నాతోపాటు నా తండ్రికి భావోద్వేగ క్షణమే : ఎమోషనల్ అయిన అశ్విన్

by Dishanational3 |
నాతోపాటు నా తండ్రికి భావోద్వేగ క్షణమే : ఎమోషనల్ అయిన అశ్విన్
X

దిశ, స్పోర్ట్స్ : ధర్మశాల టెస్టుతో టీమ్ ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కెరీర్‌లో 100వ టెస్టు మ్యాచ్ ఆడుతున్నాడు. దీంతో 100 టెస్టులు ఆడిన 14వ భారత క్రికెటర్‌గా అతను నిలిచాడు. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అశ్విన్‌కు 100వ టెస్టు క్యాప్‌ను అందజేశాడు. ఈ కార్యక్రమానికి అశ్విన్ భార్య ప్రీతి నారాయణ్, ఇద్దరు కూతుళ్లు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అశ్విన్ మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. తన విజయంలో కుటుంబం పాత్ర ఎంతో ఉందని చెప్పాడు. తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. ‘నాతోపాటు చెన్నయ్‌లో కూర్చొని ఉన్న ఓ వ్యక్తి కూడా ఇది భావోద్వేగ క్షణం. చిన్నతనంలో నా క్రికెట్ కిట్ బైక్ పెట్రోల్ ట్యాంక్ మీద పెట్టి నన్ను ముందు కూర్చోబెట్టుకొని కోచింగ్‌కు తీసుకెళ్లేవాడు. మా అమ్మ, తాత సహకారంతోనే ఆయన నన్ను ఈ స్థాయికి తీసుకురాగలిగారు. నా భార్య ఈ రోజు వరకు నాకు మద్దతుగా ఉంది. నా ఇద్దరు పిల్లలు కూడా నా ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారు.’ అని చెప్పాడు.

ఈ సందర్భంగా అశ్విన్ యువ క్రికెటర్లకు పలు సూచనలు చేశాడు. ‘క్రికెట్‌లో ఐపీఎల్‌ పాపులర్ టోర్నీ. చాలా మంది యువకులు టీ20 క్రికెట్ ఆడి ఐపీఎల్‌లోకి రావాలనుకుంటున్నారు. అయితే, కుర్రాళ్లు ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి. టెస్టులు జీవితం నేర్పని చాలా పాఠాలను నేర్పుతుంది. ఒత్తిడిని, ప్రతికూలతలను ఎలా అధిగమించాలనేది తెలుస్తాయి.’ అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు అశ్విన్‌కు తోటి ఆటగాళ్లు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. భారత ఆటగాళ్లు ఇరువైపు నిలుచుని చప్పట్లతో అశ్విన్‌ను మైదానంలోకి ఆహ్వానించారు.


Next Story

Most Viewed