ఇషాన్‌, శ్రేయస్‌కు బీసీసీఐ షాక్.. గిల్‌కు ప్రమోషన్

by Dishanational5 |
ఇషాన్‌, శ్రేయస్‌కు బీసీసీఐ షాక్.. గిల్‌కు ప్రమోషన్
X

దిశ, స్పోర్ట్స్: యువ బ్యాటర్లు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌కు ‘భారత క్రికెట్ నియంత్రణ మండలి’(బీసీసీఐ) గట్టి షాక్ ఇచ్చింది. వార్షిక కాంట్రాక్ట్‌ నుంచి వీరిని తొలగించింది. 2023-24కు సంబంధించి సెంట్రల్ కాంట్రాక్టులను దక్కించుకున్న ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ బుధవారం వెల్లడించింది. ఈ కాంట్రాక్టుల గడువు 2023 అక్టోబర్ 1 నుంచి 2024 సెప్టెంబర్ 30వరకు ఉండనుంది. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించని సమయంలో రంజీ వంటి దేశవాళీ టోర్నీల్లో పాల్గొనకుండా, బీసీసీఐ ఆగ్రహానికి గురైన శ్రేయస్, ఇషాన్‌ కిషన్‌లను బోర్డు వార్షిక కాంట్రాక్టు జాబితాలో చేర్చలేదు. గతేడాది శ్రేయస్ అయ్యర్ గ్రేడ్ Bలో చోటుదక్కించుకోగా, ఇషాన్ గ్రేడ్ Cలో కాంట్రాక్ట్ అందుకున్న విషయం తెలిసిందే. మరోవైపు, టెస్టు స్పెషలిస్ట్ బ్యాటర్లు, సీనియర్ ప్లేయర్లైన ఛతేశ్వర్ పుజారా, అజింక్యా రహానేలకూ నిరాశే ఎదురైంది. గతేడాది కాంట్రాక్టులో గ్రేడ్ Bలో చోటుదక్కించుకున్న వీరిద్దరూ.. ఇటీవలి దేశవాళీ టోర్నీల్లో అద్భుతమైన ఆటతీరును కనబరుస్తున్నప్పటికీ ఈ ఏడాదికి కాంట్రాక్ట్ దక్కించుకోకపోవడం గమనార్హం. ఇక, కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రాతోపాటు మరికొందరు ప్లేయర్లు ఈ ఏడాదికి తమ కాంట్రాక్టును రిటైన్ చేసుకున్నారు. రోహిత్, విరాట్, బుమ్రా, జడేజా గ్రేడ్ A+ కేటగిరిలోనే కొనసాగుతుండగా, యువ బ్యాటర్ శుభమన్ గిల్ తన కాంట్రాక్టును మెరుగుపర్చుకున్నాడు. గిల్ గతేడాది గ్రేడ్ Cలో ఉండగా, తాజాగా గ్రేడ్ Bలోకి ప్రమోట్ అయ్యాడు. తిలక్ వర్మ, రింకూ సింగ్, యశస్వి జైశ్వాల్ తొలిసారిగా బీసీసీఐ కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. ‘‘జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించని సమయంలో దేశవాళీ క్రికెట్‌లో పాల్గొనడానికి ప్రాధాన్యత ఇవ్వాలి’’ అని ఈ సందర్భంగా బీసీసీఐ సిఫార్సు చేసింది.

ఈ ఏడాదికి కాంట్రాక్టు దక్కించుకున్న ఆటగాళ్ల పూర్తి జాబితా ఇదే:

* గ్రేడ్ A+ (నలుగురు ఆటగాళ్లు)

- రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా, జడేజా

* గ్రేడ్ A(ఆరుగురు ప్లేయర్లు)

- రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, సిరాజ్, కేఎల్ రాహుల్, శుభమన్ గిల్, హార్దిక్ పాండ్యా,

* గ్రేడ్ B (ఐదుగురు)

- సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైశ్వాల్

* గ్రేడ్ C (15 మంది)

- రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దుల్ థాకూర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముకేశ్ కుమార్, సంజూ శాంసన్, అర్షదీప్ సింగ్, కేఎస్ భరత్, ప్రసిద్ధ్ క్రిష్ణ, ఆవేశ్ ఖాన్, రజత్ పాటిదార్.

* వీరేకాకుండా, నిర్దేశిత వ్యవధిలో కనీసం 3 టెస్టులు, 8 వన్డేలు లేదా 10 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిప ప్లేయర్లు నేరుగా గ్రేడ్ Cలోకి ప్రవేశం పొందుతారని బీసీసీఐ వెల్లడించింది. ఈ లెక్కన ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జరేల్ త్వరలోనే గ్రేడ్ Cలో చేరేందుకు అవకాశం ఉంది.

బీసీసీఐ కాంట్రాక్ట్ అంటే ఏంటి?

ఇది బీసీసీఐకి, క్రికెటర్లకు మధ్య జరిగే వార్షిక ఒప్పందం. ఏడాది పొడవునా వివిధ ఫార్మాట్‌లలో భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడానికి, ఆటగాళ్ల బాధ్యతలు, వేతనానికి సంబంధించిన వివరాలు ఇందులో భాగంగా ఉంటాయి. ఈ కాంట్రాక్టు పొందిన ఆటగాళ్లకు మ్యాచ్‌లతో సంబంధం లేకుండా(ఆడినా, ఆడకపోయినా) బీసీసీఐ వార్షిక వేతనాన్ని అందజేస్తుంది. ఈ వేతనం ఆటగాళ్ల గ్రేడ్‌ను బట్టి మారుతుంది. ఆటగాళ్ల ప్రదర్శన, అనుభవం, జట్టుకు అందించిన సహకారం ఆధారంగా వారిని A+, A, B, C గ్రేడ్‌లలో చేరుస్తుంది. A+ గ్రేడ్‌లోని ఆటగాళ్లు అధిక వేతనం అందుకుంటారు. ఇతర ప్రయోజనాలనూ పొందుతారు. అదనంగా వాళ్లు ఆడిన ప్రతి మ్యాచ్‌కూ మ్యాచ్ ఫీజును అందుకుంటారు. ఫార్మాట్‌ను బట్టి మ్యాచ్ ఫీజులో వ్యత్యాసం ఉంటుంది. కాంట్రాక్టు దక్కించుకోని ఆటగాళ్లు కేవలం వాళ్లు ఆడే మ్యాచ్‌లకు మాత్రమే ఫీజును పొందుతారు.

ఎవరికి ఎంత వేతనం?

A+ కాంట్రాక్టు పొందిన ఆటగాళ్లు అత్యధికంగా రూ.7కోట్ల వార్షిక వేతనాన్ని అందుకుంటారు. A గ్రేడ్‌లో కాంట్రాక్టు దక్కించుకున్న ఆటగాళ్లు రూ.5కోట్లు, Bలో చోటుదక్కించుకున్న ప్లేయర్లు రూ.3, C గ్రేడ్‌లో ఉన్న ఆటగాళ్లు కోటి రూపాయలు వార్షిక వేతనంగా అందుకుంటారు. మ్యాచ్‌ ఫీజులు అదనం.




Next Story

Most Viewed