వెలిగిన పారిస్ ఒలింపిక్స్ జ్యోతి

by Dishanational3 |
వెలిగిన పారిస్ ఒలింపిక్స్ జ్యోతి
X

దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్-2024 జూలై 26 నుంచి ప్రారంభకానున్న విషయం తెలిసిందే. విశ్వక్రీడల్లో కీలక ఘట్టమైన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం మంగళవారం జరిగింది. ఒలింపిక్స్ పుట్టినిల్లుగా భావించే గ్రీస్‌లోని ఒలింపియాలో పారిస్ ఒలింపిక్స్ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. గ్రీస్ నటి మేరీ మినా క్రీడా జ్యోతిని వెలిగించింది. సంప్రదాయ పద్ధతిలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ఘట్టంతో ఒలింపిక్స్ టార్చ్ రిలే ప్రారంభమైంది. అలాగే, 100 రోజుల కౌంట్‌డౌన్ కూడా మొదలైంది.

ఈ సందర్భంగా అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ(ఐవోసీ) అధ్యక్షుడు థామస్‌ బాచ్‌ మాట్లాడుతూ..‘యుద్ధాలు, సంఘర్షణలు పెరుగుతున్న ఈ కష్టసమయంలో ప్రజలు ద్వేషం, దూకుడు, ప్రతికూల వార్తలతో విసిగిపోతున్నారు. వాటినుంచి బయటపడేందుకు, అందరినీ ఏకతాటిపైకి తెచ్చే దాని కోసం ఎదురుచూస్తున్నాం. ఆ ఆశలకు ఈ ఒలింపిక్ జ్యోతి ప్రతీక.’ అని తెలిపారు. గ్రీస్‌లో 11 రోజులుపాటు ఒలింపిక్ టార్చ్ రిలే అనంతరం.. జ్యోతిని ఈ నెల 27న పారిస్ క్రీడల నిర్వాహకులకు అందజేస్తారు. టార్చ్ రిలే 68 రోజులపాటు కొనసాగుతోంది. జూలై 26న పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ రోజున క్రీడా జ్యోతిని వెలిగించడంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది.


Next Story