ఢిల్లీని చితక్కొట్టారు.. విశాఖలో కోల్‌కతా సరికొత్త రికార్డులు

by Dishanational5 |
ఢిల్లీని చితక్కొట్టారు.. విశాఖలో కోల్‌కతా సరికొత్త రికార్డులు
X

మొన్నటి హైదరాబాద్‌ మ్యాచ్‌లో ‘సన్‌రైజర్స్’ సృష్టించిన పరుగుల సునామీని మరువక ముందే విశాఖలో మరో తుఫాన్ విధ్వంసం సృష్టించింది. కోల్‌కతా బ్యాటర్ల ధాటికి వైఎస్సార్ క్రికెట్ స్టేడియం ఓ వైపు సిక్సర్ల జడివాన.. మరోవైపు బౌండరీల వరదతో హోరెత్తిపోయింది. సునిల్ నరైన్, 18ఏళ్ల కుర్రాడు రఘువంశీ, రస్సెల్ మెరుపులతో ఐపీఎల్‌లో రెండో అత్యధిక స్కోరు నమోదైంది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ తడబడిపోయింది. పంత్, స్టబ్స్ చేసిన పోరాటం సరిపోలేదు. ఫలితంగా కోల్‌కతా హ్యాట్రిక్ విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.

- దిశ, స్పోర్ట్స్

ఐపీఎల్-17వ సీజన్‌లో భాగంగా విశాఖ వేదికగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌(డీసీ)పై కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్) భారీ విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కోల్‌కతా.. నిర్ణీత ఓవర్లలో 272 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆకాశమే హద్దుగా చెలరేగిన సునిల్ నరైన్(85), రఘువంశి(54), రస్సెల్(41).. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించారు. ఫోర్లు, సిక్సర్లతో మోతమోగించారు. చివర్లో వచ్చిన రింకూ సింగ్(8బంతుల్లో 26) సైతం ధాటిగా ఆడాడు. ఇక, 273 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. బ్యాటింగ్‌లో తీవ్రంగా తడబడింది. కెప్టెన్ పంత్(55), త్రిస్టన్ స్టబ్స్(54) అర్ధసెంచరీలతో చెలరేగినా వారి పోరాటం సరిపోలేదు. వారు నిష్క్రమించిన అనంతరం మిగతా బ్యాటర్లూ పెవిలియన్‌కు వరుసకట్టారు. దీంతో 17.2ఓవర్లలోనే 166 పరుగుల వద్ద ఢిల్లీ ఆలౌట్ అయింది. ఫలితంగా కోల్‌కతా జట్టు 106 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలుపొంది పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఢిల్లీ బౌలర్లలో నోర్జ్టే 3 వికెట్లు తీయగా, ఇషాంత్ శర్మ రెండు, ఖలీల్ అహ్మద్, మిచెల్ మార్ష్ ఒక్కో వికెట్ పడగొట్టారు. కోల్‌కతా బౌలర్లలో వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి మూడేసి వికెట్లతో చెలరేగగా, మిచెల్ స్టార్క్ రెండు, ఆండ్రె రస్సెల్, సునిల్ నరైన్ ఒక్కో వికెట్ సాధించారు.

