రంజీ ట్రోఫీలో తిరుగులేని ముంబై.. 48వ సారి ఫైనల్‌కు

by Dishanational3 |
రంజీ ట్రోఫీలో తిరుగులేని ముంబై.. 48వ సారి ఫైనల్‌కు
X

దిశ, స్పోర్ట్స్ : ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో ముంబై జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. ముంబై వేదికగా జరిగిన సెమీస్‌లో ఆదివారం తమిళనాడుపై ఇన్నింగ్స్ 70 పరుగుల తేడాతో గెలుపొందింది. తమిళనాడును రెండో ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే కుప్పకూల్చి భారీ విజయం అందుకుంది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌ను ముంబై మూడు రోజుల్లోనే ముగించింది. టోర్నీ చరిత్రలో ముంబై ఫైనల్‌లో అడుగుపెట్టడం ఇది 48వ సారి. సెంచరీతోపాటు నాలుగు వికెట్లు తీసిన శార్దూల్ ఠాకూర్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. శార్దూల్ ఠాకూర్(109)కితోడు తనుష్(89 నాటౌట్), ముషీర్ ఖాన్(55) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో ముంబై 378 పరుగులు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 353/9తో మూడో రోజు ఆట కొనసాగించిన ముంబై జట్టు మరో 25 పరుగుల జోడించి చివరి వికెట్‌ను కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో ముంబైకి 232 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన తమిళనాడు బ్యాటర్లు మరోసారి తేలిపోయారు. బాబా ఇంద్రజిత్(70) మినహా ఎవరూ రాణించలేదు. దీంతో తమిళనాడు రెండో ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే ఆలౌటై భారీ ఓటమిని చవిచూసింది. ముంబై బౌలర్లలో సామ్స్ ములానీ 4 వికెట్లతో సత్తాచాటగా.. శార్దూల్ ఠాకూర్, మోహిత్, తనుష్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

రంజీ ట్రోఫీ చరిత్రలో తిరుగులేని రికార్డు ముంబై సొంతం. 48వ సారి టోర్నీలో ఫైనల్‌కు చేరుకుంది. అత్యధికంగా 41 సార్లు చాంపియన్‌గా నిలిచింది. చివరిసారిగా 2016లో టైటిల్ దక్కించుకున్న ముంబై.. 2022లో తుది పోరులో రన్నరప్‌గా సరిపెట్టింది. చాంపియన్ హోదాను తిరిగి కైవసం చేసుకోవడంపై కన్నేసిన ముంబై.. ఫైనల్‌లో విదర్భ లేదా మధ్యప్రదేశ్‌తో తలపడనుంది.

Next Story

Most Viewed