పారిస్ ఒలింపిక్స్‌కు విజయ్‌వీర్‌ క్వాలిఫై

by Dishanational3 |
పారిస్ ఒలింపిక్స్‌కు విజయ్‌వీర్‌ క్వాలిఫై
X

దిశ, స్పోర్ట్స్ : భారత షూటర్ విజయ్ వీర్ సిద్దు పారిస్ ఒలింపిక్స్‌ బెర్త్ సాధించాడు. ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరుగుతున్న ఏషియన్ చాంపియన్‌షిప్‌లో 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టోల్ వ్యక్తిగత ఈవెంట్‌లో విజయ్ వీర్ రజతం సాధించి ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. శనివారం జరిగిన ఈ ఈవెంట్‌లో ముందుగా క్వాలిఫికేషన్ రౌండ్‌లో విజయ్‌వీర్ 577 స్కోరుతో 5వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరుకున్నాడు. ఫైనల్‌లో 28 స్కోరుతో రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు. అంతేకాకుండా, భారత్‌కు 17వ ఒలింపిక్ బెర్త్‌ను సాధించి పెట్టాడు. పారిస్ ఒలింపిక్స్‌కు ఏషియన్ చాంపియన్‌షిప్ అర్హత టోర్నీగా ఉన్నది. వ్యక్తిగత విభాగాల్లో టాప్-2లో నిలిచిన షూటర్లు ఒలింపిక్స్ బెర్త్‌ సాధించొచ్చు. ఈ టోర్నీలో తెలుగమ్మాయి ఇషా సింగ్, రిథమ్ సాంగ్వాన్‌, వరుణ్ తోమర్ ఇప్పటికే ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్‌లో భారత్‌కు మూడు పతకాలు దక్కాయి. టీమ్ కేటగిరీలో ఆషి చౌక్సే(588), అంజుమ్ మౌడ్గిల్(586), సిఫ్ట్ కౌర్(586)‌లతో కూడిన భారత త్రయం 1,760 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకం సాధించింది. అలాగే, వ్యక్తిగత కేటగిరీలో సిఫ్ట్ కౌర్ (460.6 స్కోరు), ఆషి చౌక్సే(447.0 స్కోరు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచి రజతం, కాంస్యం సొంతం చేసుకున్నారు. గతేడాది వరల్డ్ చాంపియన్‌షిప్‌లోనే సిఫ్ట్ కౌర్ పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. మొత్తంగా ఈ టోర్నీలో భారత్ 30 పతకాలతో మెడల్ స్టాండింగ్స్‌లో టాప్ పొజిషన్‌లో ఉన్నది. చైనా(16), కొరియా(14) రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.

Next Story

Most Viewed