దంచికొట్టిన నరైన్, రంఘువంశి

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు వచ్చిన కోల్‌కతా.. వచ్చీరాగానే దూకుడైన ఆటను మొదలుపెట్టింది. ఓపెనర్ సాల్ట్, సునిల్ నరైన్‌ల జోడీ.. బౌండరీలతో విరుచుకుపడింది. ఈ క్రమంలోనే వీరి జోడీ కేవలం 4ఓవర్లలోనే 50 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని అందించింది. మరింత ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని నోర్జ్టే విడదీశాడు. అతను వేసిన ఇన్నింగ్స్ 4.3వ ఓవర్లో ఫిలిప్ సాల్ట్(18) క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. దీంతో 60 పరుగుల వద్ద కోల్‌కతా తొలి వికెట్ కోల్పోయింది. అయితే, వికెట్ తీశామన్న ఆనందం ఢిల్లీకి ఎంతోసేపు దక్కలేదు. ఆ తర్వాత వచ్చిన 18ఏళ్ల కుర్రాడు అంగ్‌క్రిష్ రఘువంశితో కలిసి నరైన్.. మరింత రెచ్చిపోయాడు. ఇద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఫోర్లు, సిక్సులతో బౌండరీల మోత మోగించారు. ఈ క్రమంలోనే నరైన్ 4 సిక్సులు 6 ఫోర్ల సాయంతో 21 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఇదే సమయంలో వీరి జోడి 45 బంతుల్లోనే జట్టుకు 100 పరుగుల భాగస్వామ్యాన్ని అందించింది. అయితే, అర్ధసెంచరీ పూర్తిచేసుకుని సెంచరీ దిశగా సాగుతున్న నరైన్(85; 39 బంతుల్లో 7x4, 7x6)ను మిచెల్ మార్ష్ అవుట్ చేశాడు. 12.3 ఓవర్లలో 164 పరుగుల వద్ద కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. మరోవైపు, 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 25 బంతుల్లోనే రఘువంశి అర్ధసెంచరీ సాధించాడు. ఐపీఎల్‌లో ఆడిన రెండో మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ చేసిన రఘువంశి(54).. కాసేపటికే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రస్సెల్(41; 19బంతుల్లో 4x4, 3x6), రింకూ సింగ్(26; 8 బంతుల్లో 3x6, 1x4) సైతం దంచికొట్టారు. ఓ దశలో ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు(277) చేసిన సన్‌రైజర్స్ జట్టు రికార్డును అధిగమించేలా కనిపించినా.. ఆఖరి ఓవర్లో రస్సెల్, రమన్‌దీప్(2)లను ఇషాంత్ శర్మ అవుట్ చేయడంతో 272 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగించారు. దీంతో ఐపీఎల్‌లో రెండో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా కోల్‌కతా నిలిచింది.

పంత్, త్రిస్టన్ పోరాడినా..

273 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్ పృథ్వీ షా(10) స్వల్ప స్కోరుకే అవుటయ్యాడు. దీంతో 21 పరుగుల వద్ద ఢిల్లీ తొలి వికెటు కోల్పోయింది. ఆ తర్వాత వరుసగా మరిన్ని వికెట్లు పడ్డాయి. మిచెల్ మార్ష్(0), అభిషేక్ పోరెల్(0) వెంటవెంటనే డకౌట్‌గా వెనుదిరిగారు. కాసేపటికే ఓపెనర్ డేవిడ్ వార్నర్(18) స్టార్క్ బౌలింగ్‌లో బోల్డ్ అయ్యాడు. దీంతో 33 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ కష్టాల్లో చిక్కుకుంది. అయితే, ఆ తర్వాత వచ్చిన పంత్, త్రిస్టన్ స్టబ్స్.. అద్భుతంగా పోరాడారు. తొలుత నెమ్మదిగా ఆటను ప్రారంభించిన వీరు.. ఆ తర్వాత రెచ్చిపోయారు. ఇద్దరూ కలిసి జట్టుకు 90 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని అందించారు. ఈ క్రమంలోనే 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 23 బంతుల్లో పంత్ వరుసగా రెండో అర్ధసెంచరీ సాధించగా, స్టబ్స్ సైతం 28 బంతుల్లో(3 x 4, 4 x 6) హాఫ్ సెంచరీ సాధించాడు. వీరి పోరాటం కొంతవరకు ఆశలు రేకెత్తించింది. అయితే, ఆ ఆశలపై వరుణ్ చక్రవర్తి నీళ్లు చల్లాడు. స్వల్ప వ్యవధిలోనే పంత్(55), అక్షర్ పటేల్(0), స్టబ్స్(54)ను అవుట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లను మిగతా బౌలర్లు చూసుకున్నారు. దీంతో 17.2 ఓవర్లలో 166 వద్ద ఢిల్లీ ఆలౌట్ అయింది.

