హర్మన్‌ప్రీత్ కౌర్ విధ్వంసం.. డబ్ల్యూపీఎల్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న ముంబై

by Dishanational3 |
హర్మన్‌ప్రీత్ కౌర్ విధ్వంసం.. డబ్ల్యూపీఎల్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న ముంబై
X

దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) సీజన్-2లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న తొలి జట్టు ముంబై. శనివారం ఢిల్లీ వేదికగా ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌పై 7 వికెట్ల తేడాతో ముంబై విజయం సాధించింది. హర్మన్‌ప్రీత్ కౌర్(95 నాటౌట్) కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని కట్టబెట్టింది. ముందుగా టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. హేమలత(74), బెత్ మూనీ(66) మెరుపు హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. 18 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన పరిస్థితుల్లో వీళ్లిద్దరూ జట్టును ఆదుకున్నారు. రెండో వికెట్‌కు ఈ జోడీ 121 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పింది. వీరి తర్వాత లిచ్ ఫీల్డ్(3), గార్డ్‌నెర్(1), బ్రైస్(7), స్నేహ్ రాణా(1) నిరాశపర్చగా.. భారతి ఫుల్మాలి(21 నాటౌట్) విలువైన పరుగులు జోడించింది.

హర్మన్‌ప్రీత్ విశ్వరూపం

191 పరుగుల లక్ష్యాన్ని ముంబై జట్టు 19.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఛేదనలో ముంబైకి యాస్తికా భాటియా(49) శుభారంభం అందించింది. మరో ఓపెనర్ హేలీ మాథ్యూస్(18), నాట్ స్కివర్ బ్రంట్(2) నిరాశపరిచినా దూకుడుగా ఆడిన ఆమె తృటిలో ఆమె హాఫ్ సెంచరీ చేజార్చుకుంది. ఆ తర్వాత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(95 నాటౌట్) విశ్వరూపం చూపించింది. ఎడాపెడా బౌండరీలతో చెలరేగిన ఆమె 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. అనంతరం మరింత రెచ్చిపోయిన హర్మన్‌ప్రీత్ 18వ ఓవర్‌లో 24 పరుగులు పిండుకుని జట్టును విజయానికి చేరువ చేసింది. అజేయంగా నిలిచిన ఆమె ఆఖరి ఓవర్‌లో 16 పరుగులు కావాల్సి ఉండగా ఐదు బంతుల్లోను జట్టును విజయతీరాలకు చేర్చింది. ఈ విజయంతో ముంబై జట్టు పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానానికి చేరుకుని ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.

సంక్షిప్త స్కోరుబోర్డు

గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్ : 190/7(20 ఓవర్లు)

(హేమలత 74, బెత్ మూనీ 66, సైకా ఇషాక్ 2/31)

ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ : 191/3(19.5 ఓవర్లు)

(హర్మన్‌ప్రీత్ కౌర్ 95 నాటౌట్, యాస్తికా భాటియా 49)

Next Story

Most Viewed