భారత యువ షట్లర్ సంచలనం.. ఓర్లీన్స్ మాస్టర్స్ టైటిల్ కైవసం

by Disha Web Desk 13 |
భారత యువ షట్లర్ సంచలనం.. ఓర్లీన్స్ మాస్టర్స్ టైటిల్ కైవసం
X

పారిస్: భారత యువ షట్లర్ ప్రియాన్షు రజావత్ సంచలనం సృష్టించాడు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఓర్లీన్స్ మాస్టర్స్ మెన్స్ సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. టోర్నీలో ఆరంభం నుంచి అద్భుత ప్రదర్శన చేసిన భారత ఆటగాడు.. ఆదివారం జరిగిన ఫైనల్‌లోనూ అదే జోరు కొనసాగించాడు. ఉత్కంఠగా సాగిన పోరులో రజావత్ 21-15, 19-21, 21-16 తేడాతో డెన్మార్క్ ప్లేయర్ మాగ్నస్ జోహన్నెసెన్‌పై విజయం సాధించాడు. తొలి గేమ్‌లో ప్రారంభంలో 5-2తో రజావత్ కాస్త వెనుబడినా.. ఆ తర్వాత 7-7తో స్కోరు సమం చేసిన అనంతరం దూకుడు పెంచాడు. ప్రత్యర్థికి అవకాశాలు ఇవ్వకుండా ఆధిక్యం పెంచుకుంటూ వెళ్లి తొలి గేమ్‌ను ఖాతాలో వేసుకున్నాడు.

నువ్వానేనా అన్నట్టు సాగిన రెండో గేమ్‌లోనూ రజావత్ అదే జోరు కనబర్చినప్పటికీ.. ప్రత్యర్థి బలంగా పుంజుకుని షాకిచ్చాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌ ప్రారంభం నుంచే రజావత్ దూకుడుగా కనిపించాడు. అయితే, ప్రత్యర్థి తన బలాన్ని పెంచుకుని 9-9తో స్కోరు సమం చేశాడు. అనంతరం రజావత్ వరుసగా ఐదు పాయింట్లను సాధించి 14-9తో ఆధిక్యంలోకి వెళ్లాడు. చివరి వరకూ అదే జోరు కనబర్చి మూడో గేమ్‌తోపాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకుని విజేతగా నిలిచాడు. దాంతో తన కెరీర్‌లో తొలి బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్(బీడబ్ల్యూఎఫ్) వరల్డ్ టూర్ సూపర్ 300 టైటిల్‌ను సాధించాడు.

Next Story

Most Viewed