ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ చాంపియన్‌గా బోపన్న.. ‘వయసు’తో చరిత్ర సృష్టించిన ఇండియన్ స్టార్

by Dishanational5 |
ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ చాంపియన్‌గా బోపన్న.. ‘వయసు’తో చరిత్ర సృష్టించిన ఇండియన్ స్టార్
X

దిశ, స్పోర్ట్స్ : రోహన్ బోపన్న సాధించాడు. 43 ఏళ్ల ఈ భారత టెన్నిస్ డబుల్స్ స్టార్ తొలి పురుషుల డబుల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ నిరీక్షణకు తెరదించాడు. 60 గ్రాండ్‌స్లామ్ ప్రయత్నాల తర్వాత అతని కల నిజమైంది.ఆస్ట్రేలియా ఆటగాడు మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి బోపన్న ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్ చాంపియన్‌గా అవతరించాడు. అంతేకాకుండా, పురుషుల టెన్నిస్‌లో ఓ గ్రాండ్‌స్లామ్ నెగ్గిన అతిపెద్ద వయస్కుడిగానూ బోపన్న చరిత్ర సృష్టించాడు.

ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్‌ను బోపన్న-మాథ్యూ ఎబ్డెన్ జోడీ కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 2వ సీడ్ బోపన్న జోడీ 7-6(7-0), 7-5 తేడాతో ఇటలీ జోడీ సిమోన్ బొలెల్లి-ఆండ్రియా వవాస్సోరిని చిత్తు చేసింది. గంటా 39 నిమిషాలపాటు మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ప్రత్యర్థి నుంచి తీవ్ర పోటీ ఎదురైనా బోపన్న, మాథ్యూ ఎబ్డెన్ జోడీ పంతంతో ఆడింది. రసవత్తరంగా సాగిన తొలి సెట్‌‌లో నిర్ణీత 12 గేమ్‌ల్లో ఫలితం తేలలేదు. 12వ గేమ్‌ను నెగ్గి ఇటలీ జోడీ తొలి సెట్‌ను టై బ్రేకర్‌కు మళ్లించగా.. అక్కడ బోపన్న జోడీనే పైచేయి సాధించింది. రెండో సెట్‌లోనూ ఆసక్తికర పోరే నడిచింది. బోపన్న జోడీ, ఇటలీ జోడీ సర్వీస్‌లను కాపాడుకుంటూ వెళ్లడంతో రెండో సెట్ కూడా టై బ్రేకర్‌‌కు వెళ్లేలా కనిపించింది. ఈ సమయంలో 11వ గేమ్‌లో ప్రత్యర్థి ద్వయం సర్వీస్‌ను బ్రేక్ చేయడంతోపాటు వరుసగా మూడు గేమ్‌లను నెగ్గిన బోపన్న జోడీ రెండోసెట్‌నూ దక్కించుకుని నయా చాంపియన్‌గా అవతరించింది. ఈ మ్యాచ్‌లో బోపన్న జోడీ 8 ఏస్‌లు, 26 విన్నర్లు బాదగా.. ప్రత్యర్థి ద్వయం 1 ఏస్, 15 విన్నర్లు మాత్రమే కొట్టింది.

బోపన్నకు ఇదే తొలి పురుషుల డబుల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్. అయితే, డబుల్స్‌లో రెండేది. 2017లో గాబ్రియెలా దబ్రోవ్‌స్కే(కెనడా)తో కలిసి ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ గెలుచుకున్నాడు. అలాగే, పురుషుల డబుల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన మూడో భారత ఆటగాడిగా నిలిచాడు. బోపన్న కంటే ముందు లియాండర్ పేస్, మహేశ్ భూపతి ఈ జాబితాలో ఉన్నారు.


Next Story

Most Viewed