స్కోరు బోర్డు

కోల్‌కతా నైట్ రైడర్స్: 272/7 (20 ఓవర్లు)

సాల్ట్ (సి) త్రిస్టన్ స్టబ్స్ (బి) నోర్జ్టె 18, నరైన్ (పంత్), (బి) మిచెల్ మార్ష్ 85, రఘువంశి (సి) ఇషాంత్ శర్మ (బి) నోర్జ్టె 54, రస్సెల్ (బి) ఇషాంత్ 41, శ్రేయస్ అయ్యర్ (సి) స్టబ్స్ (బి) ఖలీల్ అహ్మద్ 18, రింకూ సింగ్ (సి) వార్నర్ (బి) నోర్జ్టె 26, వెంకటేశ్ అయ్యర్ 5 నాటౌట్; రమణ్‌దీప్ సింగ్ (సి) పృథ్వీ షా (బి) ఇషాంత్ 2, స్టార్క్ 1 నాటౌట్, ఎక్స్‌ట్రాలు-22

వికెట్ల పతనం: 60-1, 164-2, 176-3, 232-4, 264-5, 264-6, 266-7

బౌలింగ్: ఖలీల్ అహ్మద్ (4-0-43-1), ఇషాంత్ (3-0-43-2), నోర్జ్టె (4-0-59-2), రసిఖ్ సలాం (3-0-47-0), సుమిత్ కుమార్ (2-0-19-0), అక్షర్ (1-0-18-0), మిచెల్ మార్ష్ (3-0-37-1)

ఢిల్లీ క్యాపిటల్స్: 166/10 (17.2 ఓవర్లు)

వార్నర్ (బి) స్టార్క్ 18, పృథ్వీ షా (సి) చక్రవర్తి (బి) వైభవ్ అరోరా (10), మిచెల్ మార్ష్ (సి) రమణ్‌దీప్ (బి) 0, అభిషేక్ పోరెల్ (సి) నరైన్ (బి) వైభవ్ అరోరా 0, పంత్ (సి) శ్రేయస్ (బి) చక్రవర్తి 55, త్రిస్టన్ స్టబ్స్ (సి) స్టార్క్ (బి) చక్రవర్తి 54, అక్షర్ పటేల్ (సి) మనిష్ పాండే (బి) చక్రవర్తి 0, సుమిత్ కుమార్ (సి) పాండే (బి) నరైన్ 7, రసిఖ్ సలాం (సి) సాల్ట్ (బి) వైభవ్ 1, నోర్జ్టె (సి) శ్రేయస్ (బి) రస్సెల్ 4, ఇషాంత్ 1 నాటౌట్; ఎక్స్‌ట్రాలు- 16

వికెట్ల పతనం: 21-1, 26-2, 27-3, 33-4, 126-5, 126-6, 159-7, 159-8, 161-9, 166-10

బౌలింగ్: మిచెల్ మార్ష్ (3-0-25-2), వైభవ్ (4-0-27-3), రస్సెల్ (1.2-0-14-1), నరైన్ (4-0-29-1), వరుణ్ చక్రవర్తి (4-0-33-3), వెంకటేశ్ అయ్యర్ (1-0-28-0)


ఈ మ్యాచ్‌‌లో కోల్‌కతా రికార్డులు

అత్యంత వేగంగా 200 పరుగుల చేసిన ఐపీఎల్ జట్టు

14.3 - ఆర్సీబీ vs పంజాబ్, 2016

14.4 - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ముంబై, 2024*

15.2 - కోల్‌కతా vs ఢిల్లీ, 2024*

ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన జట్లు

277/3 - సన్‌రైజర్స్ vs ముంబై, హైదరాబాద్‌లో, 2024

272/7 - కోల్‌కతా vs ఢిల్లీ, వైజాగ్‌లో, 2024*

263/5 - ఆర్సీబీ vs పుణె వారియర్స్, బెంగళూరులో, 2013

257/5 - లక్నో vs పంజాబ్, మొహాలీలో, 2023

248/3 - ఆర్సీబీ vs గుజరాత్, బెంగళూరులో, 2016


ఒక ఇన్నింగ్స్‌లో కేకేఆర్ కొట్టిన సిక్సుల సంఖ్య

18 - ఢిల్లీపై, వైజాగ్‌లో, 2024*

17 - చెన్నయ్‌పై, చెన్నయ్‌లో, 2018

17 - పంజాబ్‌పై, ఈడెన్ గార్డెన్‌లో, 2019


Next Story

Most Viewed