కోహ్లీ గురించి నన్ను అడగొద్దు.. విరాట్‌పై రాహుల్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు

by Dishanational3 |
కోహ్లీ గురించి నన్ను అడగొద్దు.. విరాట్‌పై రాహుల్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేసింది. హైదరాబాద్ టెస్టులో అనూహ్యంగా ఓటమిపాలైన భారత్.. వైజాగ్ టెస్టులో భారీ విజయం సాధించి పుంజుకుంది. అయితే, ఈ రెండు టెస్టులకు వ్యక్తిగత కారణాలతో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ కేవలం తొలి రెండు టెస్టులకు మాత్రమే జట్టును ప్రకటించింది. మిగతా సిరీస్‌కు జట్టు ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మిగతా సిరీస్‌కైనా అతను అందుబాటులో ఉండటాడా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

తాజాగా టీమ్ ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ దీనిపై స్పందించాడు. రెండో టెస్టు అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ద్రవిడ్ కూడా కోహ్లీ రాకపై సస్పెన్స్ కొనసాగించాడు.‘దాని గురించి సెలెక్టర్లను అడగడం ఉత్తమం. త్వరలో వారు జట్టును ప్రకటించనున్నారు. కాబట్టి, కోహ్లీ గురించి వారే చెప్పే స్థితిలో ఉన్నారు.’ అని ద్రవిడ్ తెలిపాడు. అయితే, కోహ్లీ రాక గురించి ద్రవిడ్ ఓ అప్‌డేట్ అయితే ఇచ్చాడు. అతనితో మాట్లాడుతున్నామని చెప్పాడు. ‘విరాట్ ఇంకా మూడో టెస్టుకు అందుబాటులో ఉండనని చెప్పలేదు. అతను కేవలం రెండు టెస్టుల గురించే మాకు తెలియజేశాడు. అతను ఏం చెప్పలేదంటే సెలక్షన్‌కు అందుబాటులో ఉండొచ్చు. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుంది.’ అని చెప్పుకొచ్చాడు.

కోహ్లీ గైర్హాజరుతో టీమ్ ఇండియా మిడిలార్డర్ బలహీనంగా మారింది. తొలి టెస్టులో ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది. దానికితోడు కేఎల్ రాహుల్ కూడా గాయపడటంతో రెండో టెస్టులో టీమ్ ఇండియా బ్యాటింగ్ దళంపై అనుమానాలు తలెత్తాయి. అయితే, జైశ్వాల్ డబుల్ సెంచరీకితోడు శుభ్‌మన్ గిల్ ఫామ్ అందుకుని సెంచరీ చేయడంతో భారత్ గట్టెక్కిందనే చెప్పాలి. ఈ నెల 15 నుంచి 18 వరకు రాజ్‌కోట్ వేదికగా మూడో టెస్టు జరగనుంది.

Next Story

Most Viewed