ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో సత్తాచాటిన భారత షూటర్

by Dishanational3 |
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో సత్తాచాటిన భారత షూటర్
X

దిశ, స్పోర్ట్స్ : ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో భారత యువ షూటర్ నాన్సీ మెరిసింది. ఇండోనేషియాలో జరుగుతున్న ఈ టోర్నీలో 19 ఏళ్ల నాన్సీ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత కేటగిరీలో స్వర్ణ పతకం సాధించింది. ఈ కేటగిరీలో స్వర్ణం, రజతం భారత షూటర్లకే దక్కడం విశేషం. క్వాలిఫికేషన్ రౌండ్‌లో 632.4 స్కోరుతో 4వ స్థానంలో ఫైనల్‌కు అర్హత సాధించిన నాన్సీ.. పతక పోరులో సత్తాచాటింది. 252.8 స్కోరుతో గోల్డ్ మెడల్ సాధించింది. క్వాలిఫికేషన్ రౌండ్‌లో అగ్రస్థానంలో నిలిచిన మరో భారత షూటర్ ఎలవెనిల్ వలారివన్ తృటిలో స్వర్ణం చేజార్చుకుంది. 252.7 స్కోరుతో రజతం గెలుచుకుంది. పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత టోర్నీగా ఉన్న ఈ టోర్నీలో వ్యక్తిగత కేటగిరీల్లో టాప్-2లో నిలిచిన షూటర్లు ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు. అయితే, రైఫిల్ షూటింగ్‌లో భారత్ ఒలింపిక్ బెర్త్‌లు ఇప్పటికే పూర్తవడంతో నాన్సీ, ఎలవెనిల్ వలారివన్‌లకు నిరాశ తప్పలేదు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల టీమ్ కేటగిరీలో నాన్సీ, ఎలవెనిల్ వలారివన్, మెహులీ ఘోష్‌లతో కూడిన భారత జట్టు 1,897.2 స్కోరుతో బంగారు పతకం సాధించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పురుషుల వ్యక్తిగత కేటగిరీలో భారత షూటర్ రుద్రాంక్ష్ పాటిల్(228.7 స్కోరు) కాంస్యం దక్కించుకున్నాడు. ఇదే కేటగిరీలో పురుషుల టీమ్ ఈవెంట్‌లో రుద్రాంక్ష్ పాటిల్, అర్జున్, రవిశంకర్ త్రయం(1,885.3 స్కోరు) కాంస్య పతకం సాధించింది. మొత్తంగా ఈ టోర్నీలో భారత్ 17 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Next Story