హైదరాబాద్‌లో చివరి మ్యాచ్‌ ఆడనున్న సానియా మీర్జా..

by Disha Web Desk 13 |
హైదరాబాద్‌లో చివరి మ్యాచ్‌ ఆడనున్న సానియా మీర్జా..
X

హైదరాబాద్: భారత టెన్నిస్ లెజెండ్, హైదరాబాద్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా మార్చి 5వ తేదీన ప్రొఫెషనల్ టెన్నిస్‌కు పూర్తిగా గుడ్ బై చెప్పనుంది. అనేక మంది డబుల్స్‌లో ఆమె సాధించిన వరల్డ్ నంబర్ వన్ ర్యాంక్‌ను గుర్తు చేసుకుంటున్నారు. తన హోం గ్రౌండ్‌లో చివరి మ్యాచ్‌ను ఆడబోతున్నానన్న విషయాన్ని సానియా ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది. దీంతో చివరిసారి ఆమె ఆటను చూసే అవకాశం హైదరాబాద్ అభిమానులకు దక్కింది.

మార్చి 5వ తేదీన సానియా హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో చివరి మ్యాచ్ ఆడనుంది. ‘18, 20 ఏళ్ల క్రితం ఎక్కడైతే టెన్నిస్‌ను ప్రారంభించానో అక్కడే మార్చి 5వ తేదీన చివరి మ్యాచ్‌ను ఆడబోతున్నాను. నా సన్నిహితులు, కుటుంబ సభ్యులు, నా భాగస్వామి మ్యాచ్‌ను చూడటానికి వస్తున్నారు. మీ అందరి ముందు చివరిసారి మ్యాచ్ అడబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.

ఇది కలకాలం గుర్తుండి పోయేలా ఉంటుందని భావిస్తున్నాను. ఈ టెన్నిస్ ప్రయాణంలో నాకు అత్యంత నమ్మకమైన అభిమానులు, అనుచరులు ముందు ఈ చివరి మ్యాచ్ ఆడాలనుకుంటున్నాను’ అని సానియా ఇన్‌స్టాగ్రామ్‌లో రాసింది. సానియా రెండు ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు ఆడనుంది. తొలుత రౌండర్స్ మ్యాచ్ జరుగుతుంది. ఇందులో ఒక జట్టుకు సానియా మరో జట్టుకు రోహన్ బొప్పన్న నేతృత్వం వహిస్తారు. ఇక రెండో మ్యాచ్ మిక్స్‌డ్ డబుల్స్. ఇందులో సానియా-బొపన్న ఒక జోడీగా, ఇవాన్ డొవిగ్-బేథనీ మటెక్ మరో జంటగా ఆడతారు.

ఈ మ్యాచ్ చూడటానికి టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన అనేక మంది సెలబ్రిటీలు వస్తారని అంచనా వేస్తున్నారు. సానియాకు అత్యంత ఆప్తురాలు ఫరా ఖాన్ కూడా ఈ చివరి మ్యాచ్‌ను చూసేందుకు హైదరాబాద్ వస్తున్నారు. సానియా ఫేర్‌వెల్ మ్యాచ్ టిక్కెట్లు ఆన్‌లైన్‌లో సిద్ధంగా ఉన్నాయి. రూ. 499 నుంచి 749 మధ్య టికెట్ రేట్ ఉంది. పేటీఎం ఇన్‌సైడర్ ద్వారా ఈ టిక్కెట్లను పొందవచ్చు.

Next Story