HCA ఘోర వైఫల్యం వెనుక రాజకీయ కోణం?

by Disha Web Desk 2 |
HCA ఘోర వైఫల్యం వెనుక రాజకీయ కోణం?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 25న జరగాల్సి ఉన్న భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌పై గందరగోళం ఏర్పడింది. మ్యాచ్ టికెట్ల విక్రయాలతో పాటు స్టేడియం నిర్వాహణలో HCA ఘోరంగా విఫలం అయిందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. టికెట్ల విక్రయాల్లో చోటు చేసుకున్న రాద్ధాంతం HCA పరువును గంగలో కలిపిందనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ వ్యవహారంలో HCA అధ్యక్షుడు అజారుద్దీన్పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు నమోదైంది. టికెట్ల విక్రయం విషయంలో నిర్లక్ష్యం, అవినీతికి పాల్పడిన ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ బీసీ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ హెచ్ఆర్సీని ఆశ్రయించారు. కాగా ఈ దుమారం వెనుక రాజకీయ కోణం ఉందనే ప్రచారం జరుగుతోంది. HCA పాలకమండలి రెండు వర్గాలుగా చీలిపోవడంతోనే అసలు సమస్య ఉత్పన్నం అయిందనే అభిప్రాయాలు క్రీడా పండితుల నుండి వ్యక్తం అవుతోంది. HCA అధ్యక్షుడు అజారుద్దీన్ ఓ వర్గం పాలక వర్గంలోని మరి కొంత మంది మరో వర్గంగా ఏర్పడటంతో మ్యాచ్ ఏర్పాట్లపై సక్రమంగా పని చేయడం లేదనే విమర్శలు గుప్పుమంటున్నాయి.

అజారుద్దీన్ పొలిటికల్‌గా కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి కాగా ఆయనకు వ్యతిరేకంగా HCA పాలకమండలిలో మరి కొందరు అధికార టీఆర్ఎస్‌కు సానుభూతి పరులు ఉన్నారని వీరి మధ్య ఏర్పడిన భేదాభిప్రాయాలు భారత్- ఆస్ట్రేలియా మ్యాచ్ విషయంలో పొడచూపుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో హెచ్ సీఏలో కల్వకుంట్ల కవితకు కీలక పదవి అప్పగించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ఆ తర్వాత ఆ విషయం సైలెంట్ అయిపోయినా ప్రస్తుతం జరుగుతున్న రచ్చ వెనుక అజారుద్దీన్ వర్సెస్ టీఆర్ఎస్‌యే కారణం అని క్రికెట్ లవర్స్ దుమ్మెత్తిపోస్తున్నారు. మ్యాచ్ నిర్వహణ విషయంలో ఈ నెల 19వ తేదీన HCA ప్రెసిడెండ్ అజారుద్దీన్ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ భేటీ అయ్యారు. మ్యాచ్ ఏర్పాట్లపై చర్చించారంటూ ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు విడుదలయ్యాయి.

కానీ, ఆ మరుసటి రోజు నుంచి వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ అజారుద్దీన్‌పై ఆగ్రహం వ్యక్తం చేయగా.. అందుకు వెంటనే కౌంటర్ ఇచ్చారు అజారుద్దీన్. శ్రీనివాస్ గౌడ్ వందల సంఖ్యలో కాంప్లిమెంటరీ టికెట్లు కోరాడంటూ పిడుగులాంటి వార్తను చెప్పారు. ఈ మ్యాచ్ టికెట్ల విషయంలో HCA క్రికెట్ అభిమానుల సహనాన్ని పరీక్షించింది. ఓసారి టికెట్లు అన్ని సేల్ అయ్యాయని, మరోసారి జింఖాన గ్రౌండ్‌లో విక్రయిస్తామని, ఆ తర్వాత ఆన్‌లైన్‌లోనే అమ్ముతామని, ఆ వెంటనే టికెట్లు లెవ్వంటూ ప్రకటించడం అభిమానులకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. దాదాపు మూడేళ్ల తర్వాత జరుగుతున్న మ్యాచ్ కావడంతో పెద్ద ఎత్తున అభిమానుల నుండి స్పందన వచ్చింది. ఆ మేరకు ఏర్పాట్లు చేయడం విషయంలో HCA లోని ఇరు వర్గాల మధ్య ఏర్పడిన రాజకీయ కుమ్ములాటే కారణం అనే టాక్ వినిపిస్తోంది. ఈ ఎపిసోడ్‌లో అజారుద్దీన్‌పై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. ఇలాంటి ఘర్షణ వాతావరణంలో అసలు మ్యాచ్ జరుగుతుందా? జరిగితే స్టేడియం లోపల ప్రశాంతంగానే ఉంటుందా? అసలు సరైన ఏర్పాట్లు చేస్తారా? అనే ప్రశ్నలు సాధారణ అభిమానుల్లో వ్యక్తం అవుతోంది.


Next Story