‘ఉప్పల్’ టెస్టులో గెలుపు ఎవరిది?.. కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసేది ఇతనే..

by Dishanational5 |
‘ఉప్పల్’ టెస్టులో గెలుపు ఎవరిది?.. కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసేది ఇతనే..
X

దిశ, స్పోర్ట్స్: సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సిరీస్‌కు సమయం ఆసన్నమైంది. హైదరాబాద్‌ వేదికగా గురువారం నుంచే తొలి టెస్టు ప్రారంభం కానుంది. తొలి టెస్టులో గెలిచి సిరీస్‌కు శుభారంభం ఇవ్వాలని ఇరు జట్లూ భావిస్తున్నాయి. సొంతగడ్డపై భారత్‌కు తిరుగులేని రికార్డు ఉన్నప్పటికీ, వచ్చిన ప్రతి బంతినీ బాదాలనుకునే ఇంగ్లాండ్ ‘బజ్‌బాల్’ వ్యూహం సవాల్ విసురుతోంది. ఈ బజ్‌బాల్ వ్యూహంతో ఇంగ్లాండ్ చాలావరకు సక్సెస్ అయినప్పటికీ, కొన్ని సందర్భాల్లో మాత్రం విఫలమైంది. ఇదే సమయంలో భారత జట్టులోనూ కొన్ని లోటుపాట్లు కలవరపెడుతున్నాయి. తొలి రెండు టెస్టులకు కోహ్లీ దూరం కావడం, ఓపెనింగ్ జోడీ కుదురుకోకపోతుండటం వంటి అంశాలు భారత్‌కు సవాల్‌గా ఉన్నాయి. అయితే, ఎలాంటి సవాళ్లు ఎదురైనా, వాటిని అధిగమించి విజయం సాధించాలనే లక్ష్యంతో రోహిత్ సేన బరిలోకి దిగనుంది.

కోహ్లీ స్థానంలో ఎవరు?

మొదటి రెండు టెస్టులకు కోహ్లీ దూరమైన నేపథ్యంలో అతని స్థానంలో ఎవరిని తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.పరిస్థితులకు తగ్గట్టుగా ఆడగలిగే స్వభావం ఉన్న విరాట్.. తొలి రెండు టెస్టులకు అందుబాటులో లేకపోవడం జట్టుకు పెద్ద లోటనే చెప్పాలి. ఈ క్రమంలోనే కోహ్లీ స్థానంలో ఎవరు ఆడతారనేదానిపై కెప్టెన్ రోహిత్ శర్మ బుధవారం స్పందించాడు. కోహ్లీ స్థానంలో పుజారా, అజింక్యా రహానేలను తీసుకోవాలని తొలుత అనుకున్నట్టు వెల్లడించాడు. టీమ్ మేనేజ్‌మెంట్, సెలక్టర్లు అనుభవజ్ఞులతోపాటు యువకుల పేర్లనూ పరిశీలించినట్లు చెప్పాడు. చివరగా ‘అనుభవజ్ఞులను తీసుకుంటే యువకులకు ఎప్పుడు అవకాశాలు దక్కుతాయి’ అనే అర్థం వచ్చేలా మాట్లాడాడు. ఈ లెక్కన పుజారా, రహానేకు కాకుండా యువ బ్యాటర్‌ను తీసుకునే అవకాశం ఎక్కువగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం, శ్రేయస్‌కు అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

రోహిత్-యశస్వీ జోడీ కుదురుకునేనా?

జట్టులో ఓపెనింగ్ జోడీ మంచి భాగస్వామ్యాన్ని నిర్మించలేకపోతోంది. ఇది భారత్‌ను కొద్దిరోజులుగా వెంటాడుతున్న సమస్య. ఈ టెస్టులో రోహిత్, యశస్వీ ఓపెనర్లుగా వచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ జోడీ ఇంకా కుదురుకోలేదనే చెప్పాలి. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో వీరి ప్రదర్శనే ఇందుకు నిదర్శనం. సఫారీ గడ్డపై నాలుగు ఇన్నింగ్స్‌ల్లో ఒక్కసారి మాత్రమే వీళ్ల భాగస్వామ్యం 20 పరుగులు దాటింది. ఒకరుకాకపోతే మరొకరు వెంటనే పెవిలియన్‌కు చేరుతున్నారు. దీంతో స్వదేశంలోనైనా ఇద్దరూ కలిసి భారీ భాగస్వామ్యాన్ని అందించాల్సిన అవసరం ఉంది. తర్వాతి స్థానాల్లో వచ్చే గిల్, రాహుల్, శ్రేయస్, జడేజా సైతం మంచి స్కోరు నిర్మించాల్సి ఉంటుంది.

కీపర్‌గా కేఎస్ భరత్!

ఈ సిరీస్‌లో కేఎల్ రాహుల్ కీపింగ్ చేయడని, అతన్ని బ్యాటర్‌గానే పరిగణించామని జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో కీపర్‌గా తెలుగు ప్లేయర్ కేఎస్‌ భరత్‌కు అవకాశం రానున్నట్టు స్పష్టమవుతోంది. కీపింగ్‌లో భరత్ ప్రదర్శన బాగానే ఉన్నప్పటికీ, బ్యాటింగ్‌లో మాత్రం రాణించలేకపోతున్నాడు. ఈసారైనా బ్యాటింగ్‌లో సత్తాచాటాలి. బౌలింగ్‌ దళంలోకి అక్షర్ పటేల్, అశ్విన్, బుమ్రా, సిరాజ్‌లను తీసుకునే అవకాశం ఉంది.

భారత తుది జట్టు అంచనా: రోహిత్ శర్మ(కెప్టెన్), జైశ్వాల్, శుభమన్ గిల్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, జడేజా, కేఎస్ భరత్(కీపర్), అశ్విన్, అక్షర్ పటేల్, బుమ్రా, సిరాజ్

ఇంగ్లాండ్ తుది జట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, బెన్ స్టోక్స్, జానీ బెయిర్‌స్టో(కెప్టెన్), బెన్ ఫోక్స్(కీపర్), టామ్ హార్ట్‌లే, రెహాన్ అహ్మద్, మార్క్ వుడ్, జాక్ లీచ్

* ఇప్పటివరకు ఇండియా, ఇంగ్లాండ్‌ల మధ్య 131 టెస్టులు మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఇంగ్లాండ్ 50 మ్యాచ్‌లలో గెలుపొందగా, భారత్ 31 టెస్టులలో విజయం సాధించింది. 50 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.


Next Story