఇందుకు ఉదాహరణగా ఉన్నాయి. రెండు రోజుల క్రితమే ఎల్‌బీ నగర్‌ శ్రీచైతన్య గర్ల్స్ క్యాంపస్‌లో విద్యుత్ ప్రమాదం కూడా చోటు చేసుకుంది. టాయిలెట్ల విషయానికొస్తే… బాలికలు, బాలురకు ప్రత్యేకంగా సరిపోయే సంఖ్యలో ఉండాలి. భవనంలోని ప్రతీ అంతస్తులో ఉండాలి. కానీ శ్రీ చైతన్య స్కూల్స్, కాలేజీల్లో ఏదో ఒక అంతస్తులో టాయిలెట్స్ ఉంటాయి. మిగిలిన అంతస్తుల్లోని విద్యార్థులు అక్కడికే రావాల్సి ఉంటుంది.

ప్రాక్టికల్స్ ప్రసక్తే లేదు..

ఇంటర్మీడియట్ కాలేజీల్లో సైన్స్ స్టూడెంట్లకు ఉండే ప్రాక్టికల్ పరీక్షలు శ్రీచైతన్య కాలేజీల్లో కనిపించవు. బైపీసీ, ఎంపీసీ విద్యార్థులకు ఉండే సబ్జెక్టు ల్యాబ్‌లు, ప్రయోగాలు చేయించే ప్రక్రియ ఏదీ ఉండదు. ర్యాంకుల కోసం పూర్తిగా పాఠ్యపుస్తకాలను బట్టి పట్టిస్తారు. కాలేజీ ఇన్స్‌ఫెక్షన్ కు వచ్చిన పరిశీలకులకు విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసి ముట్టజెప్తారు. బెస్ట్ స్కోరింగ్ ఉన్న విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించేలా వారిని 24 గంటలూ తమ పరిధిలోనే యాజమాన్యం ఉంచుకుంటుంది. వారిని పూర్తిగా చదువుకునే మర మనుషులుగా మార్చివేస్తారన్నది విద్యావేత్తల ప్రధాన ఆరోపణ. ఇందుకు సంబంధించిన ఉమ్మడి రాష్ట్రంలో నీరదా రెడ్డి కమిటీ అధ్యయనం చేసి ఒక రిపోర్టును కూడా ఇచ్చింది. కార్పొరేట్ స్కూళ్లలోని ఈ వ్యవస్థను ‘కాన్సంట్రేషన్ క్యాంపుల్లో ‘హైజాక్‌డ్ స్టూడెంట్లు’గా ఆ కమిటీ పేర్కొంది. అయినా కూడా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.



Next Story

Most Viewed